logo

ఓటర్లకు తాయిలాలు..నాయకులకు ప్యాకేజీలు!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Published : 07 May 2024 05:46 IST

పల్లెల్లో అధికార పార్టీ పంపకాల పందేరం

ఇటీవల వీరవాసరం మండలం నందమూరుగరువులో ప్రచారం చేస్తున్న వాలంటీర్లు

 భీమవరం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజీనామా లేఖలు ఇచ్చిన వాలంటీర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి వారితో ఇంటింటి ప్రచారం, సర్వేలు చేయిస్తున్నారు.

 స్థాయిని బట్టి..

ఎన్నికల ప్రచారంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర ఎంతో కీలకం. ప్రచార సమయంలో జనసమీకరణ బాధ్యత వీరిపైనే ఉంటుంది. అందుకే పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు నగదు బహుమతులు ఇస్తున్నారు. నాయకుల బలాన్ని బట్టి అభ్యర్థులు ఒక్కొక్కరికీ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఇస్తున్నారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రూ.వేలల్లో నగదు, ఇతర తాయిలాలు అందజేశారు. నిత్యం ప్రచారంలో పాల్గొనే వారికి భోజనాలు, పెట్రోలు కూపన్లు, ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ. 500 వరకు నగదు అందజేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు సోషల్‌ మీడియా కన్వీనర్లు, వాలంటీర్లకు ఇప్పటికే రూ. వేలల్లో ముట్టజెప్పారు.

  •  అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లకు ఎంత ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. నరసాపురం, పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో అభ్యర్థులు రూ.1000 నుంచి రూ.1,500 వరకు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
  •  భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 2000 వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో పరిస్థితులను బట్టి ఈ మొత్తం పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇచ్చే నగదుతో పాటు అభ్యర్థి గెలుపొందిన తరువాత మరికొంత సొమ్ము పొందేలా కూపన్లు సిద్ధం చేస్తున్నారు.

తపాలా ఓట్లకూ ఎర

వయోవృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం ‘ఇంటి నుంచే ఓటు’ సదుపాయం కల్పించింది. దీనికి సంబంధించిన పోలింగ్‌ ఇటీవల పూర్తయింది. వీరిలో కొందరు ఓటర్లకు భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు తదితర నియోజకవర్గాల అభ్యర్థులు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక తపాలా బ్యాలెట్‌ ఓటర్లకు రూ.1000 నుంచి రూ.2000 నగదు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని