భద్రతకోసం ఆత్మనిర్భరత

స్థానిక తయారీదారుల నుంచి సైనిక సామగ్రి సమీకరణకు బడ్జెట్‌లో పెద్దమొత్తాన్ని కేంద్రం ప్రత్యేకిస్తోంది. అంకుర సంస్థలు, చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యంతో నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రక్షణ రంగంలో స్వావలంబనకు మోదీ సర్కారు ప్రణాళికాబద్ధంగా

Published : 01 Sep 2022 03:07 IST

స్థానిక తయారీదారుల నుంచి సైనిక సామగ్రి సమీకరణకు బడ్జెట్‌లో పెద్దమొత్తాన్ని కేంద్రం ప్రత్యేకిస్తోంది. అంకుర సంస్థలు, చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యంతో నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రక్షణ రంగంలో స్వావలంబనకు మోదీ సర్కారు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోంది. అందులో భాగంగా- డీపీఎస్‌యూలు (రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు) కొన్నేళ్లుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 2958 వస్తువులను ఇకపై దేశీయంగానే అభివృద్ధి పరచేందుకు ఇటీవల సంకల్ప దీక్ష వహించింది. తాజాగా మరో 780 ఉపకరణాల దిగుమతిని నిషేధించే ప్రతిపాదనకు రక్షణ శాఖామాత్యులు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదముద్ర వేశారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సబ్‌మెరైన్లు, ట్యాంకులకు సంబంధించిన విడిభాగాలు, ఉపవ్యవస్థలు ఆ జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తేలికపాటి ట్యాంకులు, క్షిపణులు, మల్టీ బారెల్‌ రాకెట్‌ లాంచర్ల వంటి 310 ఆయుధాలు, భద్రతా పరికరాల దిగుమతిపైనా దశల వారీ నిషేధాన్ని ప్రభుత్వం లోగడ ప్రకటించింది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం... 2012-16 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్త ఆయుధ దిగుమతుల్లో ఇండియా వాటా దాదాపు 14శాతం. 2017-21 నడుమ అది 11శాతానికి తగ్గిపోయింది. గడచిన మూడు దశాబ్దాల్లో తొలిసారి అలా దిగుమతుల పద్దులో తరుగుదల నమోదైంది. అది సంతోషకరమే కానీ, ఆయుధాలకోసం పరాయివారిపై అమితంగా ఆధారపడుతున్న దేశాల్లో నేటికీ ఇండియాదే ప్రథమ స్థానం! స్వీయ రక్షణ పాటవాన్ని పెంపొందించుకోవాలంటే- ఆయుధోత్పత్తిలో పూర్తిస్థాయిలో స్వయంసమృద్ధి సాధించాలి. ఆ మేరకు ఆత్మనిర్భరతా ప్రణాళికల అమలును మరింతగా చురుకెత్తించడంపై కేంద్రం దృష్టి సారించాలి!

ఆయుధాల దిగుమతులపై 2000-2020 మధ్యలో భారతదేశం వెచ్చించిన మొత్తం... 5385 కోట్ల డాలర్లు. అందులో 65శాతానికి పైగా సొమ్ములు ఒక్క రష్యా జేబులోకే వెళ్ళాయి. భారత్‌కు ఎగుమతుల ద్వారా అమెరికా, ఫ్రాన్స్‌లూ భారీగానే ఆర్జిస్తున్నాయి. సుమారు తొంభై లక్షల జనాభా మాత్రమే కలిగిన ఇజ్రాయెల్‌ కూడా 2000-2010 మధ్యలో ఇండియాకు అస్త్రశస్త్రాల అమ్మకాలతో దాదాపు వెయ్యి కోట్ల డాలర్లను వెనకేసుకొంది. 2015 తరవాత నాలుగేళ్లలో అక్కడి నుంచి ఇక్కడకు ఆయుధాల సరఫరా 175శాతం ఎగబాకింది. ఉన్నత స్థాయి రక్షణ వ్యవస్థల కోసం విదేశాల వైపు చూసే దుస్థితి తప్పిపోవాలంటే- డీపీఎస్‌యూలు, ఆయుధ కర్మాగారాలకు కేటాయింపులు పెంచి, వాటిని నవీకరించాలి. ప్రైవేటు సంస్థలకు సహేతుక ప్రోత్సాహకాలు కల్పించాలి.  దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల విలువను రాబోయే అయిదేళ్లలో 2500 కోట్ల డాలర్లకు చేర్చాలన్న సర్కారీ ఆశయం అప్పుడే నెరవేరుతుంది. మరోవైపు... 2014 తరవాత భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఆరు రెట్లు అధికమయ్యాయి. కానీ, జనసంఖ్య పరంగా ఇండియా దారిదాపుల్లో లేని జర్మనీ, ఇటలీ, టర్కీ, నార్వే, యూకే, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికా, స్వీడన్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, బెలారస్‌ వంటివి ప్రపంచ ఆయుధ విపణిలో మనకంటే ఎక్కువ వాటాను చేజిక్కించుకుంటున్నాయి. 2025 నాటికి 500 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలన్న లక్ష్యం సిద్ధించాలంటే- భద్రతా ఉపకరణాల తయారీలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, మిగిలిన వారితో పోలిస్తే చవకైన ధరలకు వాటిని అందించగలగాలి. ప్రభుత్వ రంగ సంస్థల పనిసంస్కృతిని సంస్కరిస్తూ, కళాశాల స్థాయినుంచే నిపుణ మానవ వనరులను తీర్చిదిద్దుకోగలిగితేనే- దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదకరమైన రక్షణ రంగ పరాధీనతనుంచి బయటపడగలం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.