logo

జగన్‌ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు

‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్‌ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు.

Published : 10 May 2024 04:21 IST

దమ్ముల నుంచి విక్రయాల వరకు ఇబ్బందులే
రాయితీలను రద్దు చేసిన వైకాపా సర్కారు

పాలకొల్లు, న్యూస్‌టుడే: ‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్‌ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. కేంద్రమిచ్చేదానికి కొంత కలుపుకొని కొందరు రైతులకు ఏటా రైతుభరోసా ఇస్తున్నామనే నెపంతో ఇతర రాయితీలన్నిటినీ రద్దు చేశారు. ఏరువాకలో దమ్ములు మొదలుకుని పండిన పంటలను విక్రయించుకునే వరకు అడుగడుగునా దగా చేశారనడానికి ఇవే ఉదాహరణలు.

ముడిజింకు మాటేలేదు : 1

వరిసాగులో జింకు లోపం రాకుండా దమ్ముల్లో వినియోగించే ముడిజింకును తెదేపా హయాంలో సొసైటీల ద్వారా 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేసేవారు. వైకాపా వచ్చాక ముడిజింకు పంపిణీ ఎత్తేశారు. అయిదేళ్లుగా సాగుభూములకు ముడిజింకు అందక వరిలో జింకు లోపం ఎక్కువైంది. పంట దిగుబడులు తగ్గిపోయాయి. ప్రస్తుతం  రబీలో ఉమ్మడిజిల్లాలోని చాలామంది రైతులు బహిరంగ బజార్లో అధిక ధరలకు ముడిజింకు తెచ్చి చల్లారు.

బరకాలకు బొర్రెట్టారు : 2

వర్షాల నుంచి పంటను రక్షించే బరకాలనివ్వడం కూడా వైకాపా ప్రభుత్వం ఆపేసింది.  ఖరీఫ్‌ పంట మాసూళ్ల సమయంలో 2023 డిసెంబరులో వచ్చిన మిగ్‌జాం తుపాను ధాటికి ధాన్యం తడిసిపోయి ఉమ్మడిజిల్లాలో 80వేల ఎకరాల పంట తడిసిముద్దయ్యింది. ప్రస్తుత రబీలోనూ ఈనెల 7న అకాల వర్షంతో వందలాదిమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. రాయితీపై బరకాలు కూడా ఇవ్వకపోవడంతో ఉమ్మడిజిల్లాలోని 1,70 లక్షల మంది చిన్నసన్నకారు రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. అయిదేళ్లుగా బరకాలు అద్దెకు తెచ్చుకుని పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి అన్నదాతలను వెంటాడుతోంది.

నష్టపరిహారంలో దగా : 3

2023 డిసెంబరులో వచ్చిన తుపానుకు పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలోనూ సీఎం జగన్‌ దగా చేశారు. ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా పరిహారాన్ని సంక్రాంతినాటికి అందిస్తామని చెప్పి  నేటికీ రూ.54 కోట్ల బకాయిలను విడుదల చేయలేదంటే  రైతులపై సర్కారుకున్న ప్రేమను అర్థÄం చేసుకోవచ్చు.

కౌలురైతులకు పంగనామం : 4

జిల్లాలో మొత్తం 7 లక్షల మంది రైతులుంటే 2 లక్షల మంది పైబడి కౌలు రైతులున్నారు. కౌలు రైతులకిచ్చిన రుణఅర్హత కార్డులపై బ్యాంకు రుణాలిప్పిస్తామని చెప్పిన సీఎం జగన్‌ అటువంటి ప్రయత్నమే చేయలేదు. నిరుపేదలుగా ఉన్న కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా కూడా కల్పిస్తామని మొదట్లో చెప్పిన సీఎం జగన్‌ తర్వాత మాటమార్చారు. కేవలం ఎస్సీ కౌలు రైతులకే దానిని పరిమితం చేసి మిగిలిన సామాజిక వర్గాలకు పంగనామం పెట్టారని పాలకొల్లు గ్రామీణ మండలం లంకలకోడేరుకు చెందిన హరిబాబు వాపోయారు.

తేమపేరుతో మోసం : 5

ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు పండిన పంటను అమ్ముకోవడానికి అయిదేళ్లుగా రేయింబవళ్లు శ్రమించారు. సీఎం జగన్‌ చెప్పిన మిల్లులకే ధాన్యాన్ని రవాణా చేసి తేమ పేరుతో నిలువునా మోసపోయారు. బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోలు మిల్లర్లు తగ్గించి రేటు కడుతున్నారని అన్నదాతలు ఆందోళన చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. చాలాచోట్ల రోడ్డెక్కి ధర్నాలు చేశారు కూడా. ప్రతిరైతు ఎకరానికి రూ.10 వేలు చొప్పున ప్రతి పంటకు నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో ఈ నష్టం విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా

పెత్తనమేగాని విత్తనం లేదు : 6

ఏటా ఏప్రిల్‌ వచ్చేసరికి జనుము, జీలుగు, పిల్లిపెసరవంటి పచ్చిరొట్ట విత్తనాలు గతంలో పంపిణీ చేసేవారు. వాటిని రైతులు రబీ కోతల సమయంలో చేలలో చల్లేవారు. జగనొచ్చాక పెత్తనమేగాని విత్తనమిచ్చింది లేదని అన్నదాతలు ఆవేదన చెందే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. తెదేపా హయాంలో ప్రతి మండలానికి 2 టన్నులకు తక్కువ కాకుండా పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయశాఖ పంపిణీ చేసేది. పచ్చిరొట్ట జల్లడంతో వేసవిలో పాడి పశువులకు మేతగా ఉపయోగపడేదని రైతులు చెబుతున్నారు. ఉద్యాన రైతులకు రూ.20కే పదిరకాల విత్తనాలిచ్చే పథకాన్ని జగన్‌ ఎత్తేశారు. ఉమ్మడిజిల్లాలో లక్షమందికి పైగా రైతులు నష్టపోయారు.

రాయితీల ఎగవేత : 7

ఉమ్మడి జిల్లాలో తెదేపా హయాంలో ఏటా 3 నుంచి 5 వేలమందికి సాగులో ఆధునికీకరణ పేరుతో 50 శాతం రాయితీపై రూ.20 కోట్లు విలువ చేసే యంత్రాలు అందించేవారు. రైతు రథం పేరిట ట్రాక్టర్లు ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క రైతుకు రాయితీపై ట్రాక్టరు ఇచ్చిన పాపాన పోలేదు. శ్రీమంతులకే చెల్లుబాటయ్యే డ్రోన్‌ స్ప్రేయర్లను రాయితీపై ఇస్తామంటూ చివరలో తెరమీదకు తెచ్చిన సీఎం జగన్‌ ఉమ్మడి జిల్లాలో 35 మందిని ఎంపికచేసి శిక్షణతో సరిపెట్టడంతో ఆ పథకం కూడా చతికిలపడింది.

ఎరువంటే బరువే : 8

రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే రైతులకు ఎరువులిస్తామని చెప్పిన జగన్‌ యూరియా తప్ప ఇతర ఎరువులు ఇవ్వడం లేదు. అది కూడా అరకొరగానే రావడంతో అధికారపార్టీ నాయకులే యూరియాను దక్కించుకునే దుస్థితి. గతంలో తెదేపా ప్రభుత్వం సొసైటీలకు కాంప్లెక్స్‌ ఎరువులను కూడా తక్కువ ధరలకు పంపిణీ చేసి అన్నదాతలకు అండగా నిలిచేది. ఆయా ఎరువులు కావాల్సిన రైతులు బహిరంగ మార్కెట్లో అరువుగా తెచ్చుకోవడం తర్వాత పంటలొచ్చాక అధిక ధరలను భరించడం బరువుగా మారిందని యలమంచిలికి చెందిన రైతు తమ్మినీడి విష్ణుమూర్తి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని