logo

కూటమితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా

అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా కోరారు.

Published : 10 May 2024 03:34 IST

వైకాపా మాయమాటలు నమ్మొద్దు

మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా, వేదికపై మైనార్టీ నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా కోరారు. గురువారం మదనపల్లె పట్టణం బుగ్గకాలువలోని ఓ ప్రైవేటు కల్యాణ మండలంలో తెదేపా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా మాట్లాడుతూ... అయిదు సంవత్సరాలుగా గుర్తుకు రాని ముస్లింలు నేడు హఠాత్తుగా వైకాపా నాయకులకు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాంకు భూమిని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుటుంబం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సోషల్‌ మీడియా ద్వారా విన్నవించారని తెలిపారు. చివరకు వైకాపా నాయకులు దౌర్జన్యాలను భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి అమ్మాయి మిస్బా తరగతిలో మొదటి ర్యాంకు మార్కులు తెచ్చుకుంటుంటే జీర్ణించుకోలేని స్థానిక వైకాపా నాయకుడు విద్యార్థిని తల్లిదండ్రులను వేధించేవాడని తెలిపారు. ఆయన కుతూరుకు మొదటి ర్యాంకు వచ్చే విధంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చేవారని, ఈ నేపథ్యంలో మిస్బా మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందన్నారు. మదనపల్లెలోని టిప్పుసుల్తాన్‌ మైదానంలో పేద ముస్లింలకు షెడ్లు వేసుకుంటే వాటిని కూలదోయించి వైకాపా నాయకులు క్రూరత్వాన్ని చాటుకున్నారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు రాష్ట్రంలో అనేకమున్నాయని ముస్లిం మైనార్టీలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకుని వైకాపాను ఇంటికి సాగనంపాలని కోరారు. ఎన్‌ఆర్సీ, సీఏఏపై ముస్లిం మైనార్టీల్లో అలజడి సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఎన్‌ఆర్‌ర్సీ, సీఏఏ బిల్లులపై ముందుగానే ఎంపీ మిథున్‌రెడ్డి ఎందుకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వంలో అమలు చేసిన విదేశీ విద్య, దుల్హన్‌, రంజాన్‌తోఫా, దుకాణ్‌ ఔర్‌ మకాన్‌ పథకాలను జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. అయిదు రోజులు తనకోసం పనిచేస్తే, 5 సంవత్సరాలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముస్లిం మైనార్టీ పెద్దలు మహమ్మద్‌ జలాలుద్దీన్‌, ఖాసీం రఫీ, బషీర్‌ మౌలానా, నిస్సార్‌, ముబారక్‌, అబ్దుల్లా, మౌలానా జబ్బార్‌, సల్మాన్‌, తెదేపా మైనార్టీ నాయకులు ఎస్‌.ఎ.మస్తాన్‌, ఎస్‌.ఎం.రఫి, దాదాపీర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని