IPL 2024: చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన

చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు.

Updated : 05 May 2024 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న చెన్నైకి (Chennai Super Kings) వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. బోర్డు పిలుపు మేరకు ఇప్పటికే స్వదేశానికి వెళ్లిన ముస్తాఫిజుర్‌ సేవలను సీఎస్కే కోల్పోయిన సంగతి తెలిసిందే. సీనియర్‌ ఆటగాడు దీపక్ చాహర్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. తాజాగా మరో యువ పేసర్‌ పతిరన (Pathirana) బౌలింగ్‌ను కూడా మిస్‌ కానుంది. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు వీసా పనుల నిమిత్తం శ్రీలంకకు వెళ్లి వచ్చాడు. గాయం తిరగబెట్టడంతో కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అతడు మళ్లీ స్వదేశానికి పయనమైనట్లు చెన్నై మేనేజ్‌మెంట్ వెల్లడించింది. అయితే, కోలుకున్నాక వస్తాడా? లేదా? అనేది మాత్రం తెలియజేయలేదు. ‘పతిరన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’’ అని మాత్రమే సీఎస్కే ప్రకటన చేసింది. 

డెత్‌ ఓవర్లలో విలువైన పరుగులను నియంత్రించడంలో పతిరన కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. కేవలం ఆరు మ్యాచుల్లోనే 13 వికెట్లు తీసిన అతడు మిగిలిన మ్యాచుల్లోనూ ఆడి ఉంటే పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకొనే అవకాశం ఉండేది. పతిరన ఇవాళ పంజాబ్‌తో బరిలోకి దిగుతాడని చెన్నై అభిమానులు ఆశించారు. అయితే, మెగా లీగ్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో చెన్నై మేనేజ్‌మెంట్, శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతడి గాయం విషయంలో రిస్క్‌ తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. జూన్ 2 నుంచే పొట్టి కప్‌ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని