జాగా కనిపిస్తే పాగా!
భూదందాలు, ఆక్రమణలకు జంగారెడ్డిగూడెం అడ్డాగా మారుతోంది. ప్రభుత్వ, సీలింగ్, వివాదాస్పదమైనవి, రెవెన్యూ దస్త్రాల్లో సమస్యలున్నవి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్న భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు.
వెల్లువలా నకిలీ పట్టాల సృష్టి
భూదందాలకు అడ్డాగా జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే
జంగారెడ్డిగూడెం వినాయకుడి గుడి వెనుక పాకల తొలగింపు
భూదందాలు, ఆక్రమణలకు జంగారెడ్డిగూడెం అడ్డాగా మారుతోంది. ప్రభుత్వ, సీలింగ్, వివాదాస్పదమైనవి, రెవెన్యూ దస్త్రాల్లో సమస్యలున్నవి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్న భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇప్పటికే దందాల ద్వారా ఆర్థిక భరోసా లభించడంతో వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేంత స్థాయికి ఎదిగారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు విశ్రాంత అధికారుల సంతకాలతో ఇబ్బడిముబ్బడిగా నకిలీ పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. చివరకు ముద్రలు కూడా తయారు చేసి ఉపయోగిస్తున్నారు. కర్మాగారాలు, చెరువుల స్థలాలకు సైతం పట్టాలు పుట్టుకొస్తున్నాయి. భూమి ఒక సర్వే నంబరులో ఉంటే సమీపంలోని నంబర్లతో డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసి లాగేసుకుంటున్నారు.
* మాజీ సైనికుడు ఎ.గోపాలకృష్ణ పేరున రామచర్లగూడెంలో 5.30 ఎకరాలకు పట్టాలు సృష్టించారు.
* 192 సర్వే నంబరులో 81 సెంట్ల డొంక పోరంబోకు, 6.36 ఎకరాల గ్రామకంఠం భూమికి మరో మాజీ సైనికుడు చీపూరు సూర్యనారాయణ పేరుతో 1995 సెప్టెంబరు 23న పట్టాలు జారీ అయినట్లు నకిలీవి తయారుచేశారు. ఈ భూమి కొంత కాలం నుంచి రెవెన్యూ అధీనంలో ఉంది.
* ఏలూరు రోడ్డులోని 65/1 సర్వే నంబరులో 92 సెంట్లు భూమికి గుణ్ణం లీలాకుమారి పేరున నకిలీ పట్టా రూపొందించారు. ఈ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని గిరిజన విద్యార్థుల వసతిగృహానికి కేటాయించారు. ఈ పట్టాల తయారీకి తహసీల్దార్ కార్యాలయ ముద్రలు నకిలీవి తయారు చేసి ఉపయోగించారు. దీనిపై గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసులు నమోదయ్యాయి.
* ఎస్.గణేష్ అనే మాజీ సైనికుడి పేరున జంగారెడ్డిగూడెం పట్టణంలో 366/2బి1 సర్వే నంబరుతో ఐదు ఎకరాల భూమికి పట్టా సృష్టించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా ఉన్న సత్యనారాయణరాజు పేరుతో అది రూపొందింది. అది నకిలీదని ప్రస్తుత తహసీల్దారు స్లీవజోజి ఇటీవల నిర్ధరించారు. ఈ మేరకు కోర్టుకు నివేదించారు. ఈ విషయమై సత్యనారాయణరాజును విచారించినట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీనివాసపురం సమీపంలో ఉన్న ఓ భారీ కర్మాగారం స్థలం ఉన్న ప్రదేశానికి సంబంధించి ఈ నకిలీ పట్టా రూపొందించినట్లు తహసీల్దార్ తెలిపారు.
* పట్టణంలోని 449 సర్వే నంబరులో 5 సెంట్ల భూమిలో ఇటీవల కొందరు పాకలు వేశారు. తన స్థలాన్ని మద్దిపాటి భద్రం, తగరం ఇస్మాయిల్, శ్రీను, వసంతాటి మంగరాజు, పేరి ప్రసాద్, షాన్‌బాషా తదితరులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు చిన్నం కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్న పోలీసు సూచనలతో ఇరువర్గాలను ఈ స్థలంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు తహసీల్దార్ 145 సెక్షన్ విధించారు. దీనిపై ఈ నెల 16న విచారణ చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని ఆయన చెబుతున్నారు. విచారణ సమయంలో ఆక్రమణకు యత్నించిన వ్యక్తులు ఎటువంటి పట్టా చూపలేకపోయారు. ఇక్కడ వెలిసిన పాకలను రెవెన్యూ అధికారులు తొలగించారు. మాజీ తహసీల్దారు సత్యనారాయణరాజు జారీ చేసినట్లుగానే ఇక్కడ ఓ పట్టా పుట్టించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
* గ్రామ కంఠం భూములకు డి.నమూనా పట్టాలు ఇవ్వరు. కానీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి సమీపంలో ఓ స్థలానికి జారీ అయ్యాయి. ఈ స్థలం విషయంలో పట్టాదారులకు న్యాయం చేయాలని ఉద్యమాలు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. ఓ నాయకుడు రూ.లక్షల్లో దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విలువైన ఈ స్థలానికి ఓ రెవెన్యూ అధికారి సవరణ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడ ఖరీదైన కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
* పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో కొన్ని నిర్మాణాలను రెవెన్యూ, పురపాలక అధికారులు గత వారం తొలగించారు. 450/4 సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తులు 704 సర్వే నంబరులో భూమిని ఆక్రమించి కట్టడాలు చేస్తున్నారని తహసీల్దార్ స్లీవ జోజి తెలిపారు. ఈ కారణంగా తాము ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. పునాదుల వరకు వేసిన భవనం పనులు ఆపించారు. 704లో 1.62 ఎకరాలను ప్రభుత్వ స్థలంగా గుర్తించారు. ఇందులో 1.06 ఎకరాల్లో అశ్వారావుపేట రోడ్డు ఉంది. మిగిలిన 56 సెంట్ల స్థలం ఆక్రమణల్లో ఉంటే అందులో 17 దుకాణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కాగా దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు.
అశ్వారావుపేట రోడ్డులో కట్టడాల తొలగింపు
‘నకిలీ పట్టాలు, భూ దందాలపై విచారణ చేస్తాం. అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. అక్రమ కట్టడాలను తొలగి స్తున్నాం’ అని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి