logo

మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ

కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది.

Published : 30 Apr 2024 06:52 IST

నాగ శ్రావణి (పాత చిత్రం)

 తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాలు... విశాఖపట్నానికి చెందిన ఎం.శ్రీనివాస్‌, సత్యకుమారిల ఏకైక కుమార్తె నాగ శ్రావణిని అయిదేళ్ల కిందట జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు (విశ్రాంత రైల్వే ఉద్యోగి), సూర్యకుమారిల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు రిశాంత్‌ కుమార్‌, కుమార్తె జస్విత సూర్యశ్రీ సంతానం ఉన్నారు. శ్రీనివాసరావు రెండేళ్ల కిందట జీవనోపాధికి దుబాయి వెళ్లారు. నాగ శ్రావణి తన పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో ఒక శుభకార్యానికి అత్తమామలతో కలిసి వెళ్లారు. ఇంటికొచ్చాక తన కుమారుడి నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించపోడాన్ని గమనించారు. అజాగ్రత్తగా ఉంటున్నావంటూ కుమారుడిని కొట్టారు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆమెపై గొడవకు దిగారు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న శ్రావణి తలపై అతడు పచ్చడి బండతో బాదడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియాసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవరావుతో పాటు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తరచూ తన కుమార్తె నాగశ్రావణిని ప్రతి చిన్న విషయానికీ మామ కేశవరావు నిందిస్తూ ఉంటాడని మృతురాలి తండ్రి ఎం.శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


 రూ.5 లక్షల సరకు స్వాధీనం

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: ఏలూరులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఔషధాలను అధికారులు పట్టుకున్నారు. ఔషధ తనిఖీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ ఆదేశాలతో ఏలూరు డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ బాలు, భీమవరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అబిద్‌ అలీ తమ సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని ఓ హోల్‌సేల్‌ ఔషధ దుకాణంలో పని చేస్తున్న బొంతు త్రినాథ్‌ కొత్తపేటలో ఉంటున్నారు. అతను తన నివాసంలో అనధికారికంగా మందులు నిల్వ ఉంచారనే సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. ఎటువంటి బిల్లులు, పత్రాలు లేని సుమారు రూ.5 లక్షల విలువైన ఆల్‌జోలమ్‌, వయాగ్రా, అబార్షన్‌ కిట్లను గుర్తించారు. వీటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి.. ఇక్కడి మందుల దుకాణాలకు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. త్రినాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తమకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అతన్ని కూడా విచారించాల్సి ఉందన్నారు. త్రినాథ్‌ పనిచేస్తున్న హోల్‌సేల్‌ దుకాణం యజమానికి వీటితో సంబంధముందా అనే కోణంలోనూ విచారణ జరపనున్నట్లు తెలిపారు.
బయట పడిందిలా... చింతలపూడిలోని ఓ మందుల దుకాణంలో ఇటీవల ఔషధ తనిఖీ అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని అనధికారిక మందులు లభ్యం కావడంతో వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారని ఆరా తీయగా ఏలూరులోని ఇద్దరు వ్యక్తులు అమ్ముతున్నట్లు చెప్పడంతో అధికారులు నిఘా పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని