logo

ఇష్టారాజ్యంగా లే అవుట్లు!

నియోజకవర్గ కేంద్రం చింతలపూడి నగర పంచాయతీ అయ్యాక స్థిరాస్తి వ్యాపారం ఊపందుకొంది. ఇదే క్రమంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

Published : 08 Dec 2022 04:34 IST

అనుమతి లేకుండా ప్లాట్ల విక్రయం.. రిజిస్ట్రేషన్లు

బోయగూడెం సమీపంలో అనుమతులు లేకుండా వేసిన వెంచర్‌

చింతలపూడి, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రం చింతలపూడి నగర పంచాయతీ అయ్యాక స్థిరాస్తి వ్యాపారం ఊపందుకొంది. ఇదే క్రమంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగుతున్నా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది.  

గజం రూ.15 వేలకు అటూఇటుగా

నగర పంచాయతీలో పెద్ద సంఖ్యలో వెలిసిన వెంచర్లలో అనధికార ప్లాట్ల అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వానికి నిర్ణీత పన్ను చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే విక్రయిస్తున్నారు. పగలు వ్యవసాయ భూమిగా ఉన్నవి తెల్లారేసరికి వెంచర్లుగా మారిపోతున్నాయి. గత పది రోజుల్లో చింతలపూడి నగర పంచాయతీలో ఐదుకు పైగా లేఅవుట్లు వెలిశాయి. గజం రూ.15 వేలకు అటూ..ఇటుగా అమ్ముతూ రూ.కోట్లు గడిస్తున్నారు.  

క్రమబద్ధీకరణ పేరిట రిజిస్ట్రేషన్లు

వెంచర్లు వేశాక 33 అడుగుల వెడల్పున రహదారులు నిర్మిచడంతో పాటు 10 శాతం స్థలాన్ని జగనన్న కాలనీలకు ఇవ్వాల్సి ఉంది. అసలు డీటీసీపీ అనుమతి లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో స్థలాల కొనుగోలుకు ముందస్తు చెల్లింపులు తీసుకుని వారం రోజుల్లోనే ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో నగర పంచాయతీ ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడుతోంది.

పది మంది కలిసి..  

నగర పంచాయతీలో రహదారుల పక్కన విలువైన భూములను కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసేందుకు ఒక బృందం తయారైంది. వారంతా నగర పంచాయతీ అధికారులకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. మేం ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే నగర పంచాయతీలో 20 ఎకరాలకు పైగా భూమిని వెంచర్ల కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం.

కొనుగోలు చేస్తే ఇబ్బందే..

‘అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి విక్రయించడం నిబంధనలకు విరుద్ధం. ఆయా ప్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. నగర పంచాయతీ అనుమతి లేకుండా ఇటీవల వేసిన లేఅవుట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం’అని చింతలపూడి కమిషనర్‌ నల్లా రాంబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని