శిశువికాసానికి నవచేతన

ఏ దేశంలోనైనా, ఖండమేదైనా... ప్రజారోగ్యమే జాతి సౌభాగ్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా మాతాశిశువుల్ని, తల్లి కడుపులో బిడ్డల్ని సైతం కంటికి రెప్పలా సంరక్షించడం ప్రజాప్రభుత్వాల విధ్యుక్తధర్మం. సంక్షేమ చర్యలెన్నో చేపడుతున్నామని పాలకులు చాటుకుంటున్నా, దశాబ్దాల తరబడి దేశీయంగా పేదరికం పొత్తిళ్లలో బంగరుబాల్యం కమిలిపోతోంది.

Published : 20 Apr 2024 00:51 IST

ఏ దేశంలోనైనా, ఖండమేదైనా... ప్రజారోగ్యమే జాతి సౌభాగ్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా మాతాశిశువుల్ని, తల్లి కడుపులో బిడ్డల్ని సైతం కంటికి రెప్పలా సంరక్షించడం ప్రజాప్రభుత్వాల విధ్యుక్తధర్మం. సంక్షేమ చర్యలెన్నో చేపడుతున్నామని పాలకులు చాటుకుంటున్నా, దశాబ్దాల తరబడి దేశీయంగా పేదరికం పొత్తిళ్లలో బంగరుబాల్యం కమిలిపోతోంది. నవజాత శిశువులు, రేపటిపౌరుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాధ్యతాయుతంగా కృషిసల్పడంలో వ్యవస్థాగత వైఫల్యం బాలభారతాన్ని కృశింపజేస్తోంది. దేశభవిత గిడసబారుతోందన్న విమర్శల నేపథ్యంలో కేంద్రం తాజాగా ఎన్నదగ్గ చొరవ కనబరచింది. అంగన్‌వాడీల పరిధిలోని మూడేళ్లలోపు పిల్లలు ఆడుతూ పాడుతూ అభ్యసన సామర్థ్యం సంతరించుకోవడానికి వీలుగా ‘నవచేతన’ పేరిట సరికొత్త పాఠ్యప్రణాళికను సిద్ధంచేసింది. పసిపిల్లల్లో సాధారణంగా గ్రహణశక్తి అధికంగా ఉంటుంది. నూతనంగా కనిపించే ఏదైనా సరే వారిలో ఉత్సుకత రేకెత్తిస్తుంది. చూస్తూ తెలుసుకోవడం, చేస్తూ నేర్చుకోవడంలో... పసికందుల తరవాతే మరెవరైనా! తొలి మూడేళ్లలోనే శిశువుల మెదడు 75శాతం దాకా అభివృద్ధి చెందుతుందంటారు. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డనుంచి మూడేళ్ల పిల్లల దాకా రకరకాల పనులు చేస్తూ ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసం ‘నవచేతన’ను లక్షించారు. వివిధ మంత్రిత్వశాఖలు, ఎన్‌సీఈఆర్‌టీ (జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి), దిల్లీ విశ్వవిద్యాలయం... ఇలా భిన్న నేపథ్యాల ప్రతినిధులతో కూడిన కమిటీ క్రియాశీల పాఠ్యప్రణాళికను రూపొందించింది. దాని ప్రాతిపదికన పిల్లలకు రంగులు, ధ్వనులు, వాసనలను పరిచయం చేస్తారు. బొమ్మలతో ఆటలు నేర్పుతారు. వీటన్నింటికీ సంబంధించి 14లక్షల అంగన్‌వాడీల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామంటున్నారు. పిల్లలు చురుగ్గా నేర్చుకుని మెరుగ్గా రాణించేలా ప్రణాళికను సిద్ధం చేయడం ఒకెత్తు, పకడ్బందీ కార్యాచరణ మరొకెత్తు. పిల్లల్లో జ్ఞానవికాస కృషిలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన అంగన్‌వాడీ సిబ్బంది అందుకు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారన్నది గడ్డుప్రశ్న.

అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 10కోట్లమంది పిల్లలు, బాలింతలు, చూలింతలకు అంగన్‌వాడీ కేంద్రాలు పోషకాహారం పంపిణీ చేస్తున్నాయి. వాటిలో సుమారు 13.48లక్షల మంది కార్యకర్తలు, 10లక్షల మందికి పైగా సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది ఖాళీలు, పోషకాహార పంపిణీలో అవకతవకలు, పర్యవేక్షణ లోపాలు స్త్రీ శిశు సంక్షేమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. లెక్కకు మిక్కిలి అంగన్‌వాడీలు- స్థానిక పెత్తందారులు, అధికార సిబ్బంది అవినీతి కేంద్రాలుగా భ్రష్టుపడుతున్నాయి. నిర్దిష్ట పరిమాణాల్లో బియ్యం, పప్పు, నూనెలతో తయారైన పౌష్టికాహారం, గుడ్లు, పాలకు ఎందరో లబ్ధిదారులు నోచుకోవడం లేదన్న విమర్శలు ముమ్మరిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటిచోట్ల కడుపునిండా తిండికి నోచుకోని పిల్లల రూపేణా డొక్కలెండుతున్న బాల్యం తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎన్నో సమస్యలకు నెలవులుగా పరువు మాయడమే కాదు- ఏపీలోని అంగన్‌వాడీల సిబ్బంది జగన్‌ సర్కారు వాగ్దానభంగానికి, వంచనకు పాల్పడిందంటూ రగిలిపోతోంది. వేతనాల పెంపుదల కోరి ఉద్యమించినవారిలో 70వేల మంది ఉపాధిపై జగన్మాయ ప్రభుత్వం వేటువేసింది. పూట గడవడమే కష్టంగా ఉందని ఆక్రందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకిప్పుడు జీతాలూ లేవు, టీఏ డీఏలు గ్యాస్‌ బిల్లులు ఇతరత్రా బకాయిల చెల్లింపులూ లేవు! అంగన్‌వాడీ కేంద్రాల పని తీరు, రాష్ట్రాలవారీగా వాటి సిబ్బంది లేవనెత్తుతున్న సమస్యల పరిష్కరణపై దృష్టి సారించకుండా కేంద్రప్రభుత్వ నూతన చొరవ ఫలించే వీల్లేదు. క్షేత్రస్థాయి స్థితిగతుల్ని చక్కదిద్దకుండా కొత్త ప్రయోగాలేవీ సఫలమయ్యే అవకాశం లేనే లేదు. మూడేళ్ల లోపు పిల్లల్లో నవచేతనను రగిలించాలని అభిలషిస్తున్న కేంద్రమే- అంగన్‌వాడీలను గాడిన పెట్టి, అన్నిందాలా పరిపుష్టీకరించి, జవాబుదారీతనం మప్పాలి. అప్పుడే దేశంలో బాల్యానికి, మాతృత్వానికి సరైన భరోసా దక్కుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.