logo

క్షణం క్షణం... భయం భయం

ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Published : 27 Apr 2024 05:50 IST

ఇళ్లపై యమపాశాలతో ఆందోళన
తక్కువ ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్లు
న్యూస్‌టుడే, జమ్మలమడుగు, బద్వేలు, గోపవరం

జమ్మలమడుగులో ఎమ్మెల్యే కార్యాలయం వెనక వీధిలో ఇంట్లోనే ఇనుప విద్యుత్తు స్తంభం

ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి అటు జమ్మలమడుగు నగర పంచాయతీలోని లక్ష్మీనగర్‌, చక్కడిపో వీధుల్లో, ఇటు బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని బద్వేలు, గోపవరం ప్రాంతాల్లో నెలకొంది. ఇళ్ల మధ్య నుంచి 33 కేవీ లైను తీగలు వెళ్తుండడంతో అక్కడి ప్రజలకు దిన దినగండంలా మారింది. ఒక ఇంట్లో ఏకంగా ఇనుప విద్యుత్తు స్తంభమే ఉంది. వానా కాలం వచ్చిందంటే ఆ కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు ఉండదు. విద్యుత్తు సరఫరా అవుతున్న శబ్ధంతో నిద్ర కూడా పట్టదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారు 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కార్యాలయం వెనక వీధిలో చాలా వరకు ఇలాంటి సమస్యే వేధిస్తోంది. వీధిలో ఒక వైపు తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వేలాడుతూ ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాల్గో వార్డులో లక్ష్మీనగర్‌ వీధులు ఉన్నాయి. కొన్ని కాలనీల్లో డ్రైనేజీ లేక పోవడంతో మురుగు పారడంలేదు. ఇంకొన్ని చోట్ల మురుగు కాలువలు ఉన్నా అవి పూడికతో నిండిపోయాయి. బద్వేలు పట్టణంలోని అబ్బరాతివీధి దిగువ, ఎగువ బ్రాహ్మణవీధులు, మార్కెట్టువీధి, పోరుమామిళ్ల మెయిన్‌ బజార్‌, దూళ్లవీధి, పాతపోస్టాఫీసు వీధిలో మురుగు కాల్వల వ్యవస్థ సరిలేదు. మురుగుకాల్వలు పూడికతో నిండి దర్గంధం వెదజల్లుతోంది. పోరుమామిళ్ల రోడ్డులో విద్యుత్తు నియంత్రికకు రక్షణ కంచె లేదు. పిల్లలు ఆడుకుంటూ ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.

పోరుమామిళ్లరోడ్డులో ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రిక

భయంతో ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదు

మా ఇంటిలోనే ఇనుప విద్యుత్తు స్తంభం ఉండడంతో మాకు దిన దిన గండంలా మారింది. 33 కేవీ లైను తీగలు ఉన్నందున ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతున్నాం. లేకుంటే స్లాబ్‌ వేయాల్సి ఉంది, అది వేయాలంటే ఇంటి పైన పని జరగాలి, చేతికందే ఎత్తులో విద్యుత్తు తీగలు ఉన్నందున భవన నిర్మాణ కార్మికులు సైతం పనికి రావడంలేదు. 

హరి, జమ్మలమడుగు

దిగువనే విద్యుత్తు నియంత్రిక

పోరుమామిళ్లరోడ్డులో విద్యుత్తు నియంత్రిక అందె ఎత్తులో ఉంది. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారోనని భయపడుతున్నాం. మురుగు కాల్వలు పూడికతో నిండి దుర్గంధం వస్తోంది. అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు.

ఈశ్వరమ్మ. పోరుమామిళ్ల రోడ్డు మెయిన్‌ బజారు, బద్వేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని