logo

ఇక నామినేషన్ల పర్వం

సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 18 Apr 2024 06:10 IST

ఎన్నికల్లో తొలి అంకానికి ఏర్పాట్లు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న పరిశీలన పూర్తవుతుంది. 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్లు లెక్కింపు ఫలితాలు వెల్లడిస్తారు.

ఆ రోజు నుంచే వ్యయం లెక్క..

 అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి వారి ఖర్చులు ఎన్నికల వ్యయం లెక్కల్లోకి వస్తాయని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు. నామినేషన్‌ వేసే ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేస్తామని వెల్లడించారు. అభ్యర్థులకు ఇచ్చిన చెక్‌లిస్టును డూప్లికేట్‌ తయారు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియపై సందేహాలుంటే హెల్ప్‌డెస్కులో సంప్రదించవచ్చన్నారు.

 నిబంధనలు ఇవీ..

  • పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు భీమవరంలోని కలెక్టరేట్‌లో, అసెంబ్లీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి. అన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని తరలించి భద్రపరిచారు.
  • పార్లమెంటు అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 50 శాతం డిపాజిట్‌ చెల్లిస్తే సరిపోతుందని అధికారులు ప్రకటించారు.
  • నామపత్రాల దాఖలుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో నలుగుర్ని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తారు. మూడు వాహనాలను కార్యాలయం వద్దకు అనుమతిస్తారు. వాటిని 100 మీటర్ల దూరంలో నిలపాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేయవచ్చు.
  • అభ్యర్థిని ప్రతిపాదించే వారి పేరు ఓటరు జాబితాలో ఉన్న ఓటు సంఖ్య వివరాల నకళ్లను జతచేయాలి. పార్లమెంటు అభ్యర్థులైతే ఫారం-ఎ, అసెంబ్లీ అభ్యర్థులు ఫారం-బి సమర్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని