గట్లు తెగిన దాహాలు

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే మాట నోట్లోంచి ఊడిపడాలంటే, పాతతరం కనీసం ఓ ఏడాది సాధన చేసేది. ఒక్క ప్రేమలేఖను పూర్తిచేసే ముందు, ఎంత లేదన్నా ఓ పాతిక కాగితాలను నలిపి ఉండలు చేసేది.

Published : 29 Jan 2023 00:09 IST

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే మాట నోట్లోంచి ఊడిపడాలంటే, పాతతరం కనీసం ఓ ఏడాది సాధన చేసేది. ఒక్క ప్రేమలేఖను పూర్తిచేసే ముందు, ఎంత లేదన్నా ఓ పాతిక కాగితాలను నలిపి ఉండలు చేసేది. పడుచుపిల్ల చేయి తగిలిందంటే చాలు- పోరగాడి దేహం గగుర్పాటుకు లోనయ్యేది. మనసును మైకం ఆవరించేది. ఇదంతా రసమయ సుకుమార శృంగారయాతన. ప్రాయం తొందర చేసినా- శేషేంద్రశర్మ చెప్పినట్లు ‘సముద్ర కెరటాలు తీరాలను దాటి ఎరుగని...’ తరాలవి. హద్దులు మీరని మోహాలవి. పరిణయ అనంతర ప్రణయాలు వారివి. తొలిసారి సీతను చూడగానే రాముడి ఎదలో ‘ఇదమిత్థమని నిర్ణయింపగా రానిది ఏ కోర్కియో రూపు గైకొన్నయట్లు’ తోచిందన్నారు కల్పవృక్షంలో విశ్వనాథ. దాన్ని జన్మాంతర బంధంగా అభివర్ణించారు. పెళ్ళిచూపుల్లో కన్యను చూడగానే ‘భావం’ ఏర్పడాలని వేదం చెప్పిన మాటకు తాత్పర్యం అదే. సీతారాములు ఒకరికొకరు ఎదురైనప్పుడు ఇద్దరికీ ‘లజ్జచే ఎత్తరాని కనురెప్పలవి ఎత్తబడకుండా...’ పోయాయి. పెళ్ళిపీటలపై కూర్చున్న సమయాన భుజాల చిరుతాకిడితో ‘అప్పటి ప్రసరణంబు ప్రసవ బాణుండు నేర్పిన ప్రథమ విద్య...’ గుండెల్లో సందడి చేసిన మధురభావాలు- మన్మథుడు వారికి నేర్పించే తొలి పాఠాలయ్యాయి. పాతతరానికి మనువాడే ముందంతా ఈ తంతు ఇంత సొగసుగాను, రసరమ్యంగాను ఉండేది. అమ్మాయిల్లో అమాయకత్వం, అబ్బాయిల్లో కంగారు తొణికిసలాడేవి. వారి మధ్య లేత శృంగార భావనలు చిలిపిగా సరసంగా సభ్యంగా రసజ్ఞ మనోజ్ఞంగా ఉండేవి. పెళ్ళిచూపుల నాటి ‘భావాన్ని’- వైదిక మంత్రాలు ‘బంధం’గా మలచేవి. భర్తృహరి చెప్పినట్లు ‘చెలువపు తేట లేనగవు చేతను భావము చేత సిగ్గుచే కడగంటి చూపుతో...’ స్త్రీ ప్రణయ జీవన సామ్రాజ్ఞిగా అవతరించేది. పురుషుణ్ని గెలిపించి- రససమ్రాట్‌ను చేసేది. ఇదీ... ఆ రోజుల్లో శృంగారానుభవ క్రమం.

ప్రేమ పేరుతో ‘ముందస్తు’ రుచులకు ఆత్రపడటం, ‘ప్రీ వెడ్డింగ్‌ షూట్‌’పై మోజుతో వివాహ క్రతువులోని పవిత్రతకు దూరం కావడం తాజా సామాజిక పరిణామం. పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి మేనమామ తెచ్చే బుట్టను ‘తరణి’ అంటారు. పుట్టింటిని, మెట్టింటిని తరింపజేస్తుందని దాని ఆంతర్యం. ఆమె పురుషుడి మోహం కోసం కాదు, మోక్షం కోసమని అర్థం. దీన్ని గ్రహించిన నాడు- ‘కేవల దేహమోహితులకు అసలైన స్త్రీ ఎప్పటికీ ఎండమావి’ అంటూ వెల్లంకి గీత చేసిన ఆరోపణకు తావుండేది కాదు. ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అన్న శ్రీశ్రీ వాక్యాన్ని- ‘పుట్టుకతో ముదుర్లు’గా మార్చుకోవలసిన దుస్థితి ఏర్పడేది కాదు. ఈ రోజుల్లో పసితనానికి పదేళ్లు రాకుండానే- మొరటు యౌవనం దురాక్రమణ చేస్తోంది. అమాయకత్వాన్ని చెరిపేస్తోంది. మొన్నటికి మొన్న కర్ణాటకలోని నాగరబావి, దాని పరిసర ప్రాంతాల విద్యార్థుల సంచుల్లో సెల్‌ఫోన్లు ఉన్నాయేమోనని తనిఖీ చేస్తే- కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, మత్తెక్కించే వైట్‌నర్లు కుప్పలుగా బయటపడ్డాయట. ఇంతా చేసి, వారంతా 8-10 మధ్య తరగతుల విద్యార్థులు. సమాజం ఎంత పతనమైపోయిందో చెప్పడానికి ఇది చాలదూ? ‘ఎవరు మీరు బాలికలా... ఎగిరే దీప జ్వాలికలా!’ అని అడిగారొకసారి కవి దాశరథి. కాదు- మృగాళ్ల కాంక్షాగ్ని జ్వాలల్లో మాడి మసై పోతున్న శలభాలు! పక్వానికి రాకముందే నేలరాలిపోతున్న లేత వడపిందెలు. ఇప్పుడు ఆ ‘కూప నట ద్భేకములకు(నూతిలో గెంతే కప్పలకు) నాక ధునీ(ఆకాశ గంగ) శీకరముల చెమ్మ...’ దాంపత్య పావన జీవన సుర నదీ జలాల్లోని తడిని- పరిచయం చేయడం ఎలా... ఓ మహాత్మా! ఓ మహర్షీ!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.