logo

ప్రభుత్వ భూములకేదీ రక్షణ?

జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరవవుతోంది.

Published : 30 Nov 2022 04:09 IST

రూ.కోట్ల విలువైన స్థలాలపై అక్రమార్కుల కన్ను
జిల్లా కేంద్రంలో మాయమవుతున్న సూచికలు
న్యూస్‌టుడే, రాయచోటి

మదనపల్లె రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో మాయమైన సూచిక

జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరవవుతోంది. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న సమయంలోనే కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలపై కన్నేసి గుట్టలు, వాగులు, వంకలు, శ్మశాన వాటికలను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు. ఆక్రమణలపై పత్రికల్లో వరుస కథనాలు వెలువడడంతో అప్పట్లో అధికారులు పట్టణ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి కొలతలు వేసి ఇది ప్రభుత్వ స్థలం అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొంత కాలం గడిచేసరికి తిరిగి ఆ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది.  ప్రభుత్వ భూములకు రక్షణ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుని స్థలాలను పట్టా భూముల్లో కలిపేసుకుంటున్నారు.

* రాయచోటి పురపాలక సంఘం పరిధిలో సుమారు పదెకరాల వరకు ప్రభుత్వ భూములను నాలుగేళ్లలో అధికారులు గుర్తించారు. గున్నికుంట్ల రోడ్డులోని కుంట, శ్మశాన వాటిక కలుపుకొని సుమారు ఆరెకాల  ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ రియల్టర్లు గతంలో ఆక్రమించి కొంత స్థలాన్ని ప్లాట్లుగా మార్చేశారు. కుంట కట్ట, నీటి మునక ప్రాంతాలను ఆక్రమించి స్థలాల్లోకి నేరుగా రహదారులు నిర్మించుకున్నారు. వీటిని నిలువరించే చర్యల్లో భాగంగా గతంలో రెవెన్యూశాఖాధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా అవి కేవలం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయాయి.

* రింగ్‌ రోడ్డుకు ఎగువన ఉన్న ఇనాత్‌ఖాన్‌ చెరువు కట్ట, పడమర, తూర్పు వైపులలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొందరు రహదారి అనుబంధంగా నిర్మాణాలు చేసుకుంటూ వెనక్కి పునాదులు వేసుకొంటూ వెళ్లుతున్నారు. ఆ ప్రాంతాల్లో గతంలో ఆక్రమణలు గుర్తించి పాతిన సూచికలు మాయమయ్యాయి. రింగ్‌ రోడ్డు కల్వర్టులను ఆక్రమించి ప్లాట్లుగా మార్చిన ప్రదేశాలలోనూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కలెక్టరు, ఎస్పీ కార్యాలయాల సమీపంలోనే ఉన్న రింగ్‌రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

రక్షణ లేని మదనపల్లె-కె.రామాపురం రహదారిలోని కుంట స్థలం

* రాయచోటి-మదనపల్లె ప్రధాన రహదారిలోని పెట్రోల్‌ బంకు సమీపంలోని సుమారు 25 సెంట్ల ప్రభుత్వ స్థలానికి రక్షణ కరవైంది. ఇక్కడ సెంటు ధర రూ.లక్షల్లో పలుకుతోంది. ఇక్కడి స్థలాన్ని అధికార, అంగబలం గల కొందరు ఆక్రమించే యత్నం చేయడంతో గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో స్పందించిన అధికారులు అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కొందరు అక్రమార్కులు దాన్ని తొలగించి వెనుక వైపు నుంచి చదును పనులు చేపడుతున్నారు.

* మదనపల్లె రోడ్డు నుంచి కె.రామాపురం రహదారిపైకి వెళ్లే మార్గంలోని ప్రభుత్వ కుంట స్థలం 1.51 ఎకరాలను ఇటీవల అధికారులు ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి కేటాయించారు. ఇక్కడ కొలతలు వేసి ప్రభుత్వ స్థలానికి సరైన హద్దులు ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు రహదారులు, భవనాల నిర్మాణం చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూచికలు తొలగింపు, ఆక్రమణలపై ఆర్డీవో రంగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని