logo

నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ

సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 08 May 2024 06:08 IST

భారీ ఏర్పాట్లలో కూటమి నేతలు
హాజరు కానున్న నారా లోకేశ్‌, నాయకులు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కలికిరి గ్రామీణ : సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు పుంగనూరు నియోజకవర్గాలతో పాటు జిల్లా సమీపంలోని తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి జనసమీకరణకు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో కలికిరికి ప్రధాని చేరుకుంటారు. మోదీ ప్రయాణించే హెలికాప్టర్‌తో పాటు మరో రెండు రక్షణగా రానున్నాయి. ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. బహిరంగసభకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపునకు భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని మోదీ సభ ద్వారా ప్రజల్లో మరింత ఆదరణ తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సభావేదిక నిర్మాణం, హాజరయ్యే జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా చర్యల్లో భాగంగా 3 వేల మంది పోలీసులు కలికిరికి తరలివచ్చారు. ఎస్‌పీజీ అధికారులు సభ, హెలిప్యాడ్‌ ప్రాంగణాలను మంగళవారం పరిశీలించారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. భారీ రక్షణ మధ్య సభ జరగనుంది. ఏర్పాట్లను నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు, కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడలో బుధవారం జరిగే పర్యటనలో ప్రధాని మోదీతో పాటు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాల్గొననున్నారు. దీంతో కలికిరి సభలో ఇద్దరు అధినేతలు పాల్గొనలేక పోతున్నారు. తెదేపా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అగ్రనేత నాగబాబు హాజరవుతున్నారు. విజయవాడలో సాయంత్రం 6 గంటల నుంచి భారీ రోడ్‌షో జరగనుంది. మోదీతో పాటు చంద్రబాబు, పవన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు తెదేపా, జనసేనపార్టీ నేతలకు అధికారిక సమాచారం అందింది.


అడుగడుగునా పోలీసులు

ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎస్పీజీ అడిషినల్‌ ఐజీ కృష్ణప్రసాద్‌యాదవ్‌, డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణారావు, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పర్యటనను విజయంతం చేయాలని ఆదేశించారు. ఐజీ, అడిషినల్‌ ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో 15 మంది ఎస్పీలు, 20 మంది అడిషినల్‌ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు, 100 మంది సీఐలు, 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కలికిరికి చేరుకున్న పోలీసులకు అధికారులు విధులను కేటాయించారు.


ట్రాఫిక్‌ మళ్లింపు : కలికిరి నుంచి నగరిపల్లె-సీఆర్‌పీఎఫ్‌కు వెళ్లే మార్గం వద్ద ప్రధాని బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను కలికిరి-కలకడ మార్గంలోని పాళెంకురవపల్లె బస్టాపు నుంచి లోపలికి అనుమతించనున్నారు. పుంగనూరు, పీలేరుల నుంచి వచ్చే వాహన శ్రేణులను నగరిపల్లె సర్కిల్‌ మీదుగా మళ్లించనున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను క్రాస్‌ నుంచి బైపాస్‌ సర్కిల్‌ మీదుగా అనుమతించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని