పదిలో 91.31% ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్‌గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు.

Published : 01 May 2024 05:53 IST

నిరుటి కంటే పెరుగుదల.. బాలికలదే పైచేయి
99.09 శాతంతో నిర్మల్‌ జిల్లా ఫస్ట్‌.. 65.10 శాతంతో వికారాబాద్‌ లాస్ట్‌
8,883 మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ
3,927 పాఠశాలల్లో వంద శాతం పాస్‌
తెలుగులో గట్టెక్కని 2.88% మంది  
జూన్‌ 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్‌గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటుగా పరీక్షలు రాసినవారిలో 49.73% మంది గట్టెక్కారు. రెగ్యులర్‌కు సంబంధించి 99.09% ఉత్తీర్ణతతో నిర్మల్‌ తొలి స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27% ఫలితాలతో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వికారాబాద్‌ 65.10% ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్‌ శ్రీదేవసేనలు మంగళవారం రాష్ట్ర విద్యాశిక్షణ మండలి కార్యాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 3,927 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు పాస్‌ కాగా, 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. అందులో నాలుగు ప్రైవేటు కాగా రెండు ఎయిడెడ్‌వి. ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయిగా ఉంది. బాలుర (89.42%) కంటే బాలికలు (93.23%) 3.81% అధికంగా ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 8,883 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారు. గతేడాది ఫలితాలతో (89.60%) పోలిస్తే ఉత్తీర్ణత 1.71% పెరిగింది. 2022లో 90 శాతం ఉత్తీర్ణత వచ్చిన విషయం తెలిసిందే.

ఆంగ్ల మీడియంలో అధికం..

ఆంగ్ల మీడియంలో 93.74% మంది ఉత్తీర్ణత సాధించగా, తెలుగు మాధ్యమంలో 80.71% మంది పాసయ్యారు. తెలుగు సబ్జెక్టులో 2.88% ఫెయిల్‌ అయ్యారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని గురుకుల విద్యాలయాల సంస్థ 98.71% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 86.03%, ప్రభుత్వ పాఠశాలల్లో 80.18% మంది పాసయ్యారు. మంగళవారం నుంచి 15 రోజుల పాటు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అవకాశమిచ్చింది. జూన్‌ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ఇక్కడ శతశాతం ఫలితాలు..

 రాష్ట్రంలో మొత్తం 11,469 పాఠశాలలకు గానూ.. 3,927 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. ఇందులో 1814 ప్రైవేటు, 1347 జడ్పీ, 177 కేజీబీవీ, 142 బీసీ గురుకులాలు, 112 ఎస్సీ గురుకులాలు, 81 ఆశ్రమపాఠశాలలు, 77 మైనారిటీ, 60 మోడల్‌, 39 ఎస్టీ గురుకులాలు, 37 ప్రభుత్వ, 24 ఆర్‌ఈఎస్‌, 17 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి.
రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు

15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

మే 1 నుంచి 15 వరకు విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం రూ.500, రీవెరిఫికేషన్‌, డూప్లికేట్‌ ప్రశ్నపత్రాల కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం చేయించి, హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.  రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం చేయరాదు.

సప్లిమెంటరీ పరీక్షలకు మే 16 వరకు దరఖాస్తు

జూన్‌ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆలస్య రుసుం లేకుండా మే 16 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని