logo

కక్ష రాజకీయాలు మనకొద్దు

అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు.

Published : 01 May 2024 04:51 IST

మాట్లాడుతున్న రామాంజనేయులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన ది బులియన్‌ ధర్మకాటా అసోసియేషన్‌ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పాలకులు ఓటు వేయలేదంటూ ప్రజలపైనా వేధింపులకు పాల్పడుతున్నారని.. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మనకొద్దని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రజలంతా నా వాళ్లే అనుకునే స్వభావం తనదని.. గతంలో పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించానని పేర్కొన్నారు. వైకాపాకు మళ్లీ అధికారం ఇస్తే పేదలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు విజ్జురోతి వెంకటరమణ, కార్యదర్శి యక్కల శ్రీనివాసు, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, ఎద్దు ఏసుపాదం, మెరగాని అప్పారావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, జూలూరి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ః పలువురు దివ్యాంగులు పులపర్తి ప్రశాంత్‌ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. వారికి పార్టీ పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్‌ పార్టీ కండువా కప్పారు. చినపేటకు చెందిన మహిళలు కొందరు రామాంజనేయులు సమక్షంలో జనసేనలో చేరారు. తెదేపా ముస్లిం మెనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు నౌషాద్‌, నాయకులు పాల్గొన్నారు. ః  డాన్స్‌ మాస్టర్‌ జానీ ఆధ్వర్యంలో జనసేనకు మద్దతుగా 39వ వార్డులో ప్రచారం నిర్వహించారు.

కూటమితోనే యువతకు ఉపాధి.. కొణితివాడ (వీరవాసరం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాయకుదురు, చింతలకోటిగరువు, కొణితివాడ, మడుగుపోలవరం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయకుదురు, కొణితివాడల్లో మహిళలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్‌నాయకుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని