దూరమవుతున్న జలసిరి

యమునా నది పరీవాహక ప్రాంత సాగుభూములు, వాటిలో పండుతున్న కూరగాయలపై భారతీయ ఇంధన వనరుల సంస్థ (టెరి) లోగడ రెండేళ్ల పాటు ఒక అధ్యయనం చేసింది. ఆయా వ్యవసాయ నేలలు, కాయగూరల్లో ..

Published : 26 Sep 2022 00:58 IST

మునా నది పరీవాహక ప్రాంత సాగుభూములు, వాటిలో పండుతున్న కూరగాయలపై భారతీయ ఇంధన వనరుల సంస్థ (టెరి) లోగడ రెండేళ్ల పాటు ఒక అధ్యయనం చేసింది. ఆయా వ్యవసాయ నేలలు, కాయగూరల్లో భారలోహాల అవశేషాలు పెద్దయెత్తున పోగుపడినట్లు గుర్తించింది. అక్కడి మహిళలు, పిల్లల రక్త, మూత్ర నమూనాలను పరీక్షిస్తే- వాటిలో క్రోమియం, సీసం, పాదరసాల ఉనికి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఆందోళనకరమైన ఈ పరిస్థితికి ప్రథమ కారణం- వ్యర్థజలాలను యమునలోకి యథేచ్ఛగా విడిచిపెడుతుండటమేనని ‘టెరి’ నివేదిక నిగ్గుతేల్చింది. తెలుగు రాష్ట్రాలకు వరదాయినులైన గోదావరి, కృష్ణాలతో పాటు దేశవ్యాప్తంగా సగానికి పైగా నదులు అలాగే కలుషితాలతో నిండిపోతున్నాయి. పట్టణ ప్రాంత మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో అవి విష వాహినులవుతున్నాయి. వాటిలోంచి పొలాల్లోకి పారుతున్న నీళ్లు... తద్వారా భూమిలోకి ఇంకుతున్న ప్రమాదకర రసాయనాలు ఆహార పదార్థాల ద్వారా అంతిమంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. అలా జల కాలుష్యం ప్రజారోగ్యానికి ప్రాణాంతకమవుతున్నా- మురుగునీటి శుద్ధిలో దేశం ఇంకా వెనకబడటమే తీవ్రంగా కలవరపరుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 7236 కోట్ల లీటర్ల వ్యర్థజలాలు వెల్లువెత్తుతుంటే- వాటిలో 28శాతమే శుద్ధికి నోచుకుంటున్నట్లు ‘నీతిఆయోగ్‌’ ఇటీవల లెక్కగట్టింది. 1971 తరవాత పట్టణభారత జనాభా మూడింతలైంది. పర్యవసానంగా మురుగునీటి ఉత్పత్తి పది రెట్లకు పైగా ఎగబాకింది. అందుకు తగినట్లుగా శుద్ధి కేంద్రాల ఏర్పాటు మాత్రం నేటికీ చురుకందుకోలేదు. దానికితోడు కాలుష్య నియంత్రణ మండళ్ల నిష్క్రియాపరత్వమూ స్థానికంగా జలవనరుల జీవకళను హరించేస్తోంది!

నదులు, చెరువుల్లో పారిశ్రామిక వ్యర్థాల పారబోతపై అయిదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రాథమిక శుద్ధి కేంద్రాలను (పీఈటీపీ) సక్రమంగా నిర్వహించని పరిశ్రమలను మూసేయించాలని కాలుష్య నియంత్రణ మండళ్ల(పీసీబీల)ను ఆదేశించింది. స్వచ్ఛమైన నీటిని పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం నిరుడు స్పష్టీకరించింది. కానీ, ఘన ద్రవ వ్యర్థాలతో జలవనరులు కునారిల్లుతున్నా- పీసీబీలు, పురపాలక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కలుషిత జలాల కారణంగా ఏడాదికి రెండు లక్షల మరణాలు సంభవిస్తున్నాయని అధికారిక గణాంకాలే చాటుతున్నా- వాటిలో చలనం రావడం లేదు. సాంఘిక, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశీయంగా ఉమ్మడి సమగ్ర దృక్పథంతో నీటి వనరులను సంరక్షించాలని 2012 నాటి జాతీయ జల విధానం ఉద్బోధిస్తోంది. ఆ మేరకు కొరవడుతున్న పాలకుల సమష్టి కృషే- పోనుపోను దేశానికి జలసిరిని దూరం చేస్తోంది. భూగర్భ జలాలూ విపరీతంగా కలుషితమవుతున్న భారతావనిలో- అరవై కోట్ల మంది ఇప్పటికే నీళ్లకోసం తీవ్రంగా అంగలారుస్తున్నారు. 2030 నాటికి దేశీయంగా నీటిఎద్దడి రెండింతలై, జీడీపీలో ఆరుశాతం నష్టానికి కారణభూతమవుతుందనే అంచనాలు ఆ మధ్య వెలుగుచూశాయి. అందుబాటులో ఉన్న జలవనరులను కంటికిరెప్పలా కాచుకోవడంతో పాటు వ్యర్థ జలాల శుద్ధి, వాటి పునర్వినియోగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణ ప్రమాణాలను నిత్యం పెళుసుబారుస్తున్నారంటూ కేంద్రంపై నిరుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలుష్య రక్కసికి కొత్త కోరలు తొడిగే అటువంటి సర్కారీ పెడపోకడలకు అడ్డుకట్ట పడితేనే- జనజీవనం సురక్షితమవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.