భీతిల్లజేస్తున్న వీధికుక్కలు

ఊరూరా వాడవాడలా గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వీధికుక్కలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల మందల మాదిరిగా మీదపడి ముక్కుపచ్చలారని చిన్నారులను అవి బలితీసుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్ళేవారినీ వెంబడించి తీవ్రంగా గాయపరుస్తున్నాయి.

Published : 25 Apr 2024 01:03 IST

ఊరూరా వాడవాడలా గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వీధికుక్కలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల మందల మాదిరిగా మీదపడి ముక్కుపచ్చలారని చిన్నారులను అవి బలితీసుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్ళేవారినీ వెంబడించి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో ఇటీవల ఇంటిముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు పొట్టనపెట్టుకున్నాయి. భాగ్యనగరంలోనే బాగ్‌అంబర్‌పేటలో శునకాల దాడిలో నిరుడు నాలుగేళ్ల బాలుడు అన్యాయంగా చనిపోవడం అందరినీ కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో మంచంపై నిద్రిస్తున్న పదహారు నెలల పసిపాపనూ కుక్కలు గొంతుపట్టి ఈడ్చుకెళ్ళి ఇలాగే హతమార్చాయి. చిత్తూరులో ఇటీవల ఒక పిచ్చికుక్క స్వైరవిహారం ధాటికి ఒక్కరోజే 41 మంది క్షతగాత్రులయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ ఇదే తరహా ఘటనల్లో ఎంతోమంది బాధితులయ్యారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశీయంగా 2023లో దాదాపు 27 లక్షల కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే వీధికుక్కల బాధితుల సంఖ్య నిరుడు 26శాతం అధికమైంది. గతేడాది తెలంగాణలో లక్ష, ఆంధ్రప్రదేశ్‌లో 1.89 లక్షల కుక్కకాట్ల ఉదంతాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడున్నర నెలల్లోనే తొమ్మిది వేల మందికి పైగా శునకాల పంటిగాట్లకు బాధితులయ్యారు. తీవ్ర వేడిమి, ఆహార కొరత వల్ల ఎండాకాలంలో శునకాలు మరింతగా వెర్రెత్తిపోయి కనిపించినవారిపై విరుచుకుపడతాయని పశువైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఉదాసీనతే వీధికుక్కల సంతతిని ఇబ్బడిముబ్బడి చేస్తూ, ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది!

లోకల్‌ సర్కిల్స్‌ స్వచ్ఛంద సంస్థ మొన్నామధ్య నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 79శాతం ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధికుక్కల బెడదపై ఆందోళన వెలిబుచ్చారు. దేశీయంగా సుమారు రెండు కోట్ల శునకాలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగాడుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), దిల్లీ ఎయిమ్స్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. వాస్తవంగా సందుగొందుల్లో సంచరించే కుక్కల సంఖ్య అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇతర పరిశీలనలు చాటుతున్నాయి. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం- వీధి శునకాలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబిస్‌ టీకాలు వేయించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. న్యాయపాలిక నిర్దేశాల అమలులో యంత్రాంగం దారుణ అలక్ష్యమే- వీధికుక్కల సమస్యను తీవ్రతరం చేస్తోంది. భాగ్యనగరంలోని నాలుగు లక్షల శునకాల్లో సుమారు మూడోవంతు వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు జరగనేలేదని అంచనా! కుక్కకాటు వల్ల సంక్రమించే రేబిస్‌ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ అభాగ్యుల్లో భారతీయులే 36శాతం వరకు ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ దవాఖానాల్లో యాంటీ రేబిస్‌ టీకాల లేమితో చాలామంది నాటువైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశీయంగా 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్నది కేంద్రం లక్ష్యం. అది నెరవేరాలంటే- ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి, శునకాల సంతాన నియంత్రణ చికిత్సలను చురుకెత్తించాలి. హోటళ్లు, మాంసం దుకాణాల యజమానులు ఆహార వ్యర్థాలను ఇష్టారీతిగా వీధుల్లో పారేయకుండా కట్టడిచేయాలి. సర్కారీ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్‌ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచడం అత్యంత కీలకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.