ప్రత్యేక పథకం.. ప్రగతి పథం
జిల్లాకు రూ.2.2కోట్లు
యాబాజిగూడలో పూర్తయిన సీసీ రోడ్డు
న్యూస్‌టుడే, పరిగి, పరిగి గ్రామీణ: పల్లెల పురోగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. వీటితో గ్రామాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు కాలినడకన నడవాలంటేనే అడుగు లోతు బురద ఉండేది. అంతకుమించి ఆయా గ్రామాలకు పిల్లను ఇవ్వాలంటేనే వద్దు బాబోయ్ అంటూ వెనక్కి వెళ్లేది. ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద నేరుగా నిధులు అందజేస్తుండగా కేంద్రం కూడా మరొకొన్ని సమకూర్చుతోంది. తద్వారా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయడంతో ఇళ్ల మధ్య చెత్తకుప్పలు, పాత ఇళ్లు, గుంతల పూడ్చివేత, పొదల తొలగింపు, పారిశుద్ధ్యం తదితర పనులు బాగానే జరిగాయి. దీంతో గ్రామాల పరిసరాలు పరిశుభ్రంగా మారాయి.
ఏటా రూ.20 లక్షలు: వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలు 566 పంచాయతీలు ఉండగా 9.27లక్షల జనాభా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 1,79,730 మంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం అమల్లో ఉన్నట్లు గుర్తించిన అప్పటి కలెక్టర్ అయేషా చొరవతో జిల్లా వ్యాప్తంగా పదకొండు పంచాయతీలు ఎంపికయ్యాయి. ప్రతి పంచాయతీకి ఈ పథకం ద్వారా ఏటా రూ.20 లక్షల చొప్పున మూడేళ్ల పాటు అందనున్నాయి. తొలి విడత పూర్తికాగా, రెండో విడత మంజూరు కావాల్సి ఉంది. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న వాటిని తీసుకుని ఆదర్శంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టారు. ఇవి కొన్ని చోట్ల పూర్తయ్యాయి. ముందుగానే పంచాయతీల్లో నేరుగా నిధులు జమచేయడంతో సర్పంచులపై ఆర్థిక భారం పడకుండా మారింది.
భూగర్భ డ్రైనేజీ పనులు
అభివృద్ధి పనుల జోరు: పరిగి మండలం యాబాజిగూడ, మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి, గోవిందాపూర్, బషీరాబాద్ మండలం అల్లాపూర్, మారేపల్లి, పూడూరు మండలం గట్టుపల్లి, పెద్దేముల్ మండలం హన్మాపూర్, కోట్‌పల్లి మండలం ఓగులాపూర్, మర్పల్లి మండలం తిమ్మాపూర్, బంట్వారం మండలం సల్బత్తాపూర్, దౌల్తాబాద్ మండలం కుప్పగిరి పంచాయతీలు ఎంపికయ్యాయి. ఆయా గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం తదితర ప్రధానంగా అవసరమయ్యే పనులను అధికారులు ప్రతిపాదించారు. పల్లెలకు ఏక మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఆయా గ్రామాల్లోని సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నమూనాగా నిలవాలని..: ప్రవీణ్, సర్పంచి, యాబాజిగూడ
నూతనంగా ఏర్పడిన పంచాయతీ మాది. కేవలం 889 మంది జనాభా ఉండటంతో పంచాయతీకి అందే నిధులు కూడా తక్కువే. దీంతో అభివృద్ధి ఆశించిన మేరకు జరగదని భావిస్తున్న తరుణంలో ప్రత్యేక నిధులకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. మొదటి విడత వచ్చిన రూ.20 లక్షల్లో రూ.18లక్షలతో సిమెంటు రోడ్డు, రెండో విడత మంజూరవుతాయన్న ఉద్దేశంతో రూ.8లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేశాం. వచ్చే నిధులతో గ్రామ సభలో తీర్మానం మేరకు ఇతర పనులు పూర్తిచేసి ఆదర్శంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.