logo

TDP: పులిగడ్డన తెదేపాకు హ్యాట్రిక్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి వరుసగా మూడోసారి తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Updated : 20 Mar 2023 09:04 IST

వరుసగా దక్కిన ఎమ్మెల్సీ పదవులు 
రామగోపాల్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

పులివెందులలో రామగోపాల్‌రెడ్డికి గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న మహిళ

ఈనాడు డిజిటల్‌, కడప : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి వరుసగా మూడోసారి తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సతీష్‌రెడ్డి, బీటెక్‌ రవి ప్రస్తుతం భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. 1978 నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట. ఎన్నడూ ఓటమిని రుచి చూడని రికార్డును సొంతం చేసుకున్న రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందుల నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌ మరణానంతరం ఆయన సతీమణి విజయమ్మ 2011 మేలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుంచి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి జగన్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి అడ్డాగా మారిన నియోజకవర్గం నుంచి తెదేపాకు వరుసగా ఎమ్మెల్సీ పదవులు వరించాయి. 2011లో సతీష్‌రెడ్డి ఎమ్మెల్యే కోటా కింద తెదేపా నుంచి ఎన్నికయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన బీటెక్‌ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనూహ్య విజయం సాధించారు. అందులోనూ వైఎస్‌ వివేకానందరెడ్డిపై! పార్టీకి ఓటర్ల పరంగా సంఖ్యా బలం లేకున్నా గెలుపొందడం విశేషం. ఆయన పదవీకాలం ఈనెలలోనే పూర్తి కానుంది. ఇప్పుడు ఆదే మండలానికి చెందిన రామగోపాల్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ప్రత్యేకత సంతరించుకుంది. వైఎస్‌ కంచుకోటలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీలో చేరినప్పటి నుంచి జెండా వదలని వీరాభిమాని రామగోపాల్‌రెడ్డి. ఈయన ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన గెలుపు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వ్యూహాత్మక అడుగులు

పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బరిలోకి దింపగా వైకాపా అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డిపై భారీ విజయం సాధించారు. ఈ విజయంతో పులివెందుల పూల అంగళ్ల వద్ద తెదేపా జెండా రెపరెపలాడింది. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ కంచుకోటలో తెదేపా జెండా ఎగరడం వైకాపా శ్రేణులకు మింగుడుపడని అంశం. అందులోనూ తెదేపా శ్రేణులు ఊరూరా సంబరాలు చేసుకునే పరిస్థితి తొలిసారిగా రావడంపై ఓ రకంగా మదనపడుతున్నారు. సీఎం జగన్‌ను కలిసే పరిస్థితి లేకపోవడం, స్థానికంగా తమను ఆదుకునే వారులేరనే అసంతృప్తి వైకాపా నాయకుల్లో నెలకొంది. ఇలాంటి తరుణంలో తెదేపా పులివెందులపై గురి పెట్టడం.. ఇక్కడి అభ్యర్థిని నిలబెట్టి ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం, భవిష్యత్తులో పాగా వేసే ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై జగన్‌ గురిపెట్టడంతో... ప్రతిగా తెదేపా పులివెందులపై దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. రామగోపాల్‌రెడ్డి విజయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇదే ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా సీనియర్లు వ్యూహరచన చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని