logo

AP News: కొట్టానంటే గూబ గుయ్‌మంటుంది!.. ఉద్యోగులపై రెచ్చిపోయిన ఏఎంసీ ఛైర్మన్‌

‘లేరా కొడకా... కొట్టానంటే గూబ గుయ్‌మంటుంది..’ అంటూ పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ఉద్యోగులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అడ్డుకోబోయిన వారిని కొట్టడానికి యత్నించారు.

Updated : 08 Apr 2024 08:17 IST

తన వాటా రూ.5 వేలు ఇవ్వలేదని ఆగ్రహావేశం

ఛైర్మన్‌ ఎల్లయ్యతో మాట్లాడుతున్న కార్యదర్శి సురేంద్ర, సూపర్‌వైజర్‌ వినయ్‌కుమార్‌

పీలేరు, న్యూస్‌టుడే: ‘లేరా కొడకా... కొట్టానంటే గూబ గుయ్‌మంటుంది..’ అంటూ పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ఉద్యోగులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అడ్డుకోబోయిన వారిని కొట్టడానికి యత్నించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని వదిలేయమని వేడుకున్నా వినకుండా మరింత రెచ్చిపోయిన ఛైర్మన్‌ తీవ్ర పరుష పదజాలంతో దుర్భాషలకు దిగారు. దీంతో విస్తుపోయిన పొరుగు సేవల ఉద్యోగులు ఛైర్మన్‌కు సర్దిచెప్పడంతో చివరకు ఛైర్మన్‌ కమిటీ కార్యదర్శి సురేంద్ర, కార్యదర్శి వినయ్‌కుమార్‌లకు క్షమాపణలు చెప్పారు. ఉద్యోగులపై వైకాపా నాయకులు దౌర్జాన్యానికి దిగడం రివాజుగా మారింది. కమిటీ ప్రాంగణంలో ఆదివారం గొర్రెల సంతలో కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రుసుంలో ఛైర్మన్‌కు రూ.5 వేలు ఇచ్చి పొరుగుసేవల ఉద్యోగులు ఒక్కొక్కరు రూ.300 చొప్పున తీసుకునే వారు. 2023-24 ఏడాదికి కమిటీ ఆదాయం లక్ష్యం రూ.40 లక్షలకు రూ.28 లక్షలు మాత్రమే వసూలైంది. దీంతో జిల్లా ఏఎంసీ అధికారులు పీలేరు ఉద్యోగులను లక్ష్యాలను సాధించాలంటూ చీవాట్లు పెట్టారు. దీంతో ఉద్యోగులు వసూలు చేసిన మొత్తం కమిటీ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇది నచ్చని ఛైర్మన్‌ తనకు డబ్బులు ఎందుకివ్వరని కమిటీ కార్యదర్శి సురేంద్ర, సూపర్‌వైజర్‌ వినయ్‌కుమార్‌ను గదమాయించారు. రుసుములు వసూలు చేస్తున్న ఉద్యోగులను దుర్భాషలాడారు. ఇంత వరకు పనిచేసిన ఛైర్మన్లు ఎవరూ ఇలా దుర్భాషలాడలేదని ఉద్యోగులు వాపోయారు. సిబ్బంది వద్ద ఆదివారం గొర్రెల సంత రుసుముల్లో రూ.5 వేలు తీసుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారని ఛైర్మన్‌ అడగ్గా అలాంటేమీ లేదని సమాధానం దాట వేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని