logo

బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికపై విచారణ

బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సోమవారం యువజన, క్రీడల శాఖ ఏలూరు జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎండీ మెహరాజ్‌ నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

Published : 27 Sep 2022 06:15 IST

విచారణ నిర్వహిస్తున్న మెహరాజ్‌

నూజివీడు, న్యూస్‌టుడే: బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సోమవారం యువజన, క్రీడల శాఖ ఏలూరు జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎండీ మెహరాజ్‌ నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. బాస్కెట్‌ బాల్‌ రాష్ట్ర జట్టు(అండర్‌-18) ఎంపిక నిమిత్తం విశాఖపట్నంలో జూన్‌ 25 నుంచి 28 వరకు నిర్వహించిన పోటీల్లో నూజివీడు క్రీడాకారులకు అన్యాయం చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ యువజన, క్రీడల శాఖ ఏలూరు జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎండీ మెహరాజ్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన విచారణకు నూజివీడు వీటీహెచ్‌ మైదానం బాస్కెట్‌బాల్‌ కోచ్‌(పీఈటీ) వాకా నాగరాజు, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కోచ్‌ నాగరాజు మాట్లాడుతూ వచ్చే నెల 9న చిత్తూరులో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు క్రీడాకారుల సన్నద్ధ శిబిరానికి మెరుగైన ఆట తీరు కనబరిచిన వారిని పక్కనపెట్టి, జిల్లా జట్టులో సరిగ్గా రాణించలేని వారిని ఎంపిక చేశారని వివరించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాకు పంపుతున్నట్లు నాగరాజు తెలిపారు. ఈమేరకు వాటిని సీఈవోకు అందజేశారు. పదో తరగతి చదువుతున్న క్రీడాకారిణి మైథిలి తనకు క్రీడా కోటాలో ట్రిపుల్‌ఐటీ సీటు వస్తుందనే నమ్మకంతో సాధన చేశానని, కానీ శిబిరానికి ఎంపిక కాకపోవడం బాధ కల్గించిందని కన్నీటిపర్యంతమయ్యింది. సమస్యలను కలెక్టరుకు నివేదించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఈవో తెలిపారు.

పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి తగిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పర్యాటక అధికారి ఎండీహెచ్‌ మెహరాజ్‌ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో సోమవారం చేపట్టిన ‘2కె’ ప్రదర్శనను స్థానిక ఇండోర్‌ మైదానం వద్ద ఆయన ప్రారంభించి, మాట్లాడారు. పలు కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు ఈ నెల 27న బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ సహాయ అధికారి పట్టాభిరామన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని