USA: ‘భారతీయుల వల్లే అమెరికా టెక్‌ ఇండస్ట్రీ మనుగడ’

USA: అమెరికా టెక్‌ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్‌ వ్యాలీ సెంట్రల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈఓ హర్బీర్‌ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు.

Updated : 05 May 2024 16:08 IST

సిలికాన్‌ వ్యాలీ: నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా భావించే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగే అత్యధిక ఇన్నోవేషన్లకు భారతీయులే నాయకులని ‘సిలికాన్‌ వ్యాలీ సెంట్రల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈఓ హర్బీర్‌ కె భాటియా తెలిపారు. ఇండియన్స్‌ లేకుండా అగ్రరాజ్య టెక్‌ పరిశ్రమ మనుగడ సాగించలేదని పేర్కొన్నారు.

గతంలో సేకరించిన సమాచారం ప్రకారం.. సిలికాన్‌ వ్యాలీలోని 40 శాతం సీఈఓలు/వ్యవస్థాపకులు దక్షిణాసియా లేదా ఇండియా నుంచి వచ్చినవారేనని భాటియా తెలిపారు. గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రధాన కంపెనీలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారని గుర్తుచేశారు. కష్టపడేతత్వం, మెరుగైన ఉత్పాదకత వంటి విలువలే మనల్ని ఉన్నతస్థానాలకు చేర్చుతున్నాయని అభిప్రాయపడ్డారు.

‘‘మనం స్కూళ్లో ఉన్నప్పుడు 98 శాతం మార్కులు సాధిస్తే 100 శాతం ఎందుకు రాలేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. ఈ సంస్కృతే మనల్ని ఇతరుల నుంచి భిన్నంగా ఉంచుతోంది. మనం ఎప్పటికీ సంతృప్తి చెందబోం. ఆ తహతహే మరింత ముందుకు తీసుకెళ్తోంది’’ అని భాటియా వివరించారు. సమస్యలను పరిష్కరించడంలో భారతీయులది చాలా ప్రత్యేకమైన మార్గమని కొనియాడారు. సిలికాన్‌ వ్యాలీ విజయంలో మనది చాలా కీలక పాత్ర అని తెలిపారు.

అమెరికా టెక్‌ పరిశ్రమ కార్యకలాపాలన్నీ భారతీయులే నిర్వహిస్తున్నారని భాటియా తెలిపారు. ఒక ఉద్యోగి అమెరికన్‌ అయితే.. ముగ్గురు భారత్‌ నుంచి పనిచేస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి టెక్‌ కంపెనీ ఆదాయానికి భారతీయులే మూలమని తెలిపారు. టెక్‌, సాగు, ఆరోగ్య సంరక్షణ ఇలా ఏ రంగంలోనైనా పనిచేయగల సామర్థ్యం ఇండియన్స్‌లో ఉందని తెలిపారు. అందుకే వీసాలపై అమెరికా పరిమితి విధిస్తోందని చెప్పారు. లేదంటే ఉద్యోగాలన్నింటినీ మనవాళ్లే సొంతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని