logo

నిధులున్నా నీరసమే!

ప్రజారోగ్యశాఖ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. వీటితో చేపడుతున్న పనులు క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి పథకాలతోపాటు జగనన్న కాలనీల్లో తాగునీటి పనులు మందకొడిగా నడుస్తున్నాయి.

Updated : 23 May 2024 04:56 IST

ఇంజినీరింగ్‌ అధికారుల కొరతతో పనుల్లో తీవ్ర జాప్యం 
ప్రజారోగ్యశాఖలో ముందుకు సాగని అభివృద్ధి పనులు 

 బొల్లవరం జగనన్న కాలనీలో నిరుపయోగంగా తాగునీటి ట్యాంకులు  

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం: ప్రజారోగ్యశాఖ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. వీటితో చేపడుతున్న పనులు క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి పథకాలతోపాటు జగనన్న కాలనీల్లో తాగునీటి పనులు మందకొడిగా నడుస్తున్నాయి. ఇంజినీరింగ్‌ అధికారుల కొరతతోనే ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరుగురు  అసిస్టెంట్‌ ఇంజినీర్లు (ఏఈ) ఉండాల్సి ఉండగా, ఒకరు మాత్రమే ఉన్నారు. రెండు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఏళ్లతరబడి ఒక డీఈ మాత్రమే ఉన్నారు. ఏఈల కొరతతో సచివాలయ పరిధిలోని వార్డు సచివాలయ ఇంజినీర్లను ఒక్కొక్కరు చొప్పున డిప్యుటేషన్‌పై నియమించుకున్నారు. సచివాలయ ఇంజినీర్లు రూ.కోట్లతో చేపడుతున్న పనుల పర్యవేక్షణతోపాటు నాణ్యతను పరిశీలించాలన్న, వాటికి సంబంధించిన లోటుపాట్లను ఎప్పటికప్పుడు దస్త్రాల్లో నమోదు చేయడానికి సరైన అనుభవం లేకపోవడంతో నమోదు చేయలేకపోతున్నారు.

  • నగర పంచాయతీ పరిధిలో టెండర్ల దశలోనే కొన్ని పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బురదనీరు వస్తోందని పట్టణ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. మౌలానా ఆజాద్‌ వీధిలో అమృత్‌ పథకం కింద నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకును శుభ్రం చేసిన అనంతరం నీటిని పంపే గొట్టం పడిపోయి తొమ్మిది నెలలు కావస్తున్నా ఆ శాఖాధికారులు పట్టించుకోలేదు. పురపాలక ఇంజనీరింగ్‌ అధికారులు ప్రజారోగ్య శాఖకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
  • ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో మూడు జగనన్న కాలనీలు ఉండగా, బొల్లవరం జగనన్న కాలనీలో రూ.10 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం నిర్మాణ పనులపై నాలుగేళ్లుగా ఈ రోజు, రేపు అంటూ ప్రజారోగ్యశాఖాధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా కాలనీలో నిర్మించిన చిన్ననీటి ట్యాంకుల్లోకి నీరు రాక దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ట్రాక్టర్లతో సంపుల్లోకి నీరు తెచ్చుకునేందుకు గృహ లబ్ధిదారులు నీటిని డ్రమ్ముల ద్వారా నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి ఏఈ కూడా పూర్తి స్థాయిలో పనులను రికార్డు చేయలేదని గుత్తేదారు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. పట్టణ పరిధిలో వరద నీరు, మురుగుపారుదలకు వీలుగా కొత్తపల్లె కాలువ ఆధునికీకరణ పనులకు రూ.163 కోట్లు, తాగునీటి గొట్టాల ఏర్పాటుకు రూ.119 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటన్నింటిపై నిర్వహణ, పర్యవేక్షణ వార్డు సచివాలయ ఇంజినీరే దిక్కు కావడం గమనార్హం. 
  • కమలాపురం నగర పంచాయతీ పరిధిలో కొన్ని పనులు రెండేళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. సమగ్ర నీటి పథకానికి రూ.58.2 కోట్లు, మురుగు కాలువల ఆధునికీకరణకు రూ.7.99 కోట్లు, రహదారులు, ఆర్చిల నిర్మాణ పనులకు రూ.5.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి సమగ్ర నీటి పథకం పైపులైన్‌ పనులు 60 కిలోమీటర్లు చేపట్టాల్సి ఉండగా, కేవలం మూడు కిలోమీటర్లే జరిగాయి. ఈ ప్రాంతంలో కూడా సచివాలయ ఇంజినీర్‌ మాత్రమే దిక్కయ్యారు.
  • ఎర్రగుంట్ల నగరపంచాయతీలో రూ.109.34 కోట్లు, మైదుకూరు నగర పంచాయతీల పరిధిలో రూ.90 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం నిర్మాణపనులు నిలిచిపోయాయి.
  • బద్వేలు పరిధిలో పట్టణం, జగనన్న కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.80 కోట్లతో చేపట్టిన పనులు టెండరు దశలోనే నిలిచిపోయాయి. ఈ పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రాకపోవడమే కారణమని సమాచారం. 

ఇంజినీరింగ్‌ అధికారుల కొరత వాస్తవమే...

ప్రజారోగ్యశాఖ పరిధిలో ఇంజనీరింగ్‌ అధికారుల కొరత ఉండడంతో సచివాలయ సిబ్బందిని నియమించుకున్నాం. ప్రొద్దుటూరులో తాగునీటిలో వస్తున్న బురదపై స్పందిస్తూ మైలవరం జలాశయంలో తాగునీటి మట్టం పడిపోవడంతో గొట్టాలను దింపి నీటిలోకి ఏర్పాటు చేయడంతో సమస్య వచ్చింది. పనులు కొంత మేరకు నెమ్మదిగా సాగుతున్నాయి.

యశోద, డీఈ, ప్రజారోగ్యశాఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని