ఇసుక మాఫియా మూలవిరాట్టు

నదుల్లోంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేయడమంటే- మన సమాధిని మనం తవ్వుకున్నట్లేనని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. వారి హెచ్చరికలకు పూచికపుల్ల పాటి విలువైనా దక్కని జగన్‌ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులూ వంకల్లోని ఇసుకను వైకాపాసురులు యథేచ్ఛగా దోచేశారు.

Published : 01 May 2024 01:09 IST

నదుల్లోంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేయడమంటే- మన సమాధిని మనం తవ్వుకున్నట్లేనని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. వారి హెచ్చరికలకు పూచికపుల్ల పాటి విలువైనా దక్కని జగన్‌ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులూ వంకల్లోని ఇసుకను వైకాపాసురులు యథేచ్ఛగా దోచేశారు. అయిదు కోట్ల ఆంధ్రుల జీవితాలనే కాదు- భావితరాల భద్రతనూ పెనుప్రమాదంలో పడేశారు. రాష్ట్రంలో ఇసుక తోడివేతలను అడ్డుకోవాలని, అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలని ఏపీ సర్కారును సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు, కోర్టు తీర్పులను కాలదన్నుతూ చెలరేగిపోయిన ఇసుకాసురులకు పెద్దన్న జగన్‌మోహన్‌ రెడ్డే అన్నది బహిరంగ రహస్యం! ‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి... లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండ’దంటూ ప్రతిపక్షనేతగా ధర్మోపదేశాలెన్నో సెలవిచ్చారు జగన్‌. అదే మనిషి ముఖ్యమంత్రి అయ్యాక- సుప్రీంకోర్టే కలగజేసుకోవాల్సి వచ్చేంత స్థాయిలో దోపిడి రాజ్యాన్ని నెలకొల్పారు. ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లోని ఇసుక మాఫియా ద్వారా మూడేళ్లలో మూడు వేల కోట్ల రూపాయలను పెద్దలు జేబులో వేసుకున్నారు. నదీమతల్లుల కడుపుచీల్చి కొల్లగొట్టిన కాసుల్లోంచి మూలవిరాట్టుకు సమర్పించుకున్న ముడుపులు పోగా మిగిలినవి స్థానిక నేతలు, గుత్తేదారుల పరమయ్యాయి. దోపిడి దందాలపై సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పిస్తూ- ‘ఇప్పటికి రూ.10వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశా’రంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇసుకాసురులపై ఈగైనా వాలనివ్వకుండా యంత్రాంగం వెన్నెముకను విరిచేసి అరాచకాలను వ్యవస్థీకృతం చేసిన జగన్‌మోహన్‌ రెడ్డి మహాపాతకం క్షమించరానిది!

నదిలో ఎనిమిది మీటర్ల మందాన ఇసుక ఉంటే- అందులో రెండు మీటర్ల వరకే తవ్వాలన్నది వాల్టా చట్ట నిబంధన. మూడు నుంచి ఎనిమిది మీటర్ల మందంలో ఇసుక ఉన్నప్పుడు- ఒక మీటరు(3.28 అడుగుల)కు మించి తవ్వరాదు. చట్టాలను చాపచుట్టేసిన జగన్‌ ఏలుబడిలో 30 అడుగుల లోతుకు పైగా నదులను తవ్వేసి ఇసుకను తరలించుకుపోయారు. పరిమితికి మించిన తవ్వకాల వల్ల నదుల గమనం మారిపోతుంది. వానాకాలంలో వరదల ముప్పు పెచ్చరిల్లుతుంది. అడుగున మట్టి తగిలేంత వరకు ఇసుకను తోడేసిన చోట్ల నదీజలాల్లో ఉప్పదనం పెరిగిపోతుంది. భూగర్భ జలాలూ పడిపోతాయి. చిత్తూరు జిల్లాలో కౌండిన్య నదిని చెరపట్టిన ఇసుకాసురులు- పదకొండు చెక్‌డ్యామ్‌లను విధ్వంసం చేశారు. అడ్డూఅదుపూ లేని ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పలమనేరు ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో జయమంగళి నదిలో 20 అడుగుల వరకు ఇసుకను తోడిపారేయడంతో చుట్టుపక్కల బోర్లు, భూములు దెబ్బతిన్నాయి. సువర్ణముఖి నదితో పాటు వంకలనూ గుల్లచేసిన జగన్‌ పైశాచికగణాల మూలంగా మడకశిర నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. పి.గన్నవరంలో  జగన్‌ పార్టీ నేతల ధనదాహానికి గోదావరి తీరుతెన్నులే మారిపోయాయి. కృష్ణా, పెన్నా, చిత్రావతి... ఇలా ప్రతి నది జవజీవాలనూ జగన్‌ పెంపకంలోని తోడేళ్లు పీక్కుతిన్నాయి. ఏపీలో ఇసుక మాఫియాతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై, అక్రమ తవ్వకాలకు ఊతమిస్తోందన్నది న్యాయవాది లూథ్రా సుప్రీంకోర్టుకు నేరుగా ఇచ్చిన సమాచారం. నదీగర్భాలనూ వదలని విశృంఖల ఇసుక మేతలతో రాష్ట్ర భవితను బలిపీఠంపైకి ఈడ్చుకుపోయిన జగన్‌ ప్రభుత్వానికి రేపటి ఎన్నికల ద్వారా కఠిన దండన విధించాల్సింది ఇక ప్రజాన్యాయస్థానమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.