logo

న్యాయం చేస్తానన్నావ్‌...సాయం చేయకున్నావ్‌...!

సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం.

Published : 27 Apr 2024 06:03 IST

సోమశిల బాధితులకు జగన్‌ మొండిచేయి
నష్టపరిహారం అందక నిర్వాసితుల విలవిల

తప్పెటవారిపల్లె, పెన్నపేరూరు గ్రామాలను ముంచెత్తిన సోమశిల వెనుక జలాలు (పాత చిత్రం)

సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. మీ సమస్యలను కళ్లారా చూశాం. మీ కన్నీటి వెతలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతాం. అందరికీ న్యాయం చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పన్లేదు. సీఎం ఆదేశంతో ప్రభుత్వ ప్రతినిధులుగా మీ ఊర్లోకి వచ్చాం. మీరంతా ఇప్పటికే బంగారు పంటలు పండే భూములిచ్చి ఎంతో త్యాగం చేశారు. మీకెంత డబ్బులిచ్చినా సరిపోదు. తరతరాలుగా ఉన్న కన్నతల్లి లాంటి పల్లె రుణం తీర్చుకోలేం. 

 2019, నవంబరు 2న ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో జరిగిన గ్రామసభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్న మాటలివి.

- ఆమాత్యులు బాసలు చేసి నాలుగేళ్లు దాటింది. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి భరోసా దక్కలేదు. మంత్రుల హామీలు ఆచరణకు నోచుకోలేదు. వైకాపా పాలనలో ఉత్తమాటలతో ఊరిస్తూ వస్తున్నారు. ఇంతవరకు పునరావాస ప్యాకేజీపై ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. పరిహారానికి నిధులివ్వలేదు.

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట, అట్లూరు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల జలాశయం వెనుక జలాలతో ఉమ్మడి కడప జిల్లాలో 105 గ్రామాలు పూర్తిగా, మరో 9 పల్లెలు పాక్షికంగా ముంపు జాబితాలో చేరాయి. ఒంటిమిట్ట, అట్లూరు, గోపవరం, నందలూరు, చిట్వేలి, సిద్దవటం, పెనగలూరు మండలాల్లో వేలాది ఎకరాలు, ఇళ్లకు పరిహారం చెల్లించడంతో 95 శాతం మంది సొంతూళ్లను ఖాళీ చేశారు. కొన్ని  చోట్ల నివాసం ఉంటున్న పక్కాగృహాలకు మాత్రం పరిహారం ఇవ్వలేదు. పంట భూములకు 90 శాతం పరిహారం అందజేశారు. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో 367 ఇళ్లు ఉండగా 561  మంది, పెన్నపేరూరులో 458 గృహాలు ఉంటే 949 మంది నివసిస్తున్నారు. రెండు గ్రామాల్లో 600 ఎకరాలు ముంపులో చేరగా చాలామందికి దశాబ్దం కిందట డబ్బులిచ్చేశారు. సోమశిల జలాశయం నిల్వ సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా, 72 నుంచి 76 టీఎంసీలు నీరు నిల్వ చేస్తే ఈ రెండు ఊళ్లలోకి వెనుక జలాలు దూసుకొస్తాయి. ఇళ్ల చుట్టూ నీరు ఉండటంతో భయంభయంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు మురుగుగా మారి దుర్వాసనతోపాటు విష పురుగుల దాడితో వణికిపోతున్నారు. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సమస్యను పలుమార్లు సీఎం జగన్‌ దృష్టికి బాధితులు తీసుకెళ్లినా పైసా విదల్చలేదు.

 అట్లూరు మండలం చింతువాండ్లపల్లి, ఆకుతోటపల్లి, చలంగారిపల్లె, ఈశ్వరబొట్లపల్లి, బోడిశెట్టిపల్లె, వరికుంటలో పక్కాగృహాలు, ఇతర కట్టడాలకు పరిహారం ఇవ్వలేదు. సోమశిల జలాశయంలో 72 టీఎంసీల నీరుంటే పల్లెల చుట్టూ జలాలు చేరుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల భూముల తీసుకున్నా సీఎం జగన్‌ ముంపు బాధితుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం అయిదేళ్ల కాలంలో ముంపు గ్రామాల్లో బాధితులకు పైసా పరిహారం చెల్లించలేదు. అదిగో ఇస్తాం.. ఇదిగో తీసుకోండి అంటూ ఊరిస్తూ వచ్చారు. నిధుల్లేవని పరిహారం ఇవ్వకుండా పక్కన పెట్టేయడం గమనార్హం.

ఎదురుచూపులే మిగిలాయి

సోమశిల వెనుక జలాలు మా ఊళ్లోకి వస్తాయి. వర్షాకాలంలో కొన్ని నెలల పాటు నీరు నిల్వ ఉండడంతో అవస్థలు పడుతున్నాం. మూడేళ్ల కిందట వరదలు వచ్చి నష్టం జరిగింది. వైకాపా ప్రభుత్వం తరఫున మంత్రులు వచ్చి పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని మాటిచ్చారు. మాకు ఎదురుచూపులే మిగిలాయి.

 ఇ.వెంకటయ్య, పెన్నపేరూరు

ఇళ్లకు పరిహారం ఇవ్వలేదు

సుమారు 14 ఏళ్లగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నాం. పొలాలకు  ఇచ్చారు. ఇళ్లకు ముంపు పరిహారం ఇవ్వలేదు. గ్రామంలో వ్యవసాయం, పశువులు, జీవాలు పోషించే పరిస్థితులు లేవు.  పలుసార్లు వెనుక జలాల్లో మునిగి తీవ్రంగా నష్టపోయాం.

 గంగిరెడ్డి, చింతువాండ్లపల్లె, అట్లూరు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని