షష్టిపూర్తి వేడుక ఎందుకు?

జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అరవై ఏళ్లు నిండేసరికి.. ఆయా గ్రహాలు జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకు వచ్చి చేరతాయి

Updated : 05 May 2024 17:47 IST

జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అరవై ఏళ్లు నిండేసరికి.. ఆయా గ్రహాలు జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకు వచ్చి చేరతాయి. పుట్టిన సంవత్సరమే మళ్లీ పునరావృతి అవుతుంది. ఆయా సమయాల్లో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలగవచ్చు. గడచిన అరవై ఏళ్లలో చేసిన పాపఫలం రెండో ఆవృత్తంలో తక్కువ కష్టంతోనో, బాధ తెలియకుండానో తీరాలంటే రుద్రుణ్ణి ఆరాధించాలి. రుద్రులు అనేక రకాలుగా ఉంటారు. ఉగ్ర రథుడు అనే రుద్రుడు మనని అరవయ్యో ఏట హింసిస్తాడు. ఆయుష్షు తీరడం, శరీరం అనారోగ్యం పాలై అవయవాలు శిథిలమవడం లాంటి పరిణామాలుంటాయి. కనుక ఉగ్రరథుణ్ణి శాంతింపజేయడం తరుణోపాయం. ఈ శాంతినే షష్ట్యబ్దపూర్తి లేదా షష్టిపూర్తి అంటారు. కృతయుగం నాటి వైశంపాయన మహర్షి.. కలియుగంలో మనుషుల ఆయుర్దాయం తగ్గుతుందని చింతించాడు. వేద వ్యాసుని కలిసి ‘మహర్షీ! దేహం ఉంటేనే కదా ధర్మాలను పాటించగలిగేది! మరి శరీరం లేకున్నా వ్యాధిగ్రస్తమైనా కర్మలను ఎలా ఆచరించడం? కనుక కలియుగంలో ఆయుష్షు పెరిగి.. పుత్ర పౌత్రులతో, సర్వ సంపదలూ అనుభవించేందుకు ఏ ధర్మాన్ని ఆచరించాలి?’ అనడిగితే- వ్యాసుడు ‘ఆయుష్షును, దేహపటుత్వాన్ని పెంచేదే షష్ట్యబ్ది వ్రతం. కలియుగంలో 60 ఏళ్లు రాగానే, శ్రద్ధతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించాలి’ అంటూ బదులిచ్చాడు. అలా వచ్చిందే ఈ ఆచారం.            

- పులిగండ్ల చిదంబరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని