logo

పేరు వెల్లువ.. తీరు వెలవెల!

పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది.

Published : 28 Mar 2024 04:27 IST

అరకొరగానే కేంద్రాల నిర్మాణాలు  

ఆకివీడు, వీరవాసరం, ఏలూరు వన్‌టౌన్‌, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా రైతుల నుంచి పాలను కొనుగోలు చేసేలా ప్రతి గ్రామ సచివాలయాల పరిధిలో సేకరణ కేంద్రాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఏలూరు జిల్లాకు తొలివిడతగా 73 బల్క్‌మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కో భవనాన్ని రూ.17.67 లక్షలతో నిర్మించేందుకు మూడేళ్ల కిందట పనులు ప్రారంభించారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే భవనాలు పూర్తవగా మరో రెండు ప్రాంతాల్లో తుది దశకు చేరాయి. మిగిలిన చోట్ల పనులే ప్రారంభించలేదు. బిల్లులు విడుదల చేయక పోవడంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపలేదు.


కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో రూ.17 లక్షలతో  బల్క్‌ మిల్‌్్్క కలెక్షన్‌ యూనిట్‌ (బీఎంసీయూ) నిర్మాణం చేపట్టిన ప్రాంతమిది. అప్పట్లో కొందరు గ్రూపు సభ్యులు కొంత సొమ్ము వేసుకొని నిర్మాణం ప్రారంభించారు. పిల్లర్ల నిర్మాణానికి ఇనుప చువ్వల అమరిక పూర్తయ్యాక బిల్లుల మంజూరులో జాప్యంతో వారంతా వెనుకడుగు వేశారు. తర్వాత పట్టించుకున్నవారు లేరు. మండలంలో రామానుజపురంలో నిర్మాణానిదీ ఇదే పరిస్థితి.


వీరవాసరం మండలం కొణితివాడలో పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు ఈ స్థలంలో  శంకుస్థాపన  శిలాఫలకాన్ని ఆవిష్కరించినా పనులు ప్రారంభం కాలేదు. భీమవరం నియోజకవర్గ పరిధిలో 20 వరకు కేంద్రాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా ఎక్కడా కార్యరూపం దాల్చలేదు.


పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా భవనాలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిలో చాలా నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తొలుత గ్రామాల్లో పాడి పశువుల సంఖ్య, పాల ఉత్పత్తిని అంచనా వేయకుండానే సేకరణ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. తరువాత పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుందనే కారణంతో కొన్ని  చోట్ల నిర్మాణాలను నిలిపివేశారు.


వచ్చే ఏడాదిలోగా పూర్తి.. ‘ప్రస్తుతం ప్రాధాన్య భవనాల పనులు చేపడుతున్నాం. అవి పూర్తి చేసిన తర్వాత మిగిలినవి చేపడతాం. వచ్చే ఏడాదిలోగా పాల సేకరణ కేంద్రాల (బీఎంసీయూ) పనులు చేపట్టి పూర్తి చేస్తాం’ అని ఏలూరు జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కేదారేశ్వరరావు తెలిపారు. పాల ఉత్పత్తి అనుకున్న స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వీటి నిర్మాణాలు ప్రారంభించినట్లు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌ డీఈ జి. స్వామినాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని