logo

జగన్‌ హామీలు... నీటిపై రాతలు

జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు.

Published : 07 May 2024 05:45 IST

వంతెన పనులు ఇంకెప్పుడు మొదలు పెడతారు? ఏళ్లు గడుస్తున్నా తీరని సమస్య
న్యూస్‌టుడే, అట్లూరు

వేమలూరు వంతెనపై నడుంలోతు వెనుక జలాల్లో అవస్థలు పడుతూ దాటుతున్న స్థానికులు (పాత చిత్రం)

అట్లూరు మండలంలోని సగిలేరు నదిపై వేమలూరు సమీపంలో వంతెన నిర్మాణానికి రూ.22 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశాం. తద్వారా 30 గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం.

బద్వేలు ఉప ఎన్నికల సందర్భంగా 2021లో బద్వేలు ప్రచార సభలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ


జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. స్థానికులు అంతలా ఆదరించినా అట్లూరు మండలానికి ఇచ్చిన హామీని సీఎం నిలుపుకోలేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. బద్వేలు ఉప ఎన్నికల 2021 జరిగిన ప్రచార సభలో రు.22 కోట్లతో అట్లూరు మండలంలోని వేమలూరు వంతెన పనులుకు శంకుస్థాపన చేశారే కానీ.. కార్యాచరణకు నోచుకోలేదు. వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి 36 నెలలు గడుస్తున్నా 30 గ్రామాల కష్టాలను ప్రభుత్వం వదిలేసింది. సోమశిల జలాశయంలో వెనుక జలాలు, సగిలేరులో ప్రవాహ నీరు వేమలూరు వంతెనపై సుమారు 6 అడుగుల వరకు నిల్వ ఉండి స్థానికుల కష్టాలకు నిలువెత్తుగా మారుతోంది. 2019 నుంచి వరుసగా మూడు సార్లు సోమశిల జలాశయం 78 టీఎంసీల నీటితో నిండి నెలల తరబడి స్థిరంగా నిల్వ పెట్టారు. దీంతో వంతెనపై నిలిచిన నీరు పాచిపట్టి కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో నెలల తరబడి వెనుక జలాలు నిల్వ చేసి ఉంచడంతో నీటిలో వంతెన నడిచి దాటాలంటే వెళ్లే వారికి శరీరంపై దురదలు వచ్చాయి. నిత్యం అనేక మంది రాకపోకలతో రద్దీగా ఉండే వేములూరు వంతెన వెనుక జలాలతో మునిగిపోతే స్థానికులు కష్టాలు తప్పుడం లేదు. ఆరు పంచాయతీలు 30 గ్రామాలకు చెందిన పాల వ్యాపారులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, గ్రామసేవలకులు, వ్యాపారులు, రైతులు, డ్వాక్రా మహిళలు వెలుగు కార్యాలయం వెళ్లాలన్నా, మండల కార్యాలయాలకు స్థానికులు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులకు అట్లూరుకు రావాలన్నా, కడపకు వెళ్లాలన్నా, పోలీస్‌స్టేషన్‌ పనులకు, ఇటువంటి పనులన్నీ స్తంభించనున్నాయి. నల్లాయపల్లె, చెలంగారిపల్లె, చౌటపల్లె, ఈశ్వరబొట్లపల్లె, జీకొత్తపల్లె, ఎస్‌టీ కాలనీల వారు సచివాలయ పనులకు వంతెన దాటి వెళ్లాలంటే భారమవుతుంది. ట్రాన్స్‌కో సిబ్బందికి, ఏఎన్‌ఎంలకు ఇబ్బందులు తప్పడం లేదు. వంతెనపై నీరు నిలవడంతో 12 కిలోమీటర్లకు 45 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి. ఇలా వెళ్లాలన్నా రవాణా సౌకర్యం లేక అవస్థలు పడాల్సి వస్తుంది. నెలల తరబడి వేమలూరు వంతెనపై రాకపోకలు లేకపోతే ఆ బాధలు తలుచుకుంటేనే భయమేస్తుందని స్థానికులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని