logo

కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!

‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి.

Published : 01 May 2024 06:11 IST

గ్రామీణ,  పట్టణ వాసులకు రక్షిత జలాలు
జలస్ఫూర్తితో సాగునీటి పనులకు శ్రీకారం
పారిశ్రామిక వెలుగులకు ప్రత్యేక ప్రణాళికలు
తెదేపా- జనసేన-భాజపా కూటమి మేనిఫెస్టో
న్యూస్‌టుడే, కడప

‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. ఉత్తమ పాలనతో ప్రజల హృదయాల్లో స్థానం పదిలం చేసుకోవాలి. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించాలి. ఆకాశమే హద్దుగా అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. పల్లె, పట్టణ వాసులకు రక్షిత జలాలు సరఫరా చేయాలి. సాగునీటి బెంగ తీర్చాలి. విద్యా రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ప్రజారోగ్యానికి భరోసా కల్పించాలి. పారిశ్రామిక ప్రగతి ప్రకాశించాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి.’ ఇదే స్ఫూర్తితో తెదేపా-జనసేన-భాజపా కూటమి పెద్దలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. జనాకర్షక హామీలను చూసి పేద, బడుగు వర్గాల మోము మురిసిపోతోంది. మళ్లీ కూటమి మునుపటిలా ఆదర్శ పాలన రావాలని వారంతా  ఆకాంక్షిస్తున్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ధీమానిచ్చేలా కూటమి హామీల వర్షం కురిపించింది.
 జిల్లాలో ఏడు శాసనసభ, ఒక లోకసభ స్థానానికి వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా ఎన్‌డీఏ కూటమి వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. జిల్లాలోని పల్లె సీమల్లో 12,51,364 మంది, పట్టణాల్లో 8,09,290 మంది నివాసం ఉంటున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అభివృద్ధి రంగాన్ని పూర్తిగా విస్మరించారు. సాగునీటి వనరులపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. నిర్దేశిత ఆయకట్టులో కనీసం నాలుగో వంతు భూములకు కూడా నేరుగా నీరివ్వలేదు. జిల్లాలో చిన్న, మధ్య తరహా, పెద్ద జలాశయాలు 11 ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 77.292 టీఎంసీలు. తరి, మెట్ట ప్రాంతంలో ఉన్న 4,20,184 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సీఎం జగన్‌ తన పాలనలో అలసత్వం వహించడంతో కర్షకులకు కన్నీళ్లు తప్పడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో మొదటి, రెండో దశ, తెలుగుగంగ, కేసీ కాలువ, పీబీఆర్‌, పైడిపాళెం, సర్వరాయసాగర్‌, వామికొండ, మైలవరం, దిగువసగిలేరు, బుగ్గవంక జలాశయాలకు మహర్దశ కలగనుంది. కూటమి అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని గండికోట ముంపు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజలకు  రక్షిత నీరు

జిల్లాలో గ్రామ పంచాయతీలు 557 ఉన్నాయి. కడప నగర పాలక, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు, ఎర్రగుంట్ల, కమలాపురం పురపాలకలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా దాహం కేకలతో ప్రజల గొంతెండిపోతోంది. బిందెడు నీటి కోసం రాత్రి వేళ జాగారం చేయాల్సిన పరిస్థితులున్నాయి. వేసవిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. జగన్‌ పాలనలో ప్రజలను దాహార్తి కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే జలస్ఫూర్తితో రక్షిత నీటిని సరఫరా చేయనున్నారు. నీటి బెంగ దరి రాకుండా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 51, ఉప కేంద్రాలు 648, సమగ్ర అత్యవసర గర్భిణి, శిశు కేంద్రాలు అయిదు, వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రులు ఏడు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు 30, జిల్లా, ప్రాంతీయ, సామాజిక వైద్యశాలలున్నాయి. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మందుల కొనుగోలు చేయడానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదు. సూది, దూది, ఔషధాల సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు కాన్పు కోసం కనీసం 50 శాతం మంది కూడా రావడం లేదు. పేదల ఆరోగ్యానికి భరోసా లేకపోయింది. కూటమి అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తారని వారంతా నమ్మకంతో ఉన్నారు.

ఉద్యానానికి వెన్నుదన్ను

జిల్లాలో ఉద్యాన తోటలు 57,653 హెక్టార్లలో సాగులో ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం విపణిలో నిలకడగా లేని ధరలతో రైతులు నష్టపోతున్నారు. గిట్టుబాటు దక్కడం లేదు. వరదలు వచ్చినప్పుడు, ఈదురుగాలులు వీచిన సమయంలో ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. సకాలంలో పెట్టుబడి రాయితీ చెల్లించడం లేదు. నిధులు విడుదల చేసినట్లు సీఎం జగన్‌ చెబుతున్నా బాధితుల ఖాతాల్లో జమ కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని రైతులు కోరుకుంటున్నారు.

పారిశ్రామిక ప్రగతి పరుగులు 

జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. వనరులకు తగ్గ పరిశ్రమలు అందుబాటులో లేవు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కరవైంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎంతో మంది వలస వెళ్తున్నారు. స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ హామీనిచ్చినా ఆచరణకు నోచుకోలేదు. ఉక్కు పరిశ్రమ తుక్కుగా మారింది. కొప్పర్తి పారిశ్రమిక వాడలో ఆశించిన స్థాయిలో కర్మాగారాలు ఏర్పాటు కాలేదు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే పారిశ్రామిక ప్రగతి పరుగులు తీయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని