logo

బిల్లుల్లేవ్‌.. భోజనాలు ఎలా?

జిల్లాలో డీఎంఈ, ఏపీ వైద్యవిధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బోధన, జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో భోజన బిల్లులు రూ.లక్షల్లో పెండింగ్‌ పడ్డాయి. గుత్తేదారులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

Published : 08 Dec 2021 04:54 IST

ఈనాడు-అమరావతి: జిల్లాలో డీఎంఈ, ఏపీ వైద్యవిధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బోధన, జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో భోజన బిల్లులు రూ.లక్షల్లో పెండింగ్‌ పడ్డాయి. గుత్తేదారులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవటంతో రోగులకు నాణ్యమైన భోజనం అందటం లేదు. యంత్రాంగం సైతం మంచి ఆహారం సరఫరా చేయాలని గట్టిగా చెప్పలేకపోతోంది. అధికారులు మాత్రం బిల్లులు చెల్లించటానికి సరిపడా బడ్జెట్‌ ఉందని చెబుతున్నారు. జిల్లా నుంచి బిల్లులు నిర్ధారించి సీఎఫ్‌ఎంఎస్‌కు పంపినా అక్కడ నెలలు తరబడి పెండింగ్‌ పడుతున్నాయి. గుంటూరు బోధనాసుపత్రిలో సగటున రోజుకు 1400 నుంచి 1500 మంది భోజనం తింటారు. ఒక్క జీజీహెచ్‌లోనే గుత్తేదారుకు చెల్లింపులు చేయాల్సిన నగదు రూ.కోట్లలో ఉంటుందని ఆసుపత్రివర్గాలు అంటున్నాయి. ఆసుపత్రుల్లో భోజనం పెట్టే కాంట్రాక్టును జిల్లాలో సాధ్యమైనంత వరకు పాత గుత్తేదారులే దక్కించుకుంటున్నారు. దీంతో వారికి బిల్లులు బకాయిపడినా  అప్పోసొప్పో చేసి రోగులకు ఇబ్బంది లేకుండా భోజనం సమకూర్చుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌, తెనాలి జిల్లా ఆసుపత్రి సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలల్లో ఉండే రోగులకు డైట్‌ కాంట్రాక్టర్‌ ద్వారా భోజనం పెడుతున్నారు. ఆసుపత్రుల్లో ఉండే ఇన్‌పేషెంట్లతో పాటు వారి తరపున ఉండే సహాయకులు ఒకరికి ప్రభుత్వమే ఉచితంగా భోజనం అందజేస్తుంది. గర్భిణులు, బాలింతలకు ప్రొటీన్‌ డైట్‌ అందిస్తారు. సాధారణ రోగులకు సాధారణ భోజనం పెడతారు. వీటికి వేర్వేరుగా ధరలు ఉన్నాయి. ఆ ప్రకారం బిల్లులు తయారుచేపి ఎప్పటికప్పుడు పంపుతున్నా సీఎఫ్‌ఎంఎస్‌లో క్లియర్‌ కావటం లేదని తెలుస్తోంది. ఏ ఒక్కచోట బిల్లులు చెల్లించని కారణంగా భోజనం నిలిపివేసిన దాఖలాలు లేవని వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త హనుమంతరావు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని