logo

జగన్‌ అరాచక కేళి.. జనం కావాలా బలి..!

అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది.

Updated : 30 Apr 2024 09:15 IST

వచ్చేనెల బ్యాంకుల్లో పింఛను నగదు జమకు నిర్ణయం
గత పంపిణీలో పలువురు మృతి చెందినా మారని తీరు
సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికీ  అందజేతకు అడ్డుపుల్ల
ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వైకాపా సర్కారు కుతంత్రాలు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ, చాపాడు, బద్వేలు గ్రామీణ, కొండాపురం, లింగాల 

వాలంటీర్లందరూ ఇంటింటికి వెళ్లి అవ్వతాతలతో మాట్లాడండి. ఈ సారి పింఛను డబ్బులు బ్యాంకుల్లో వేస్తారని చెప్పండి. గతంలో సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో ఎన్నో ప్రాణాలు తీశారు. ఈసారి ఏకంగా బ్యాంకుల చుట్టూ మండుటెండల్లో తిరగాల్సి వస్తుందని చెబుతూ వారితో సెల్ఫీ తీసుకుని సిద్ధం గ్రూపులో పెట్టండి. ఎవరూ ఏమాత్రం అలసత్వం చేయొద్దు. ఇదే మంచి తరుణం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ పరుగులు పెట్టాలి.

సిద్ధం పేరిట రూపొందించిన వాట్సప్‌ గ్రూపుల్లో పంపిన వాయిస్‌ మెసేజ్‌

ఇంటింటికి పింఛన్లు ఇవ్వకపోవడానికి తెదేపా కూటమిదే బాధ్యతంటూ స్పష్టంగా చెప్పండి. గతంలోనూ ఇదే విధంగా చేశారని, ఇప్పుడు మళ్లీ మరింత భారం పెంచుతున్నారని వివరించండి. మే ఒకటో తేదీ నుంచి జరిగే పరిణామాలను మనం సొంతం చేసుకోవాలి. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇవన్నీ మనం అనుకూలంగా మలుచుకుంటేనే మనకూ మంచి భవిష్యత్తు ఉంటుంది.

సిద్ధం పేరిట ఉన్న వాట్సప్‌ గ్రూపునకు అందిన రెండో వాయిస్‌ సందేశం

గత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎండల ధాటికి రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి సుదూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లాలంటే మరింత శ్రమపడాల్సి ఉంటుంది. రోజుల తరబడి తిరగాల్సి రావచ్చు. ఇప్పుడు బండలు పగిలే ఎండలతో మరింత మంది రాలిపోతారు. శవ రాజకీయాలతో చలికాసుకోవాలనే ప్రయత్నం... వైకాపా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది.

అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. గోటితో పోయే వ్యవహారాన్ని గొడ్డలి వరకు పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని లాగుతోంది.  అభాగ్య జనం మెడపై కత్తిపెట్టి వారి ప్రాణాలు పోతే రాజకీయంగా లబ్ధి పొందడానికి కాసుకుని కూర్చుంది. చావు తెలివితేటల్లో ఆరితేరిన వైకాపా పాలకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గతంలో సచివాలయాల వరకు పింఛన్ల లబ్ధిదారులను రప్పించి వారిని రాచి రంపాన పెట్టారు. తాజాగా ఏకంగా అవ్వాతాతలను బ్యాంకుల చుట్టూ తిరిగేలా, ఎండలో నిలబెట్టి పాశవికంగా వేడుక చూడాలనే ఎత్తుగడతో కుయుక్తులు పన్నింది.

పింఛన్ల పంపిణీ విషయంలో తలెత్తే విషత్కర పరిణామాలను అవకాశంగా మలుచుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో విష ప్రచారానికి తెరలేపుతూ వైకాపా వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారాన్ని చేపట్టింది. ‘జగనన్నపై ఉన్న కోపంతో చంద్రబాబు మార్చి పింఛను డబ్బులు ఇంటింటికీ అందించకుండా అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో కూడా కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇకపై మండుటెండల్లో అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది’.. అంటూ ప్రచారానికి దిగింది. ఈ సారాంశాన్ని అన్ని గ్రూపుల్లో ప్రచారం చేయాలని సచివాలయ సిబ్బందితో పాటు వైకాపా శ్రేణులకు సమాచారం అందింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మే, జూన్‌ నెలల్లో పింఛన్లను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కలెక్టర్లకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్నవారికి ఇంటి వద్దే పంపిణీ ,చేయాలని ఆదేశాలిచ్చింది. మే 1 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పింఛను పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇదే విధానం జూన్‌ మాసంలోనూ అమలు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. దీనిపై వైకాపా ఇప్పుడు కొత్తరాగం అందుకుని.. డబ్బులు తీసుకోవడానికి లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడతారని, దీనికి తెదేపానే కారణమంటూ ఆ పార్టీ నెత్తిన నెపం మోపడానికి కుతంత్రాలు నడుపుతోంది. తెదేపా సైతం సచివాలయ సిబ్బందితో పాటు ఇతరత్రా యంత్రాంగాలను వాడుకుని ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని చాలా రోజులుగా కోరుతూ వస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సైతం పలుమార్లు విన్నవించింది. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు జమ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు 74 శాతం మంది బ్యాంకు ఖాతాలకు పింఛను జమ చేయడానికి సౌలభ్యం ఉందని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మిగిలిన 26 శాతం మందికి ఇంటి వద్దే అందించనున్నారు.

దువ్వూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పింఛనుదారుల పడిగాపులు (పాతచిత్రం)

అందుబాటులో సరిపడా సిబ్బంది ఉన్నా

ప్రతి నెలా పింఛన్లను పంపిణీ చేసే వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం సొంత సైన్యంగా మార్చుకుంది. ఈ తరుణంలో వెల్లువెత్తిన విమర్శలతో వాస్తవాలను గ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించి ఆ వ్యవస్థను తాత్కాలికంగా పక్కన పెట్టింది. వీరికి ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పాటు డీఆర్‌డీఏలో ఏపీఎంలు, సీసీలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, డ్వామా సిబ్బంది తదితర శాఖల్లోని ఉద్యోగులు, సిబ్బంది సైతం పింఛన్ల పంపిణీ, ఇతర సేవలకు వినియోగించుకునే సౌలభ్యం ఉంది. ఇలాంటి ప్రత్యామ్నాయాల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు సైతం తొక్కని గడపంటూ లేదు.

మైదుకూరులోని ఏడో సచివాలయంలో పింఛనుదారులతో కిక్కిరిసిన గది (పాతచిత్రం)

మొత్తం పింఛనుదారులు 2,67,492
పంపిణీ చేయాల్సిన మొత్తం రూ.79.09 కోట్లు
బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఎంపికైనవారు 1,87,103
ఇంటి వద్ద ఇచ్చేందుకు ఎంపికైన వారు 80,389


ఎందుకింత కక్ష?

  • జిల్లాలో బండలు పగిలేవిధంగా ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని  విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో అవ్వాతాతలను బ్యాంకుల చుట్టూ తిప్పే కుతంత్రాలు నడుస్తున్నాయి. బ్యాంకుకు వెళితే కనీసం గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కడప నగరంలోనే ఎటు వెళ్లినా  ఒకట్రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. రాకపోకలకు ఆటోలను ఆశ్రయించాల్సిందే. ఎంతలేదన్నా.. రూ.200 తక్కువ లేకుండా ఛార్జీలు భరించాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
  • పెద్దముడియంలో రెండు బ్యాంకులున్నాయి. ఇక్కడికి దిగువకలవటాల గ్రామానికి 16 కిలోమీటర్లు, కొండ సుంకేసుల 19, పాపాయపల్లె 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆచా గ్రామాల పింఛనుదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉంటుంది.
  • సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సింహాద్రిపురంలో రెండు బ్యాంకులున్నాయి. ఇక్కడికి సుంకేసుల గ్రామం నుంచి 16 కిలోమీటర్లు, రావుల కొలను 18, దిద్దేకుంట, లోమడ గ్రామాలకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం లేనందున ఆటోలను ఆశ్రయించాల్సిందే, కనీసం రూ.400 వరకు ఆటోలకు అద్దె చెల్లించాలి.
  • మండల కేంద్రం కలసపాడులో రెండు బ్యాంకులున్నాయి. ఇక్కడ నుంచి చెన్నుపల్లె, గోపవరంపల్లె, ముదిరెడ్డిపల్లె గ్రామాలకు 10 కిలోమీటర్లు, తెల్లపాడు 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఆయా గ్రామాల్లో 300 మంది వరకు లబ్ధిదారులు ఉంటారు. వీరికి బస్సు సౌకర్యం లేనందున ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సిందే. వీరికి ప్రయాణ, శ్రమ భారం అధికంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు జిల్లాలో వేలాది మంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను అమలు చేసే పక్షంలో అవ్వాతాతలకు తీవ్ర అసౌకర్యం, ప్రాణాపాయానికి ఆస్కారం ఉంది.  

వరుసలో నిలబడి పడిగాపులు కాయలేం

నాకు 80 ఏళ్లు. వృద్ధాప్య పింఛను వస్తోంది. మార్చి నెల పింఛను సచివాలయాల వద్ద పంపిణీ చేయగా అక్కడ గంటలతరబడి నిరీక్షించి నీరసించాను. ఎవరో ఒకరు తోడు లేనిదే బయటకు రాలేని పరిస్థితి. పింఛను కోసం బ్యాంకులో గంటల తరబడి బారుల తీరడం మాలాంటి వారికి కష్టమే.

కొండారెడ్డి, ఎన్‌.కొట్టాలపల్లె, జమ్మలమడుగు


వయసు మీదపడడంతో నడవలేకపోతున్నా...

వయసు మీదపడడంతో నడవలేక పోతున్నా. కాళ్లు వణుకుతూ అడుగు వేయడానికే కష్టమవుతోంది. ఎప్పుడూ ఒకటో తేదీన వచ్చే ఈ సొమ్ము పోయిన సారి ఆలస్యమైంది. సొమ్ము తీసుకునేందుకు సచివాలయం వద్దకు వెళ్లేందుకు చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే ఇబ్బందే.

లక్షుమ్మ, సిరిగేపల్లె, జమ్మలమడుగు మండలం


తోడు లేకుండా వెళ్లలేను

వృద్ధాప్యంతో మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నా. గత పింఛను కోసం అవస్థలు పడుతూనే సచివాలయానికి చేరుకున్నా. ఇప్పుడు ఎండలకు అసలు బయటకు రావడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో బ్యాంకుకు వెళ్లి పింఛను తీసుకోవడం ఎలాగో తెలియడం లేదు. ఈ బాధలేవీ లేకుండా ఇళ్లకు వచ్చి పింఛను ఇవ్వాలి.

భూపతి బ్రహ్మం, కన్యతీర్థం, జమ్మలమడుగు మండలం


రెండు బస్సులు మారాలంటే అవస్థే

గత 20 ఏళ్లుగా వితంతు పింఛను తీసుకుంటున్నాను. ఎప్పుడూ ఇలాంటి కష్టాలు చూడలేదు. బ్యాంకులో పింఛను వేస్తామనడం దారుణం. టి.ఓబాయపల్లె, అన్నవరం, మడూరు నుంచి చాపాడు బ్యాంకుకు వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి. ఇంటి వద్ద ఇచ్చేలా చొరవ తీసుకోవాలి. లేదంటే ఎండలకు బలి కావాల్సిందే.

సుబ్బలక్షుమ్మ, అన్నవరం, చాపాడు మండలం


11 కిలోమీటర్లు ప్రయాణించాలి

మా గ్రామంలో బ్యాంకు లేకపోవడంతో పింఛను డబ్బులు తీసుకునేందుకు సింహాద్రిపురంలోని బ్యాంకుకు వెళ్లాలంటే 11 కిలోమీటర్లు ప్రయాణించాలి. నేను నడిచే పరిస్థితి లేదు. పింఛను    డబ్బులు తీసుకునేందుకు వెళ్లాలంటే భయమేస్తోంది. సచివాలయ సిబ్బంది ఇళ్ల  వద్దకు వచ్చి పింఛను ఇవ్వాలి.

వెంకటలక్షుమ్మ, వెలిదండ్ల, లింగాల మండలం


సహాయకులు లేనిదే బయటకు వెళ్లలేను

సహాయకులు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. నాకు 80 ఏళ్లు ఈ వయసులో ఎక్కువ సేపు నిలబడలేను.. కూర్చోలేను. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కుపోతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పింఛన్‌ సొమ్ముల కోసం బ్యాంకుకు వెళ్లాలని చెబుతున్నారు. బ్యాంకులో కనీసం కొంతసేపు కూడా క్యూలైన్‌లో నిలబడలేను. ఇంటి వద్దకే వచ్చి పింఛను అంచాలి.

గోరిశెట్టి రాములమ్మ, కొండాపురం


బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోవాలంటే ఇబ్బందే

వృద్ధాప్య పింఛను బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందే. ఎండలు మండిపోతున్నాయి. వృద్ధులం ఎండకు బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి తెచ్చుకోలేం. ప్రభుత్వం ఎండలను, వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్దకే ఇవ్వాలి.

లక్షుమ్మ, వృద్ధురాలు, అనంతరాజపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని