logo

పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి

రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 05:56 IST

మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

నల్లారి కిరణ్‌కుమారెడ్డి, షాజహాన్‌బాషాలను సన్మానిస్తున్న తెదేపా నాయకులు

మదనపల్లె పట్టణం, కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి ముసుగులో ప్రజాధనాన్ని దోచుకుంటున్న పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి సాజహాన్‌బాషా మాట్లాడుతూ స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి బోగస్‌ పట్టాలు పంపిణీ చేశారని, పేదలకు ఇళ్ల స్థలాలిప్పిస్తానని వేల రూపాయలు వసూలు చేశారని,. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే విచారణ జరిపించి ఆ నాయకుడిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో తెదేపా నాయకులు బాబురెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, జనసేన పార్టీ నాయకుడు శ్రీరామ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ సభకు స్థల పరిశీలన 

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 3, 4వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ నియోజకవర్గంలోని పీలేరులో మే 3న నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి అనువైన స్థలాలను శుక్రవారం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. పీలేరు డిగ్రీ కళాశాల సమీపంలోని స్థలంతో పాటు కలికిరి సైనిక పాఠశాలకు సమీపంలోని మరో స్థలాన్ని పరిశీలించి అధిష్ఠానానికి ప్రతిపాదించారు. వీరివెంట భాజపా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సాయిలోకేష్‌, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని