logo

మత్స్య విలాపం

నాలుగు దశాబ్దాలుగా దేశానికి పోషకాహారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వారంగం జగన్‌ ఏలుబడిలో చతికిలబడింది. డెల్టా ప్రాంతంలో నీలివిప్లవంతో మొదలైన చేపల పరిశ్రమ అయిదేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Updated : 07 May 2024 06:26 IST

జగనన్న ఏలుబడిలో చతికిలబడిన చేపల పరిశ్రమ

మండవల్లి, న్యూస్‌టుడే: నాలుగు దశాబ్దాలుగా దేశానికి పోషకాహారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వారంగం జగన్‌ ఏలుబడిలో చతికిలబడింది. డెల్టా ప్రాంతంలో నీలివిప్లవంతో మొదలైన చేపల పరిశ్రమ అయిదేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఎదిగే చేపలకు నీరు లేదు.. ఎదిగిన చేపలకు రేటు లేదు. రూ.లక్షలు లీజు చెల్లించి చేస్తున్న సాగు ఒక్కసారిగా మధ్యలోనే నిలుపుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన మేతల (దాణా) ధరలు, సాగునీరు తదితర సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రుణాలు.. అరువులు లేవు..  సాధారణంగా భారీస్థాయిలో చేపల సాగు చేస్తున్నప్పుడు ట్రేడర్స్‌ సాయంతో అరువులు, రుణాలు తీసుకుంటారు. కరోనా తర్వాత అరువులు పూర్తిగా నిలిచిపోయాయి. డబ్బు చెల్లిస్తేనే మేతలకు ఇస్తున్నారు. అనుకున్న స్థాయిలో ధరలు లేకపోయినా ఎంతో మంది రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తక్కువ మొత్తానికి చేపలను విక్రయించి నష్టపోవాల్సి వస్తోంది.

 రవాణా ఛార్జీలతోనే ధరలు పతనం..  ఏపీలో చేపలకు స్థానికంగా మార్కెట్‌ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచడంతో ఆ ప్రభావం చేపల రవాణాపై పడి అనుకున్న స్థాయిలో ధరల్లో పెరుగుదల ఉండటËం లేదు.

 ఏటా భారీస్థాయిలో ఆదాయాన్ని గడించిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేపల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు, రుణాలు, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే ఇక్కడ   ఆ దిశగా ఆలోచించడం లేదు. కనీసం చేపల వ్యాధుల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో చేపల సాగుకు అవసరమైన నీటిని సైతం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.

సాగునీటి జాడేది.. చెరువుల్లో నీటిని 6 నెలలకు ఒకసారైనా మార్చుకుంటే చేపల సాగులో నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. ఏటా నీటిలభ్యత లేకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా కృష్ణా డెల్టాలోని చేపల రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టుతో నీటిని పూర్తిస్థాయిలో అందించారు.

వీడని అపోహలు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి అవుతున్న చేపల్లో రసాయన అవశేషాలు ఉంటున్నాయనే అపోహ దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఉంది. దానిని తొలగించడంలో ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాం. ముఖ్యంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఊరటగా ఉంటుంది’ అని ఆంధ్రప్రదేశ్‌ చేపల రైతుల సంఘ ఉపాధ్యక్షుడు చదలవాడ శేషగిరిరావు తెలిపారు.


ఉమ్మడి జిల్లాలో చేపలసాగు: 1.50 లక్షల ఎకరాలు
సాగుదారుల సంఖ్య : 30 వేల మంది
ఏటా దిగుబడి: 11 లక్షల టన్నులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని