logo

కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు

రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్‌పామ్‌ పంటను జగన్‌ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

Published : 10 May 2024 04:13 IST

రాయితీలకు ఎగనామం రైతులకు పంగనామం
ఆయిల్‌పామ్‌ సాగుదార్లకు జగన్‌ టోకరా

‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయిల్‌పామ్‌ రైతులనుఆదుకుంటాం.’

2018 పాదయాత్ర సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు వద్ద జగన్‌ మోహనరెడ్డి ఇచ్చిన హామీ..

కుక్కునూరు, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం పట్టణం, న్యూస్‌టుడే

రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్‌పామ్‌ పంటను జగన్‌ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ పంటకు గత ప్రభుత్వం కంటే మెరుగైన పరిస్థితులు కల్పిస్తానని ఎంతో గొప్పగా హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఉన్న రాయితీలు సైతం నిలిపివేసింది. తెలంగాణలో అనేక రాయితీలు ఇస్తూ పంటను ప్రోత్సహిస్తుండగా.. ఇక్కడ ఆ సాగుకు అనువైన పరిస్థితులు ఉండి కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
తెదేపా ప్రభుత్వంలో మొక్కలపై రాయితీ ఉండేది. ఎరువులు, కొత్త రైతులకు డ్రిప్‌ పరికరాలపై రాయితీ అందించేవారు. వీటన్నింటినీ జగన్‌ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో పెట్టుబడి భారం పెరిగి కొత్త విస్తీర్ణం సాగులోకి రావటం లేదు. రూ.193 చెల్లించి మొక్కలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తెదేపా ప్రభుత్వంలో ఈ పంటను ప్రోత్సహించే గోద్రేజ్‌, నవభారత్‌ వంటి కంపెనీలు మొక్కను రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు రూ.20, ఇతరులకు రూ.30కు అందించేవారు. ఈ ప్రభుత్వం ఆ కంపెనీలకు రాయితీని విడుదల చేయకపోవడంతో అవి రైతుల వద్ద పూర్తి ధర తీసుకుని మొక్కలు సరఫరా చేస్తున్నాయి. డ్రిప్‌ పరికరాలకు ఉద్యానశాఖ గతంలో ఇచ్చే 90 శాతం రాయితీ ఇప్పుడు లేకుండా పోయింది. తోట వేసిన తొలి నాలుగేళ్ల పాటు ఎరువులపై 30 శాతం రాయితీ ఇచ్చేది. ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదు.

ధరల్లో తేడా

ధరల్లో సైతం నిలకడ ఉండటం లేదు. మన దగ్గర టన్ను ఆయిల్‌పామ్‌ ధర ప్రస్తుతం రూ.13,760 ఉండగా, తెలంగాణలో రూ.14,280 పలుకుతోంది. ధర అధికంగా ఉందని అక్కడ అమ్ముకుందామంటే ఆ రాష్ట్ర అధికారులు కొనడం లేదు. ధర పడిపోవటం, రాయితీలు లేకపోవటంతో రైతులకు ఆ పంటపై ఆసక్తి తగ్గిపోతోంది.

అక్కడ ప్రోత్సాహం బాగుంది

తెలంగాణలో రైతులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కంటే ఇక్కడ పామాయిల్‌ ధరలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో సారి దాదాపు టన్నుకు రూ.800 పైగా వ్యత్యాసం ఉంటుంది. మామూలుగానే పామాయిల్‌ రైతులు నష్టాలను ఎదుర్కొంటుంటే రెండు రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ద్వారా మరింత నష్టపోతున్నారు.

గెడా సత్తిబాబు, పామాయిల్‌ రైతు, దిప్పకాయలపాడు, కొయ్యలగూడెం మండలం

రూ.500 చొప్పన కొన్నా

గత ప్రభుత్వ హయాంలో ఏడెకరాల ఆయిల్‌పామ్‌ తోట వేశా. అప్పట్లో రాయితీపై మొక్కలు ప్రభుత్వమే సరఫరా చేసింది. మూడేళ్ల పాటు ఎరువులు ఉచితంగా అందించింది. 70 శాతం రాయితీపై బిందుసేద్యం పరికరాలు సమకూర్చింది. మూడేళ్ల కిందట మరో ఏడెకరాల తోట వేశా. వైకాపా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.500 చొప్పున మొక్కలు కొనుగోలు చేసి తెచ్చుకున్నా. ఏడాది నుంచి రాయితీపై డ్రిప్‌ మంజూరు చేస్తామని చెప్పినా అమలు కాలేదు.

గద్దే శ్రీధర్‌, రైతు, బుట్టాయగూడెం

జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం: 1.55 లక్షల ఎకరాలు
ఆధారపడిన కుటుంబాలు: 25 వేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని