logo

రాజోలి అన్నావ్‌.. జోలాలి పాడావ్‌!

మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్‌ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్‌ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు.

Updated : 07 May 2024 06:37 IST

ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసిన సీఎం జగన్‌
ఒప్పందపత్రాలు తీసుకుని బాధిత రైతులకు ఇవ్వని పరిహారం
వేలాది ఎకరాల ఆయకట్టుపై ప్రభావం, తాగునీటికీ అవస్థలు
న్యూస్‌టుడే, జమ్మలమడుగు, మైదుకూరు, పెద్దముడియం

‘రాజోలి ప్రాజెక్టు పూర్తికాలేదని ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. ఎల్లకాలం చంద్రబాబు పాలన సాగదు. మనందరి పరిపాలనలోనే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. మనమే పూర్తి చేస్తాం’

2017, నవంబరులో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా దువ్వూరు సభలో ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ అన్న మాటలు.


కేసీ కాలువ కింద భూములకు ఇప్పటికీ అరకొరగా నీళ్లు వస్తున్న పరిస్థితులు మనకళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మేలు జరిగేవిధంగా అధికారం చేపట్టిన ఆరు నెలలు తిరగక మునుపే రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేస్తున్నా.

2019, డిసెంబరు 23న రాజోలి జలాశయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్‌ చెప్పిన మాటలు


మన ప్రభుత్వం వచ్చాక రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశాం. కొవిడ్‌ రావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంతగా లేకపోవడం కారణాలు ఏదైనా... కారణాలు మీకు చెప్పకూడదు గానీ రాజోలి ప్రాజెక్టును అనుకున్నంత వేగంగా చేయలేక పోయానని ఖచ్చితంగా చెబుతున్నా...  రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఎన్నికల ప్రచారం సందర్భంగా మైదుకూరు సభలో సీఎం జగన్‌ అన్న మాటలివి


వైకాపా ప్రభుత్వ హయంలోనే రాజోలి జలాశయం నిర్మించి రైతులకు కానుకగా అందిస్తాం

2022, జనవరి 17న దువ్వూరులో తహసీల్దారు కార్యాలయ ప్రారంభోత్సంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రకటన.


‘రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఏనాడో రాజోలి జలాశయం పూర్తయ్యేది. నాన్న పూర్తిచేయాలనుకున. ప్రాజెక్టును నేను పూర్తిచేస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా సీఎం జగన్‌ తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు. ఎలా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఏనాడైనా ఎమ్మెల్యే ప్రశ్నించారా? ధర్నా అయినా చేశారా మరి ఎందుకు ఓటేయాలి. ఎంపీ అవినాష్‌రెడ్డి రాజోలి కోసం పోరాటం చేశాడా మరెందుకు వేయాలన్నా వీరికి ఓట్లు.

ఈ నెల 3న మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల


మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్‌ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్‌ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. ఆనకట్ట ఏర్పాటైతే మన ప్రాంతం బాగుపడుతుందని, ఖరీదైన భూములను సైతం బాధిత రైతులు ఎకరా రూ.12.50 లక్షలకే ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు నెలల్లో పరిహారం చెల్లిస్తామన్న అధికారులు నిధుల్లేక ముఖం చాటేయడంతో రెండేళ్లు దాటినా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు ప్రాజెక్టు సామర్థ్యం 2.95 టీఎంసీల నుంచి 1.2 టీఎంసీలకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందన్న విషయంపై ఆరా తీసేందుకు కలెక్టరేట్‌ వద్దకు వెళితే అక్కడ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులే దాడికి పాల్పడిన ఘటన విస్మయానికి గురిచేసింది.  

రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్‌, పక్కన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి (పాతచిత్రం)


92 వేల ఎకరాల ఆయకట్టు

కర్నూలు-కడప కాలువ కింద జిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్‌డివిజన్‌లోని పెద్దముడియం మండలంలో 10,066.62 ఎకరాలు, మైదుకూరు సబ్‌ డివిజన్‌లోని పది మండలాల్లో 82 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. కుందూ నది వరదలతో ఏటా 50 నుంచి 60 టీఎంసీల విలువైన జలాలు వృథా అవుతున్నాయి. ఆ నీటిని ఒడిసి పట్టుకుంటే అదనంగా వేలాది ఎకరాలకు సాగునీరందే అవకాశముంటుంది. పెద్దముడియం మండలంలో రాజోలి జలాశయం ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరిచ్చేందుకు పాలకులు నిర్ణయించారు.  నెమళ్లదిన్నె, బలపనగూడూరు, ఉప్పులూరు, గరిశలూరు, చిన్నముడియం ఐదు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లో 794 ఇళ్లు ఉండగా, 2,785 జనాభా ఉన్నట్లు తేల్చారు. పరిహారం విషయంలో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సమాధానం దాటవేయడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


అన్నదాతల ఆందోళన బాట

రాజోలి జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న పెద్దముడియం మండలానికి చెందిన బాధిత రైతులు 2022, డిసెంబరు 5న కలెక్టర్‌ ఛాంబరు ఎదుట ఆందోళనకు దిగారు. రిజర్వాయర్‌ కోసం సుమారు 9 వేల ఎకరాలు సేకరించారని, 4 వేల ఎకరాలకు సర్వే కూడా చేసి భూములు తీసుకున్నట్లు కలెక్టర్‌, జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని వారంతా నిరసనకు దిగారు.

  • పరిహారం కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఆర్డీవో, కలెక్టరును పలుమార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయ సామర్ధ్యాన్ని 2.95 టీఎంసీల నుంచి 1.2 టీఎంసీలకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందన్న విషయంపై రైతులు 2023లో కడప కలెక్టరు కార్యాలయం వెళితే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎదుటే ఆయన అనుచరులు బాధిత రైతులపై దాడికి దిగడం వివాదాస్పదమైంది.

ముంపు జాబితాలో పెద్దముడియం మండలం చిన్నముడియం గ్రామం


తండ్రీకుమారుల  శంకుస్థాపన

2004లో అధికారం చేపట్టిన అనంతరం 2009 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుందూ నదిపై రాజోలి జలాశయం నిర్మాణానికి ముందుకొచ్చారు. రూ.291.02 కోట్ల అôచనాతో పనులు పూర్తికి 2008 డిసెంబరు 23న పరిపాలన అనుమతులు జారీ చేశారు. మరుసటి రోజే పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణాంతరం 2019, డిసెంబరు 23న సీఎం జగన్‌ మరోసారి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు కావస్తున్నా పనులు చేపట్టలేకపోయారు.


ఎకరాకు రూ.12.50 లక్షల  పరిహారం

రాజోలి జలాశయం సాకారం కోసం పెద్దముడియం మండలంలోని ఐదు ముంపు గ్రామాల్లో వేలాది ఎకరాల భూమిని సేకరించారు. కొంతమేర సర్వే పనులు సైతం పూర్తయ్యాయి. 2022, ఏప్రిల్‌లో ఒక బృందం ముంపు గ్రామాల బాధిత రైతులతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున పరిహారం రెండు నెలల్లో ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం విదిల్చలేదు.


ఆశలు వదులుకున్నాం : రాజోలి జలాశయం చేపట్టడానికి రైతుల నుంచి అధికారులు వేగవంతంగా పత్రాలు తీసుకుంటుంటే పనులు వేగవంతంగా అవుతాయని అనుకున్నాం. ముంపు కింద 1.50 ఎకరాల విస్తీˆ్తర్ణం పోయింది. సీˆఎం మన జిల్లా వాసే కదా పరిహారం త్వరగా వస్తుందని నమ్మాం. ఏళ్లు గడుస్తున్నాయి. జలాశయం నిర్మాణంపై ఆశలు వదులుకోవాల్సిందే.

వెంకటసుబ్బారెడ్డి, నెమళ్లదిన్నె, పెద్దముడియం మండలం


శంకుస్థాపనతోనే సరిపెట్టారు : ఇద్దరు ముఖ్యమంత్రులు రాజోలి జలాశయానికి శంకుస్ధాపనతోనే సరిపెట్టారు. ఏదో ఒక సాకుతో రైతులను మభ్యపెడుతూ కాలం గడుపుతూ వచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే జలాశయం ఏర్పాటుతోనే రైతులకు నష్టపరిహారం వస్తుంది. ఎంతోమంది ఈ పొలాలను నమ్ముకుని పరిహారం డబ్బులొస్తాయని ఆశలు పెట్టుకుని మోసపోయారు.

పురుషోత్తం రెడ్డి, చిన్నముడియం


సుమారు రూ.10 లక్షల వరకు అప్పు : నాకున్న ఏడెకరాలు మునక కింద పోతాయి. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద కుమార్తె వివాహం కోసం సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాను.ఆనకట్ట కింద భూములు ముంపునకు గురైతే ఒక్కో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని చెప్పి కూడా ఏళ్లు గడిచాయి. ఇంతవరకు పరిహారమివ్వలేదు. అసలు ఎప్పుడిచ్చేది స్పష్టత లేదు.

శివశంకర్‌రెడ్డి, బలపనగూడూరు


ఎన్‌డీఏ అధికారంలోకొస్తే మెరుగైన పరిహారం : ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే మెరుగైన పరిహారం అందజేస్తామని చెబుతున్నారు. భాజపా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కూడా ఎకరాకు రూ.24 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. గతంలో అధికారులు మూడు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒప్పంద పత్రాలు ఇచ్చినందుకు మా పొలాలను క్రయ విక్రయాలు చేసుకోలేకపోతున్నాం.

పోరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, ఉప్పలూరు, పెద్దముడియం మండలం

రాజోలి ప్రాజెక్టు వివరాలు

నీటి నిల్వ సామర్థ్యం 2.95 టీఎంసీలు
మొత్తం ఖర్చు రూ.1,357.10 కోట్లు
ప్రధాన నీటి వనరు కుందూ నది
ముంపునకు గురయ్యే గ్రామాలు నెమళ్లదిన్నె, గరిశలూరు, చిన్నముడియం, బలపనగూడూరు, ఉప్పలూరు
జలాశయ నిర్మాణానికి  అవసరమైన భూమి  9,286.37 ఎకరాలు

ప్రయోజనాలు

  • 91 వేల ఎకరాలకు సాగునీరు
  • ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు
  • ఉక్కు పరిశ్రమకు నీటి కేటాయింపులు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు