Published : 23 Jun 2022 00:56 IST

పెచ్చరిల్లుతున్న సైబర్‌ ఉగ్రవాదం

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ప్రసిద్ధి చెందిన ఇండియా సైబర్‌ నేర ముఠాలకు అభయారణ్యంగా దిగజారడం జాతికే తలవంపులు కాదా? ఇది, డిజిటల్‌ శకంలో అంతర్జాల ఉగ్రవాద మహోద్ధృతి లేవనెత్తుతున్న సూటిప్రశ్న! సైబర్‌ భద్రత లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించిన గణాంకాలు- దేశంలో కేటుగాళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయిన దుస్థితిని చాటుతున్నాయి. 2012 సంవత్సరంలో 3377 సైబర్‌ నేరాలు నమోదైన భారత్‌లో వాటి సంఖ్య ఎనిమిదేళ్ల వ్యవధిలోనే 50వేలకు ఎగబాకింది. మూడేళ్ల క్రితం ప్రారంభించిన సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌ పోర్టల్‌కు 11లక్షల దాకా ఫిర్యాదులు వచ్చి పడ్డాయని అమాత్యులే చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖే పార్లమెంటుకు నిరుడు వెల్లడించిన వివరాల ప్రకారం, కొవిడ్‌ మహా సంక్షోభం మాటున దేశవ్యాప్తంగా సైబర్‌ దాడులు పదకొండున్నర లక్షలకు పైబడ్డాయి. సంవత్సర కాలంలో ఇండియాలోని 52శాతం సంస్థలు సైబర్‌ దాడులకు గురయ్యాయని, విశ్వవ్యాప్తంగా 35 కోట్లమంది ఆన్‌లైన్‌ బాధితుల్లో 13 కోట్లమంది భారతీయులేనని భిన్న అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలో ప్రస్తుతం 80 కోట్లమంది వరకు అంతర్జాల వినియోగదారులున్నారు. 2025నాటికి వారి సంఖ్య 120 కోట్లకు చేరనుందని అంచనా. నెట్‌ వాడకంతోపాటు ఇంతలంతలవుతున్న సైబర్‌ దాడులకు మూలాలు అమెరికా, ఐరోపా, బ్రెజిల్‌, తుర్కియే, చైనా, పాక్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయన్న కథనాలు లోగడే వెలుగు చూశాయి. కొన్ని దేశాలు పనికట్టుకుని సైబర్‌ దాడులకు పాల్పడుతున్న వేళ, వాటిని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు హోంమంత్రి చెబుతున్నా- ఫిర్యాదుల వెల్లువ వ్యవస్థాగత అలసత్వాన్నే చాటుతోంది. జాతీయ భద్రతలో సైబర్‌ రక్షణ అంతర్భాగమైతేనే, ‘డిజిటల్‌ ఇండియా’ సాకారమవుతుంది.

స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాలం, కంప్యూటర్లే ఇప్పుడు సైబరాసురుల నయా దోపిడి సాధనాలవుతున్నాయి. రుణ పందేరాలు, ఖరీదైన బహుమతుల పేరిట నేరగాళ్లు విసిరే మాయవలల్లో అమాయకులెందరో చిక్కుకుంటున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. క్రెడిట్‌ కార్డు సమాచారం, బ్యాంకు ఖాతాలు, బీమా వివరాలు తదితరాల్ని తస్కరించే ఫిషింగ్‌ బాగోతాల బారిన పడిన బాధితులు భారీయెత్తున నష్టపోతున్నారు. వ్యక్తులే కాదు- సైబర్‌ ఉగ్రవాదానికి వ్యవస్థలూ చిత్తవుతున్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌)తో పాటు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ విభాగం నుంచి సమాచారం నిరుడు తస్కరణకు గురైంది. కొంతమంది ఎకాయెకి బ్యాంకుల సర్వర్లలోకి చొరబడి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం- సైబర్‌ చోరుల దూకుడును చాటుతోంది. కొవిడ్‌ ప్రజ్వలనం దరిమిలా సైబర్‌ నేరాల ఉద్ధృతి అయిదింతలైందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ మదింపు వేశారు. ఆన్‌లైన్‌ అకృత్యాలు పెచ్చరిల్లుతున్న ఆరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉన్నాయని జాతీయ నేర గణాంకాల సంస్థ ధ్రువీకరించిన రెండేళ్ల తరవాతా, పరిస్థితి పెద్దగా మెరుగుపడనేలేదు. దేశంలో సైబర్‌ నేరాలపై ఫిర్యాదులతో పోలిస్తే, కేసుల నమోదు శాతం తక్కువే. అందులోనూ 90శాతానికి పైగా కేసులు వీగిపోతున్న దురవస్థ బాధితుల్ని కుంగదీస్తోంది. సైబర్‌ భద్రతలో భారత్‌కన్నా అమెరికా, సౌదీ అరేబియా, ఎస్తోనియా, దక్షిణ కొరియా, సింగపూర్‌, స్పెయిన్‌ వంటివి ఎంతో మెరుగ్గా రాణిస్తున్నాయి. ఇక్కడ సైబర్‌ దాడుల విశ్లేషణ విభాగం, సమన్వయ బృందం, శిక్షణ కేంద్రం తదితరాలను కొలువుతీర్చినా- రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమన్వయ రాహిత్యం చోర బృందాలకు అయాచిత వరమవుతోంది. ఫలానా సెక్షన్ల ప్రకారం ఫిషింగ్‌, ఆన్‌లైన్‌ వేధింపులు వంటివి శిక్షార్హాలంటూ కొలువుతీర్చిన చట్టాలు అసంఖ్యాక బాధితుల్లో ధీమా కలిగించలేక పోతున్నాయి. సైబర్‌ ముష్కరులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో కఠిన శిక్షలు విధించి అమలుపరచడం ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం. దిగ్భ్రాంతకర దోపిడి ఘట్టాలు పునరావృతం కాకుండా సుశిక్షిత సైబర్‌ సైన్యాన్ని రూపొందించి కదం తొక్కించడమెంత కీలకమో... ఆన్‌లైన్‌ జాగ్రత్తలపై జనచేతన పెంపొందించడం అంతే ముఖ్యం!

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని