పసిడి ధరహాసంలోనూ గిరాకీ

పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది.

Updated : 01 May 2024 06:50 IST

జనవరి-మార్చిలో 136.6 టన్నుల కొనుగోళ్లు

పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. 2023 ఇదే త్రైమాసిక గిరాకీ 126.3 టన్నులతో పోలిస్తే ఇది 8% ఎక్కువ. బంగారం కొనుగోళ్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దూకుడు కూడా ఇందుకు కలిసొచ్చింది. సమీక్షా త్రైమాసికంలో 19 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. 2023 మొత్తంమీద ఆర్‌బీఐ కొనుగోలు చేసిన బంగారం 16 టన్నులే కావడం గమనార్హం. విలువ పరంగా చూస్తే దేశీయ పసిడి గిరాకీ 20% పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. త్రైమాసికంలో సగటు ధర 11% పెరిగినా.. పుత్తడికి గిరాకీ ఇంతగా లభించిందని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ1 2024’ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం..

ఈ ఏడాది 700-800 టన్నుల మేర

దేశీయంగా పసిడికి మొత్తం గిరాకీ (ఆభరణాలు, పెట్టుబడులు కలిపి) 2023 జనవరి-మార్చిలో 126.3 టన్నులుగా ఉండగా.. ఈ ఏడాది ఇదే కాలంలో 136.6 టన్నులకు పెరిగింది. ఆభరణాల గిరాకీ (4%)తో పోలిస్తే, పెట్టుబడుల గిరాకీ (19%)లో వృద్ధి అధికంగా ఉంది. భారత్‌కున్న బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులే, పసిడి ఆభరణాల గిరాకీకి మద్దతుగా నిలిచినట్లు   డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో పసిడికి గిరాకీ 700-800 టన్నులుగా ఉండొచ్చని అంచనా వేశారు. బంగారం ధరలు మరీ ఎక్కువగా పెరిగితే 700 టన్నులకు పరిమితం కావొచ్చన్నారు. 2023లో ఇది 747.5 టన్నులుగా నమోదైంది.

తొలి సారిగా..

సాధారణంగా భారత్‌, చైనా మార్కెట్లలో పసిడి ధరలు తగ్గినప్పుడు, గిరాకీ పెరుగుతుంది. పశ్చిమ దేశాల్లో పెట్టుబడుల రీత్యా కొంటారు కనుక ఇందుకు విరుద్ధ ధోరణి ఉంటుంది. అయితే తొలిసారిగా భారత, చైనా మార్కెట్లలో బంగారం ధరలు పెరిగినా.. గిరాకీ రాణించడం విశేషమని జైన్‌ తెలిపారు. ఆర్‌బీఐ 2023లో 16 టన్నులు పసిడి కొనగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 19 టన్నులు సొంతం చేసుకోవడం కూడా కలిసివచ్చిందన్నారు.

విలువ పరంగా చూస్తే..

  • దేశీయంగా పసిడి గిరాకీ విలువ రూ.63,090 కోట్ల నుంచి రూ.75,470 కోట్లకు చేరింది. ఇందులో ఆభరణాల గిరాకీ రూ.45,890 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.52,750 కోట్లకు; పెట్టుబడుల గిరాకీ రూ.17,200 కోట్ల నుంచి 32% అధికంగా రూ.22,720 కోట్లకు చేరుకుంది.
  • పాత బంగారం మార్పిడి 38.3 టన్నులుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 10% అధికం.
  • త్రైమాసిక సగటు ధర (10గ్రా.) రూ.49,943.80 నుంచి రూ.55,247.20కు చేరుకుంది. (దిగుమతి సుంకం, జీఎస్‌టీ లేకుండా).

ప్రపంచ గిరాకీ సైతం: ప్రపంచ స్థాయిలోనూ పసిడికి గిరాకీ జనవరి-మార్చిలో వార్షికంగా 3% పెరిగి 1238 టన్నులకు చేరింది. 2016 తర్వాత బలమైన త్రైమాసికం ఇదే. అధిక ధరల్లోనూ ఈ రికార్డు సాధించడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు మొత్తం మీద 290 టన్నుల బంగారాన్ని జత చేసుకున్నాయి.

  • ఎలక్ట్రానిక్స్‌ రంగంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం అధికమైనందున, సాంకేతిక పరికరాల రంగంలోనూ పసిడికి గిరాకీ 10% పెరిగింది.
  • సరఫరా వైపు చూస్తే.. ఉత్పత్తి 4% హెచ్చి 893 టన్నులకు చేరింది. 2024లో మరింత ఉత్పత్తి నమోదు కావొచ్చని అంచనా.
  • రేట్ల కోతలు, ఎన్నికల ఫలితాలను బట్టి పసిడిపై తిరిగి పెట్టుబడులు పెట్టే సునిశిత కొనుగోలుదార్లు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని