logo

మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!

‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు.

Published : 27 Apr 2024 06:06 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

జగనాసుర రక్త చరిత్రపై ఛార్జిషీట్‌ విడుదల చేస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో
సభ్యుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి బీటెక్‌ రవి

ఈనాడు, కడప: ‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. జగన్‌ అరాచక పాలనపై కడపలో శుక్రవారం ఆయన ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తెదేపా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి బీటెక్‌ రవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య చేసి తెదేపాపై నెట్టే ప్రయత్నం చేశారని, ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేమని విమర్శించారు. కేసులో న్యాయం కోసం పోరాడే వ్యక్తులపై ఎదురు కేసులు పెట్టి హింసిస్తున్నారని, కుటుంబ సభ్యులను సైతం వదిలిపెట్టకుండా వేధిస్తున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోతే పట్టించుకోకుండా బాధితులను ఆదుకోకుండా వదిలేశారన్నారు. జిల్లాలో ఎకరాకు సైతం అదనపు ఆయకట్టు తీసుకురాలేదని, ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని వివరించారు. కడప నగరంలో అభివృద్ధి కుంటుపడిందని, వలయాల అభివృద్ధి పేరిట దోచుకున్నారని, మురుగునీరు బయటపోయే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించకుండా గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చారని, వైకాపా నేతలు సరఫరాదారులుగా ఉన్నారని ఆరోపించారు. ఇసుక, గనులు, మట్టి, మద్యం మాఫియా అవతారమెత్తి రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజలకు రక్షణలేకుండా చేశారని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారన్నారు. రానున్న తెదేపా ప్రభుత్వంలో ఇలాంటి జరగకుండా చేస్తామని, పారదర్శక పాలన అందిస్తామని వివరించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ గురువారం నాటి పర్యటనకు జనం పోటెత్తారని, స్వచ్ఛందగా తరలివచ్చి సంఘీభావం తెలిపారన్నారు. ప్రజలకు..జగన్‌కు మధ్యే ఎన్నికల్లో పోటీ జరుగుతోందని, ఈ మేరకు వాతావరణం నెలకొందని వివరించారు. సొంత చెల్లితో పాటు తెదేపా నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని, జగన్‌కు మన.. తన అనే తేడాలేదని.. డబ్బే ప్రధానమని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని