logo

నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు.

Published : 18 Apr 2024 05:11 IST

మాట్లాడుతున్న ప్రసన్న వెంకటేశ్‌, పక్కన జేసీ, ఎస్పీ తదితరులు
ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు  కార్యాలయ పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంట్‌కు సంబంధించి కలెక్టరేట్‌లో, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో  స్వీకరిస్తారన్నారు. ఈనెల 26న నామపత్రాల పరిశీలన కాగా..ఉపసంహరణకు 29 వరకు గడువు విధించారని తెలిపారు. అదేరోజు పోటీలో నిలిచే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామన్నారు. మే 13 పోలింగ్‌ నిర్వహిస్తామని, జూన్‌ 4న ఓట్లను లెక్కించి విజేతల వివరాలను ప్రకటిస్తామని అన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఈనెల 15 వరకు అందిన ఫారం-6 దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఫారం-7, 8 దరఖాస్తులను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

 22 వేల మందికి పోస్టల్‌బ్యాలెట్‌.. 85 ఏళ్లు పైబడిన వారితోపాటు 40 శాతంకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారికి హోమ్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. తపాలా బ్యాలెట్‌ వినియోగించుకునే వారు సుమారు 22 వేల మంది వరకు ఉండొచ్చన్నారు. నామ పత్రాల దాఖలుకు చివరి తేదీ అనంతరం తపాలా బ్యాలెట్లను జారీ చేస్తామన్నారు.
పరిశీలకుల నియామకం.. ఎన్నికల వ్యయ పరిశీలకులు ముగ్గురు గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారని అన్నారు. వీరు ఈనెల 24న విధులకు హాజరవుతారని వివరించారు.
జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రచారంలో వ్యక్తిగత దూషణలు చేయకూడదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని