లఖ్‌నవూ సిక్సర్‌

ముంబయి ప్లేఆఫ్స్‌ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది.

Updated : 01 May 2024 06:47 IST

 ఖాతాలో ఆరో విజయం
 ముంబయిపై గెలుపు
 రాణించిన స్టాయినిస్‌, మోసిన్‌

ముంబయి ప్లేఆఫ్స్‌ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. అటు బంతితో ముంబయిని చుట్టేసిన లఖ్‌నవూ... బ్యాట్‌తో కాస్త తడబడినా ఎట్టకేలకు గట్టెక్కింది. ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు వేసింది. బౌలింగ్‌లో మోసిన్‌ఖాన్‌, స్టాయినిస్‌ ఆల్‌రౌండ్‌ జోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 10 మ్యాచ్‌ల్లో ఏడో ఓటమితో ముంబయి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

లఖ్‌నవూ

స్వల్ప స్కోర్ల ఆటలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మరోసారి పైచేయి సాధించింది. మంగళవారం ముంబయిని 4 వికెట్ల తేడాతో ఓడించింది. మందకొడి పిచ్‌పై పరుగులు చేయడంలో విఫలమైన ముంబయి మొదట 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. నేహల్‌ వధేరా (46; 41 బంతుల్లో 4×4, 2×6), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌; 18 బంతుల్లో 3×4, 1×6) జట్టుకు కాస్త పోరాడే స్కోరు అందించారు. మోసిన్‌ఖాన్‌ (2/36), స్టాయినిస్‌ (1/19) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో స్టాయినిస్‌ (62; 45 బంతుల్లో 7×4, 2×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.

నిలిచిన స్టాయినిస్‌: ఛేదనలో లఖ్‌నవూ కూడా తడబడింది. తొలి ఓవర్లోనే ఆ జట్టు వికెట్‌ కోల్పోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అర్షిన్‌ కులకర్ణి (0) డకౌట్‌ అయ్యాడు. ఈ స్థితిలో కెప్టెన్‌ రాహుల్‌ (28; 22 బంతుల్లో 3×4, 1×6), స్టాయినిస్‌ తోడుగా ఇన్నింగ్స్‌ నడిపించాడు. మొదట స్టాయినిస్‌ బాదుడు మొదలుపెట్టగా.. రాహుల్‌ అతడికి తోడయ్యాడు. తుషార వేసిన అయిదో ఓవర్లో రాహుల్‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ధోని తరహాలో కొట్టిన ఓ హెలికాప్టర్‌ షాట్‌ ఆకట్టుకుంది. బుమ్రా బౌలింగ్‌లో స్టాయినిస్‌ కూడా ఓ సిక్స్‌ అందుకోవడంతో పవర్‌ప్లే ఆఖరికి లఖ్‌నవూ 52/1తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. రాహుల్‌ను హార్దిక్‌ ఔట్‌ చేసినా.. ఎల్‌ఎస్‌జీ ఒత్తిడిలో పడలేదు. సమీకరణం (72 బంతుల్లో 84) అందుబాటులో ఉండడమే కారణం. ముంబయి బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో దీపక్‌ హుడా (18) సహకారంతో స్టాయినిస్‌ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. ఈ జోడీ బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడి మిగతా బౌలర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించింది. బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో ఎక్కువగా సింగిల్స్‌తోనే స్కోరు పెంచింది. 24 పరుగుల వ్యవధిలో హుడా, స్టాయినిస్‌, టర్నర్‌ (5) వికెట్లు పడినా ఎల్‌ఎస్‌జీ కంగారు పడలేదు. కానీ 2 ఓవర్లలో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో హార్దిక్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి బదోని (6) రనౌట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ పూరన్‌ (14 నాటౌట్‌) ఒత్తిడికి గురి కాకుండా పని పూర్తి చేశాడు. లఖ్‌నవూ మరో 4 బంతులు ఉండగా లక్ష్యాన్ని అందుకుంది.

ముంబయి తడబడి..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇన్నింగ్స్‌ తడబాటుతో మొదలైంది. ఒక దశలో ఆ జట్టు 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కిషన్‌ (32; 36 బంతుల్లో 3×4), నేహల్‌ వధేరా, డేవిడ్‌ ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మొదట లఖ్‌నవూ బౌలర్ల దెబ్బకు పవర్‌ప్లేలోపే ముంబయి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. బర్త్‌డే బాయ్‌ రోహిత్‌ (4).. మోసిన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లకు ముంబయి చేసింది 28 పరుగులే పైగా సూర్యకుమార్‌ (10), తిలక్‌వర్మ (7), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (0) పెవిలియన్‌  చేరిపోయారు. నవీనుల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో తిలక్‌ రనౌట్‌ కాగా హార్దిక్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ స్థితిలో ఓపెనర్‌ కిషన్‌, నేహల్‌తో వికెట్ల పతనాన్ని ఆపాడు. కానీ ఎల్‌ఎస్‌జీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కిషన్‌, నేహల్‌ వేగంగా ఆడలేకపోయారు. 13 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 4 వికెట్లకు 73 పరుగులే. కిషన్‌ వెనుదిరిగాక నేహల్‌ బ్యాట్‌ ఝుళించాడు. 15వ ఓవర్లో అతడు రెండు సిక్స్‌లు, ఫోర్‌ అందుకోవడంతో ముంబయి ఇన్నింగ్స్‌లో కదలిక వచ్చింది. ఆ తర్వాత నేహల్‌ ఔటైనా.. డేవిడ్‌ ధాటిగా ఆడడంతో ముంబయి స్కోరు 140 దాటింది. చివరి 3 ఓవర్లలో ముంబయి 32 పరుగులు రాబట్టింది. నవీనుల్‌ హక్‌ (1/15), రవి బిష్ణోయ్‌ (1/28) రాణించారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (1/31) ఆకట్టుకున్నాడు.

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) మయాంక్‌ (బి) బిష్ణోయ్‌ 32; రోహిత్‌ (సి) స్టాయినిస్‌ (బి) మోసిన్‌ఖాన్‌ 4; సూర్యకుమార్‌ (సి) రాహుల్‌ (బి) స్టాయినిస్‌ 10; తిలక్‌వర్మ రనౌట్‌ 7; హార్దిక్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 0; నేహల్‌ వధేరా (బి) మోసిన్‌ ఖాన్‌ 46; డేవిడ్‌ నాటౌట్‌ 35; నబి (బి) మయాంక్‌ 1; కొయెట్జీ నాటౌట్‌ 1 ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-7, 2-18, 3-27, 4-27, 5-80, 6-112, 7-123; బౌలింగ్‌: స్టాయినిస్‌ 3-0-19-1; మోసిన్‌ఖాన్‌ 4-0-36-2;  నవీనుల్‌ హక్‌ 3.5-0-15-1; మయాంక్‌ యాదవ్‌ 3.1-0-31-1;  రవి బిష్ణోయ్‌ 4-0-28-1; దీపక్‌ హుడా 2-0-13-0

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) నబి (బి) హార్దిక్‌ 28; అర్షిన్‌ కులకర్ణి ఎల్బీ (బి) తుషార 0; స్టాయినిస్‌ (సి) తిలక్‌ (బి) నబి 62; దీపక్‌ హుడా (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 18; పూరన్‌ నాటౌట్‌ 14; టర్నర్‌ (బి) కొయెట్జీ 5; బదోని రనౌట్‌ 6; కృనాల్‌ నాటౌట్‌ 1;  ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 145; వికెట్ల పతనం: 1-1, 2-59, 3-99, 4-115, 5-123, 6-133; బౌలింగ్‌: నువాన్‌ తుషార 4-0-30-1; బుమ్రా 4-0-17-0; కొయెట్జీ 3-0-29-1; పియూష్‌ చావ్లా 3-0-23-0; హార్దిక్‌ పాండ్య 4-0-26-2; నబి 1.2-0-16-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని