logo

ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!

జిల్లాలో గతేడాది మిగ్‌జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు.

Updated : 27 Apr 2024 06:22 IST

మిగ్‌జాం నష్టపరిహారానికి రైతుల ఎదురుచూపులు
సంక్రాంతికి చెల్లిస్తామంటూ ఏమార్చిన సీఎం జగన్‌

చిట్వేలి మండలం నాగవరంలో నేలకొరిగిన అరటి తోట (పాత చిత్రం)

చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనే కుదరదు... హామీల అమలు కనిపించదు.... వెంటనే చేసేద్దామని ఊదరగొడతారే గానీ ఆ ఊసే ఉండదు... సాయం చేస్తామంటే ఎదురు చూపులు తప్పవు.... ఇదీ సీఎం జగన్‌ సర్కారు మార్కు దగాకు తార్కాణం ... అన్నమయ్య జిల్లాలో గతేడాది డిసెంబరు మిగ్‌జాం తుపాను ఉద్యాన రైతులను   చిదిమేసినా ప్రభుత్వానికి పట్టని వైనానికి నిదర్శనం.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ, చిట్వేలి, ఓబులవారిపల్లె

జిల్లాలో గతేడాది మిగ్‌జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. జిల్లాలో అరటి, బొప్పాయి, టమాట, కూరగాయలు, బంతిపూలు, చామంతి తదితర పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల సిబ్బందితో కూడిన బృందాలు తయారు చేశాయి. జాబితా ఆధారంగా బాధితులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో 5,863 మంది రైతులను రూ.9.20 కోట్లు ఇవ్వాలని నివేదిక రూపొందించారు. గత నెల 6న పంట నష్ట పరిహారం అందిస్తున్నామంటూ సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటికే నెలన్నర దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలకు నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో నగదు జమవుతుందా? లేదా? అని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 జిల్లాలో 1,954 మంది రైతులు 4,153 ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. మదనపల్లె డివిజన్‌లోనూ పంటలకు అపార నష్టం జరిగినట్లు తేల్చారు.  చిట్వేలి మండలంలో 359 ఎకరాల్లో అరటి, చామంతి, బొప్పాయి, రైల్వేకోడూరులో 360 ఎకరాల్లో అరటి, ఓబులవారిపల్లి మండలంలో 534 ఎకరాల్లో అరటి, 93 ఎకరాల్లో తమలపాకు, 72 ఎకరాల్లో బొప్పాయి, పెనగలూరులో 23 ఎకరాల్లో అరటి, పుల్లంపేటలో 1,326 ఎకరాల్లో అరటి, రామాపురం మండలంలో అయిదెకరాల్లో టమాట పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. ఓబులవారిపల్లె మండలంలో 682 మంది రైతులకు చెందిన 510.4 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. దాదాపు రూ.40 కోట్లకుపైగా నష్టం వాటిల్లితే కేవలం రూ.9.20 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఆ నగదూ ఇప్పటికీ జమ కాక పోవడం గమనార్హం.

సీఎం బటన్‌ నొక్కినా సాయం అందలేదు

సీఎం జగన్‌ గత నెల 6న నష్టపరిహారం ఇస్తున్నట్లుగా బటన్‌ నొక్కినా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. పంట నష్టం జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా రాలేదు. పదెకరాల్లో అరటి సాగు చేశాం. దాదాపు రూ.10 లక్షల మేర నష్టపోయాం.

 ఎ.రామరాజు, రైతు, చెర్లోపల్లి

డబ్బుల్లేక సాగే మానుకున్నాం

12 ఎకరాల్లో అరటి సాగు చేశాం. మిగ్‌జాం తుపాను ప్రభావంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లింది. నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నా పరిహారం ఒక్క రూపాయి రాలేదు. పొలంలో పాడైన పంటను తొలగించే స్థోమత లేక వదిలేశాం. 

 ఎస్‌.శివరామరాజు, రైతు హస్తవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని