logo

పుస్తకం అందక.. సాదన సాగక!

నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలను నిర్వహిస్తోంది.

Published : 25 Jan 2023 05:26 IST

వసతి గృహాల విద్యార్థులపై నిర్లక్ష్యం

పెనుగొండ, పోడూరు, న్యూస్‌టుడే: నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలను నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు దూరంగా వీటిల్లో ఉండి చదువుతున్న వీరి సంక్షేమం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వారికి అవసరమైన పుస్తకాలు సమకూర్చలేకపోతున్నారు. 7, 10 తరగతుల పిల్లలకు ఇచ్చే మాబడి, పాఠశాల పుస్తకాలను ఈ ఏడాది ఇంతవరకూ పంపిణీ చేయలేదు.  ఉమ్మడి జిల్లాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 33 ఉన్నాయి. వీటిలో 7, 10 తరగతుల విద్యార్థులు 405 మంది ఉన్నారు. 96 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా 3,267 మంది 7, 10 తరగతుల విద్యార్థులు చదువుతున్నారు.


పంపిణీ నిలిపివేత

ప్రాథమిక స్థాయి నుంచి అభ్యసన సామర్థ్యాలు ఉండాలని.. ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏడో తరగతి విద్యార్థులకు ‘మాబడి’, పదో తరగతి విద్యార్థులకు ‘పాఠశాల’ పేరుతో నిపుణులతో రూపొందించిన పుస్తకాలను అందించింది. వీటిని ఆ విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు పంపిణీ చేసి, మంచి మార్కులు సాధించే దిశగా చదివించేవారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పుస్తకాలు అందించి ఉంటే మెరుగైన ఫలితాల సాధనకు, పునశ్చరణకు విద్యార్థులకు ఉపయోగపడేవని వసతిగృహాల పర్యవేక్షకులు చెబుతున్నారు. ఆ పుస్తకాలు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాన్ని  అధికార వర్గాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాయని వాపోయారు.


ఆయా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం

వసతి గృహాల యాజమాన్యాల నుంచి ఏ విధమైన పుస్తకాలు అందించలేదు. పాఠశాలల్లో ఇచ్చిన ప్రత్యేక పుస్తకాలనే విద్యార్థులు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ప్రతి పాఠ్యాంశానికి వసతి గృహాల్లో బోధకులను ఏర్పాటు చేశాం. మంచి ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ చేపట్టాం.

ఆర్వీ నాగరాణి, జిల్లా సంక్షేమాధికారిణి, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని