logo

జగన్‌ పాలనలో నిర్మాణ రంగం కుదేలు

అయిదేళ్ల జగన్‌ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.

Published : 02 May 2024 04:14 IST

భీమవరం: అంజిబాబుకు హారతి ఇస్తున్న మహిళలు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అయిదేళ్ల జగన్‌ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. భీమవరం తాలూకా తాపీ పనివారల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా సర్కారు అనాలోచిత విధానాలతో ఇసుక కొరత ఏర్పడి ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి రావడంతోనే అమరావతిలో ప్రజావేదికను కూల్చిన జగన్‌ సర్కారు అయిదేళ్లూ విధ్వంస కాండ కొనసాగించిందని విమర్శించారు. నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, గాయపడినా ప్రమాద బీమాగా రూ. 5 లక్షల వరకు తెదేపా ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్‌ సర్కారు ఈ అయిదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. నిర్మాణరంగ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా అమలును భాజపా, జనసేన, తెదేపా కూటమి మ్యానిఫెస్టోలో చేర్చినట్లు తెలిపారు. త్వరలోనే కార్మికులకు చేతి నిండా పనిదొరికే రోజులు రానున్నాయన్నారు. ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అడబాల రామకృష్ణ, నాయకులు మేడిది రమణ, మెల్లా సత్యనారాయణ,  రమేష్‌, కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. బీ భీమవరంలోని 16 నుంచి 20వ వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రతి కూడలిలో మహిళలు ఆయనకు హారతులిచ్చి ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని