IPO: మారిన ట్రెండ్‌.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!

IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి.

Published : 05 May 2024 16:53 IST

దిల్లీ: వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. బ్లాక్‌స్టోన్‌ మద్దతున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్‌, ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి.

2004 నుంచి మొదలుకొని గత నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఒక్క ఐపీఓ (IPO) కూడా రాలేదు. ఎన్నికల హడావుడి వల్ల ఏప్రిల్‌ - జూన్‌లో పబ్లిక్‌ ఇష్యూలు చాలా తక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం ట్రెండ్‌ మారింది. వచ్చేవారం మూడు మెయిన్‌బోర్డు ఐపీఓలు రూ.6,400 కోట్ల సమీకరణకు సిద్ధమవడం విశేషం. భారత క్యాపిటల్‌ మార్కెట్లు, దేశ దీర్ఘకాల వృద్ధిపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండెజీన్‌ ఐపీఓ..

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న ఇండెజీన్‌ ఐపీఓ (Indegene IPO) మే 6న ప్రారంభమై 8 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.430-452గా నిర్ణయించింది. మొత్తం రూ.1,842 కోట్లు సమీకరించనుంది. రూ.760 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.1,082 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా పొందనుంది. మదుపర్లు కనీసం రూ.14,916తో (గరిష్ఠ ధర వద్ద) 33 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయాలు, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

ఆధార్‌ హౌసింగ్‌ ఐపీఓ..

ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (Aadhar Housing Finance IPO) రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.300-315గా నిర్ణయించింది. పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించిన నిధులను భవిష్యత్‌ మూలధన వ్యయాలతో పాటు కొంత సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం సమీకరణలో రూ.1,000 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.2,000 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా పొందనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం రూ.14,805తో (గరిష్ఠ ధర వద్ద) 47 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

టీబీఓ టెక్‌ ఐపీఓ..

ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించేందుకు టీబీఓ టెక్‌ (TBO Tek IPO) సిద్ధమైంది. దీంట్లో రూ.400 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా కాగా.. మరో రూ.1,151 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద సమీకరిస్తోంది. ధరల శ్రేణిని కంపెనీ రూ.875-920గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం రూ.14,720తో (గరిష్ఠ ధర వద్ద) 16 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడానికి, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని