logo

పోలవరం.. చింతలపూడి పూర్తి చేస్తాం

‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి.

Updated : 08 May 2024 06:16 IST

రైతు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి
‘ఈనాడు’తో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌

‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి. జిల్లాలో ఏ సమస్య తలెత్తినా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తా’ అంటూ ఏలూరు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు.  ఎంపీగా ఎన్నికైతే జిల్లా అభివృద్ధికి  తీసుకునే చర్యల గురించి ‘ఈనాడు’ ముఖాముఖీలో వివరించారు.                          

  - ఈనాడు, ఏలూరు

పోలవరం ప్రాజెక్టును కేంద్ర సాయంతో వేగంగా పూర్తి చేస్తాం. మెట్ట ప్రాంతానికి ప్రధానమైన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసి మామిడి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌ తదితర మెట్ట పంటలకు నీరిస్తాం. రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.20వేలు అందిస్తాం. వైకాపా పట్టించుకోని ఎత్తిపోతల పథకాలన్నింటికీ పూర్వ వైభవం తీసుకొస్తాం. జగన్‌ తెచ్చిన చీకటి చట్టం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే చంద్రబాబు రెండో సంతకం ఉంటుంది. రైతులకు రాయితీపై సౌరవిద్యుత్తు పంపు సెట్లు అందిస్తాం. 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తాం. జోన్లతో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.1.5కే యూనిట్‌ విద్యుత్తు అందిస్తాం. నియంత్రికల ధరలు తగ్గిస్తాం..ఏరియేటర్లు రాయితీపై అందిస్తాం.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం

బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం ఇస్తాం. సముద్రపు వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తాం. బీసీ ఉప ప్రణాళిక అమలు చేస్తాం. స్థానిక సంస్థల్లో నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం. స్వయం ఉపాధికి అయిదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తాం. వడ్డెర్లకు క్వారీల్లో 25శాతం రాయితీ కల్పించి రాయల్టీ సీనరేజ్‌ మినహాయింపు కల్పిస్తాం. ఎస్సీ ఎస్టీ, పెండింగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకానికి జీవో-3ను పునరుద్ధరిస్తాం.
మహిళలకు ఉచిత ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. 19-59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం ఉన్న వడ్డీ లేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతాం.    కూటమి అధికారంలోని రాగానే ఆశా కార్యకర్తల జీతాలు పెంచుతాం. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తాం.

ఒకటో తేదీనే జీతాలు

కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ఒకటో తేదీనే వేతనాలు, పింఛన్లు ఇస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. సీపీఎస్‌, జీపీఎస్‌లను పరిశీలించి ఆమోదయోగ్యమైన విధానాన్ని అమలు చేస్తాం. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటాం. వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతాం.


ఏలూరు జిల్లా ప్రగతికి కృషి

పారిశ్రామికంగా నాకున్న అనుభవంతో జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా 8 పరిశ్రమలను ఏర్పాటు చేస్తా. స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూస్తా. ఏలూరులో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఆయిల్‌పామ్‌, మామిడి, ఇతర ఉద్యాన రైతులకు గతంలో ఉన్న రాయితీలు పునరుద్ధరిస్తాం.


బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలు ఇస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే అర్హత కల్పిస్తాం. దివ్యాంగులకు రూ.6వేలు అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో  2, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇస్తాం. పక్కా గృహాలు కట్టిస్తాం.

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. యువత కోసం ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల రాయితీ ఇచ్చి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేస్తాం. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఏటా 4 లక్షల చొప్పున అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.

నిర్వాసితులకు రూ.కోటి విరాళం

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. వారికి పునరావాసం కూడా కల్పించలేకపోయింది. వారి పునరావాసం, పరిహారం కోసం రూ.33 వేల కోట్లు అవసరం కాగా కొయ్యలగూడెం సభలో జనసేనాని పవన్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. నేను కూడా రూ.కోటి విరాళం ఇస్తానని ప్రకటించాను. ఇది నా వ్యక్తిగత సాయం మాత్రమే. వారికి ప్రభుత్వం తరపున అండగా నిలబడతాం. కేంద్రం ద్వారా వారికి పునరావాసం, పరిహారం వచ్చేందుకు కృషి చేస్తా.

ధరల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

వైకాపా పాలనలో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిత్యవసరాలు మొదలు అన్ని ధరలు అదుపు చేసేందుకు కృషి చేస్తాం. జగన్‌ తీసుకున్న చెత్త నిర్ణయం చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం. విద్యుత్తు ఛార్జీలకు అదనంగా వడ్డన లేకుండా చేస్తాం. ప్రస్తుత ఛార్జీలను నియంత్రించే మార్గాలైన సోలార్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకాలను అమలు చేస్తాం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నియంత్రిస్తాం. ప్రతి ఇంటికి ఏడాది మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తాం. దీంతో సామాన్యుడిపై ఉన్న ఖర్చుల భారం చాలా వరకు తగ్గిపోతుంది.  

  క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయిస్తాం. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తాం. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్‌లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష సాయం చేస్తాం. కాపుల సంక్షేమానికి రూ.15వేల కోట్లు కేటాయించి అయిదేళ్లలో ఖర్చుచేస్తాం. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలిచ్చి ఆదుకుంటాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. కమ్మ, రెడ్డి, వెలమ ఇతర అగ్ర కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. ప్రైవేటు దేవాలయాల్లో పని చేసే అర్చకులకు కనీస వేతనం ఉండేలా ఏర్పాటు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు