logo

నమో నమామి... నమో నమామి... మురిసిన కూటమి

కలికిరిలోని ప్రజాగళం ప్రాంగణం మూడు పార్టీల కలయికతో త్రివేణి సంగమంలా మారింది... బుధవారం జరిగిన సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవగా తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి దళం కదం తొక్కింది.

Published : 09 May 2024 05:06 IST

కలికిరిలో ప్రజాగళం సభ విజయవంతం

జై శ్రీరామ్‌ : ప్రధాని మోదీకి శ్రీరాముని ప్రతిమను అందజేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

కలికిరిలోని ప్రజాగళం ప్రాంగణం మూడు పార్టీల కలయికతో త్రివేణి సంగమంలా మారింది... బుధవారం జరిగిన సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవగా తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు... మరోవైపు తెలుగు తమ్ముళ్లు... ఇంకోవైపు జన సైనికులు.. ఎటుచూసినా జనమే జనం. ప్రధాని మోదీ.... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన నాయకుడు నాగబాబు తమ ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. నల్లారి సోదరుల ప్రసంగం కార్యకర్తల కేరింతల మధ్య సాగింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో రెట్టింపు సంక్షేమం సాధ్యమని వివరించారు. అభివృద్ధిలో జీరో... అవినీతి వంద శాతం అంటూ వైకాపా పాలన తీరును యువనేత లోకేశ్‌ ఎండగట్టారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాల పరిధి నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆయా కార్యక్రమాల చిత్రమాలిక ఇది.

న్యూస్‌టుడే, అన్నమయ్య బృందం

ఆ చట్టంతో కుటుంబ కలహాలు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం కుటుంబాల మధ్య కలహాలకు దారితీస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలు లేవు. సాధారణంగా మహిళలకు పసుపు కుంకుమ కింద భూములను ఇస్తుంటారు. అయితే అవి రిజిస్టర్‌ కావు. ఇప్పుడు వారికి హక్కు లేదని పేర్కొంటూ కుమారుడి పేరుతో రాసిస్తే కుటుంబాల్లో ఘర్షణ ఏర్పడుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి.

దగ్గుమళ్ల ప్రసాదరావు,చిత్తూరు తెదేపా ఎంపీ అభ్యర్థి

సభలో యువత కేరింతలు

మిథున్‌రెడ్డిని ఫ్లోర్‌ లీడర్‌ చేయాలనే ...

12 ఏళ్లుగా వైకాపాలో ఉన్నా జగన్‌ అన్యాయం చేశాడు. కష్టకాలంలో జగన్‌కు మద్దతు ఇచ్చినా నాకు ఇచ్చిన మాట తప్పాడు. వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డిని ఫ్లోర్‌ లీడర్‌ను చేసేందుకే నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పంపించాడు. ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్తున్నందునే దళితుడు ఎదగకూడదన్న ఉద్దేశంతో జగన్‌, మిథున్‌రెడ్డి, సాయిరెడ్డిలు నన్ను పక్కనబెట్టారు. వైకాపా ఒక ట్రూప్‌ పార్టీ.

వరప్రసాదరావు, తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి

తరలివస్తున్న ప్రజానీకం

అందరికీ రుణపడి ఉంటా

2019లో ఓటమి నుంచి వైకాపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ అండగా నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. కలికిరిలో లోకేశ్‌ నిర్వహించిన యువగళం పాదయాత్రకు భారీగా స్పందన లభించింది. రాష్ట్రానికి చంద్రబాబు తప్ప మరొకరు సీఎం అయ్యే మార్గం లేదు.

కిశోర్‌కుమార్‌రెడ్డి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి

వెనకబడిన ప్రాంతం కాదు నెట్టబడింది...

తంబళ్లపల్లె వెనుకబడిన ప్రాంతం కాదు నెట్టబడింది. దుర్మార్గులు వచ్చి నియోజకవర్గాన్ని నాశనం చేశారు. పెద్దిరెడ్డి నూకలు చెల్లిపోయాయి. అంగళ్ల ఘటనలో కిశోర్‌కుమార్‌రెడ్డికి చెందిన అనుచరులపై కేసులు పెట్టారు. తంబళ్లపల్లెకు చెందిన 70 మంది రైతులు, యువకులపై అక్రమ కేసులు బనాయించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అరాచకాలు తగ్గుతాయి. ఆయన వస్తే యువతకు 20 లక్షల ఉపాధి కల్పనే కూటమి లక్ష్యం.

జయచంద్రారెడ్డి, తెదేపా తంబళ్లపల్లె అభ్యర్థి

ఎవరికీ రక్షణ లేదు హరిప్రసాద్‌, జనసేన పీఏసీ సభ్యుడు

రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. మద్యనిషేధం పక్కనబెట్టారు. జగన్‌ను ఓడించడం కూటమితోనే సాధ్యం. రాష్ట్రంలోని ప్రజలను గెలిపించేందుకు కూటమితో జతకట్టాం. నాడు శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల కోసం పవన్‌ ఆందోళన చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని అగ్రగామిగా మోదీ నిలబెట్టారు. దేశంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా సీఎంగా గెలిచి అధికారం చేపడతారు.

ఇది కురుక్షేత్ర సంగ్రామం

ఇది కురుక్షేత సంగ్రామం. ఇది అవినీతి ప్రభుత్వం. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న యుద్ధం. 2019 కంటే ముందున్న ఆయకట్టు కంటే అదనంగా ఒక్క ఎకరాకు వైకాపా ప్రభుత్వం నీరివ్వలేదు. నాడు డ్రిప్‌ కింద 90 శాతం సబ్సిడీ ఇస్తే ఇప్పుడు లేదు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. బీమా రాకుండా చేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి.

రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ

వెబ్‌క్యాస్టింగ్‌పై తప్పుడు ప్రచారం

వెబ్‌క్యాస్టింగ్‌పై వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఓటేసే విషయం మీకు, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశాడు. నాడు చంద్రబాబు రోడ్లు వేస్తే నేడు గుంతలు కనిపిస్తున్నాయి.

సుధీర్‌రెడ్డి, తెదేపా శ్రీకాళహస్తి అభ్యర్థి

జగన్‌ను రాష్ట్రం నుంచి పంపించేయాలి

జగన్‌ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైంది. అరాచకాలు, భూకబ్జాలు పెరిగాయి. జగన్‌ను రాష్ట్రం నుంచి పంపించేయాలి. చంద్రబాబు నాయకత్వం రావాలి. మైనార్టీ ఓట్ల కోసం జగన్‌ పార్లమెంటులో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. దొంగ దండాలు... మాయ మాటలతో ప్రజలను మోసం చేశాడు.

చల్లా బాబు, తెదేపా పుంగనూరు అభ్యర్థి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

నాలుగు దశాబ్దాల తర్వాత ప్రధాన మంత్రి ఇక్కడికి అడుగుపెట్టారు. రాష్ట్రంలో కూటమి నేతలను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం.

సాయి లోకేష్‌, భాజపా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు

ఇద్దరు సీఎంలు చరితార్థులు

రాయలసీమలోని జీఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టుల్లో తట్టమట్టి ఎత్తలేదు. ఇసుకను అక్రమంగా బకాసురిడిగా మింగేయడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 60 రోజుల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నా పూర్తి చేయలేదు. సొంత జిల్లా ప్రజలనూ జగన్‌ ఆదుకోలేదు.

రమేష్‌నాయుడు, భాజపా రాష్ట్ర కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని