logo

గగన విహారం... నిధుల్లేక జాప్యం!

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో పెన్నాలోయ వద్ద రోప్‌ వే పనులు మళ్లీ నిలిచిపోయాయి. నిధుల లేమితో గత కొద్ది నెలలుగా పనులు స్తంభించిపోయాయి.

Published : 06 Feb 2023 02:27 IST

గండికోటలో నిలిచిన రోప్‌వే నిర్మాణ పనులు

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో పెన్నాలోయ వద్ద రోప్‌ వే పనులు మళ్లీ నిలిచిపోయాయి. నిధుల లేమితో గత కొద్ది నెలలుగా పనులు స్తంభించిపోయాయి. లోయ అందాలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లోయ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. రెండు కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉండే పెన్నానది ప్రవాహ దృశ్యాలను తిలకించేవిధంగా రోప్‌వే నిర్మాణానికి తెదేపా ప్రభుత్వ హయాంలో పునాది పడింది. ఈ నిర్మాణానికి రూ.7 కోట్లకుపైగా నిధులు కేటాయించారు.

పర్యాటకులను కనువిందు చేస్తున్న పెన్నాలోయ అందాలు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు: గండికోట ముఖద్వారం వద్ద పెన్నాలోయకు అడ్డంగా రోప్‌వే నిర్మాణానికి 2019, ఫిబ్రవరి 10న అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆరు నెలల్లో రోప్‌ వే పనులు పూర్తిచేసి పర్యాటకులకు కొత్త అందాలను చూపిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. ఇంత వరకు సుమారు రూ.5 కోట్ల పనులు జరిగినట్లు సమాచారం. 2020, జనవరి 11, 12 తేదీల్లో గండికోటలో వారసత్వ ఉత్సవాలు జరిగాయి. 12వ తేదీన ముగ్గురు మంత్రులు అంజాద్‌బాషా, అవంతి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌ హాజరై గండికోట చరిత్రను ప్రశంసించారు. రోప్‌ వే నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పూర్తిచేస్తామన్నారు. అనంతరం పనులు ప్రారంభించి సిమెంటు దిమ్మెలతోపాటు ఇనుప కమ్మీలను కేబిన్‌ల నిర్మాణానికి ఏర్పాటు చేశారు. మిగిలిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయినట్లు సమాచారం. రోప్‌ వే పనులు పూర్తయితే పెన్నాలోయతోపాటు ఆవతలి గట్టుపైన ఉండే పవిత్ర అగస్తేశ్వరస్వామి కోన, మైలవరం జలాశయం అందాలను వీక్షించవచ్చు.

గండికోటలోని పెన్నాలోయ వద్ద రోప్‌వే కోసం నిర్మించిన సిమెంటు దిమ్మెలు

త్వరలోనే పూర్తిచేస్తాం

కరోనాతోపాటు వివిధ కారణాలతో రోప్‌ వే నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. ఇంత వరకు సుమారు రూ.5 కోట్ల విలువైన పనులు జరిగాయి. పెన్నాలోయకిరువైపులా కొంత మేర పనులు జరిగాయి. నిర్మాణం కోసం రోప్‌ (తాళ్లు), గేర్‌బాక్సు, టవర్‌ ఏర్పాటుకు కావాల్సిన సామగ్రి సిద్ధంగా ఉన్నాయి. నిధులు విడుదలైతే మిగిలిన పనులు త్వరలోనేపూర్తిచేస్తాం.  

ఈశ్వరయ్య, ఈఈ, పర్యాటకశాఖ, అనంతపురం జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని