logo

సమస్యల తిష్ఠ... జగన్‌ పాలనకు పరాకాష్ట

ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు.

Published : 01 May 2024 01:51 IST

కాలనీల్లో ప్రజల కన్నీటి వెతలు
మైదుకూరు, జమ్మలమడుగు పురపాలక సంఘాల పరిస్థితి
న్యూస్‌టుడే, మైదుకూరు, జమ్మలమడుగు

చర్చి వెనుకభాగంలోని మురుగుకాలువలో వ్యర్థాలు

ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. మరికొన్ని చోట్ల రహదారులు చీలిపోయి ఉన్నాయి. ఈ అయిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఇదేనా అని వార్డు ప్రజలు నిలదీస్తున్నారు. కొన్ని వీధులు మరీ ఇరుకుగా మారాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అత్యవసర వేళల్లో అంబులెన్స్‌ కూడా రాలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వానా కాలంలో కొన్ని చోట్ల కాలువలు పొంగి ప్రవహిస్తాయని అలాంటి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్లేని వార్డు మైదుకూరు పురపాలకలో కనిపించలేదు. ఏప్రాంతానికి వెళ్లి ఎవరిని కదిలించినా చాంతాడంత సమస్యలు ప్రస్తావిస్తున్నారు. పురపాలక ఏడో వార్డులో సమస్యలు తాండవిస్తున్నాయి. పాలకవర్గం ఏర్పాటు నుంచి వార్డు కౌన్సిలర్‌ ఏపీ సుమలత పోరుపెట్టినా పరిష్కారం దొరకలేదు. అభివృద్ధికి నోచుకోలేదు. ఓటుతో సమాధానం అంటూ వార్డు వాసులు హెచ్చరిస్తున్నారు. బద్వేలురోడ్డులోని చిన్నమసీదు నుంచి సాయిబాబా ఆలయానికి వెళ్లేదారిలో మురుగుకాలువ పలుచోట్ల ధ్వంసమైనా పునరుద్ధరణకు నోచుకోలేదు. మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చే పంటకాలువ స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతూ ఉండగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణ తొలగించి కాలువ నిర్మించకపోగా దారిమళ్లించి చర్చి వీధి మీదుగా నిర్మించారు. దీంతో దారి ఇరుకుగా మారింది. సమీపంలోని వీధి మధ్యలో విద్యుత్తు స్తంభం ఉండటంతో రాకపోకలకు సమస్యగా మారింది. చర్చి వెనుకభాగంలో విద్యుత్తు స్తంభాలు వేసినా దీపాలు అమర్చలేదు. రేణుకా ఎల్లమ్మవీధి నుంచి గాంధీనగర్‌కు వెళ్లే దారి అధ్వానంగా మారింది. ఒకటి, రెండు వీధులు తప్పితే వార్డులో మురుగుకాలువల సమస్య వెంటాడుతోంది. చిలుంగారి వీధికి ఇటీవలే సిమెంట్‌రోడ్డు వేసినా మురుగుకాలువ నిర్మించలేదు. వాసవీనగర్‌ నుంచి రేణుకాఎల్లమ్మ వీధికి మురుగుకాలువ లేదు.


పూడికతో కాలువలు... విజృంభిస్తున్న దోమలు

జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన  ప్రమాదకరంగా పైకప్పు లేని డ్రైనేజీ

జమ్మలమడుగు నగర పంచాయతీ ఏడో వార్డులో మేదరవీధి, దుత్తలూరు నగర్‌, ఎస్సీ కాలనీ, జాన్‌స్కూల్‌ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన జాన్‌ స్కూల్‌ వెళ్లే దారిలోని కాలువ మరింత ప్రమాదకరంగా మారింది. సిమెంటు రోడ్డుకు ఒక వైపు కాలువ ఉన్నా దానిపైన మూత లేకపోవడంతో తరచూ వాహనదారులు కింద పడుతున్నారు. ఎస్సీ కాలనీలోని పలు కాలువలు పూడికతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రైతే దోమలు విజృంభిస్తున్నాయని, ఫాగింగ్‌ కూడా చేయడం లేదని చెబుతున్నారు.

ఒక్కరూ కనికరించలేదు

వర్షమొస్తే మావీధిలోకి నీళ్లు నిలుస్తున్నాయి. మురుగుకాలువ కట్టాలని వచ్చిన నాయకులను అందరినీ అడుగుతూనే ఉన్నా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మా వీధికి దగ్గరగా ఉన్న మురుగుకాలువలో చెత్త పేరుకు పోతున్నా తొలగించడం లేదు. దోమలు ఎక్కువగా ఉన్నాయి.

మెల్కమ్మ, సాయినాథపురం, మైదుకూరు

రక్షణ చర్యలు చేపట్టాలి

జాన్‌స్కూల్‌ వెళ్లే దారిలో డ్రైనేజీ ప్రమాదకరంగా ఉంది. ఇటీవల ఒక ఆటో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఇదే దారిలో స్కూలు విద్యార్థులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి పైకప్పు ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు సురక్షితంగా ఉంటుంది.

 త్యాగరాజు, ఏడో వార్డు, జమ్మలమడుగు నగర పంచాయతీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని