logo

కేంద్రం పాఠ్యాంశంగా చేర్చితే... రాష్ట్రం రోడ్డు వేయలే

అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి.

Published : 09 May 2024 04:58 IST

దేశంలోనే రెండో అతిపెద్ద ఆదిమానవుడి ఆనవాళ్లు
పర్యాటకం దిశగా అభివృద్ధికి దూరం

ఎర్రమల కొండపైకి చేరుకునేందుకు అధ్వానంగా ఉన్న రహదారి

న్యూస్‌టుడే, కొండాపురం: అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి. దక్షిణ భారతదేశంలో శిలాయుగ విశిష్ట లక్షణాలుగా ఇవి పేరుప్రఖ్యాతులు సాధించాయి. ఇంతటి చరిత్ర కల్గిన ప్రదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఉన్నా నేటీకీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి వైపు అడుగులు పడకపోవడం గమనార్హం. ఎర్రమల కొండల్లో ఉన్న ఈ శిలాచిత్రలేఖనాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఎర్రమల కొండపైనే కోనలింగేశ్వరాలయం, పక్కనే బ్రిటీషు కాలంనాటి చెరువుతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ మొత్తం 15 శిలాశ్రయాలు ఉండగా, వీటిల్లో పదింటిపై రేఖాచిత్రాలు కనిపిస్తాయి. వీటిని ఎద్దుల ఆవుల, గొడుగు, మబ్బు, పెద్దావిడ, చిన్నావిడ, మారెమ్మ, పిడుగు, పడగ, ధనం, సన్యాసం, వనం, చిలకల, చెంబు, కలం గుండ్లుగా స్థానికులు పిలుచుకుంటారు. ఇవి ఎండ, వానకు ప్రజలు తలదాచుకునేందుకు వీలుగా ఉన్నాయి. ఈ శిలాశ్రయాలపై ఎరుపు, తెలుగు రంగుల్లో జింక, దుప్పి, మూపరం ఎద్దులు, ఏనుగులు, నక్క, కుందేలు, హైనా, సర్పాలు, పక్షులు, రేఖాంశరూపాలు, మానవాకృతులు ఉన్నాయి. విల్లులు పట్టుకున్న ఏనుగు మీద ఎక్కిన, ఒకరికొకరు ఎదురుగా ఉన్న మానవాకృతులు మనకు కనిపిస్తాయి.

సందర్శకులకు దారేదీ..?

దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శిలాచిత్రలేఖనాల స్థావరంగా పేరొందిన చింతకుంట అభివృద్ధికి మాత్రం నోచుకోవట్లేదు. వేల ఏళ్ల కిందట అపురూప సంపద ఇక్కడ ఉన్నా దాన్ని పాలకుల అశ్రద్ధ వల్ల సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు అక్కడికి చేరుకోవడానికి సరైన రహదారి కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేశానికే తలమానికమైన శిలాచిత్రాలు జిల్లాలోనే ఉన్నా..జిల్లావాసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ల నుంచి పాలన చేస్తున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు.

ఆరో తరగతిలో పాఠం..

చింతకుంట రేఖాచిత్రాలపై 2013లో ఆరో తరగతి సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో ప్రచురించారు. చిన్నారులు ఆదిమానవుని రేఖాచిత్రాలను చదువుకుంటున్నారు కానీ.. వాటినీ చూడడానికి వెళ్లలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎంతో ప్రాముఖ్యత కల్గిన ఈ ప్రాంతాన్ని సీఎం జగన్‌ అభివృద్ది చేయకపోవడం ఏమిటని జిల్లా పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా తర్వాత దేశంలో రెండో అతిపెద్ద శిలాచిత్ర లేఖనాలున్న ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.

సొంత జిల్లా అయిన సీఎంకు శ్రద్ధ లేదు

ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం ఈ ప్రాôతం అభివృద్ధి చెందలేదు. సీఎం సొంత జిల్లాలో దేశంలోనే అతిపెద్ద శిల్ప చిత్రలేఖనాలు ఉన్నా వాటిని చూడడానికి పర్యాటకులకు కనీసం దారి లేదు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. అక్కడి వెళ్లడానికి కనీసం దారికూడా సరిగాలేదు. కొండల్లో రేఖాచిత్రాలు ఉన్న ప్రదేశంకు సరైన దారిలేక పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

నాగిరెడ్డి, చింతకుంట గ్రామం.

రక్షిత ప్రదేశంగా ప్రకటించాలి

ఆదిమానవుడు గీసిన చిత్రాలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. దేశంలోనే గుర్తింపు పొందిన చింతకుంట చిత్రాలు ఆంధ్రప్రదేశ్‌కే కీర్తి. అలాంటి ప్రదేశం సీఎం జగన్‌ సొంత జిల్లాలో ఉన్నా నేడు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రానున్న తరాలు నాటి చరితను తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. 

ఆదినారాయణరెడ్డి, చింతకుంట గ్రామం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు